జేఎన్‌టీయూకే ప్లాటినం జూబ్లీ; రారండోయ్‌.. వేడుక చేద్దాం..

14 Jul, 2022 20:15 IST|Sakshi

రెండేళ్ల క్రితం అట్టహాసంగా ప్రారంభమైన జేఎన్‌టీయూకే ఇంజినీరింగ్‌ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈనెల 15, 16 తేదీల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించనున్నారు.   

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల 1946లో ఉమ్మడి మద్రాస్‌లో ఉండేది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడ్డాక 1972 జేఎన్‌టీయూ హైదరాబాద్‌ యూనివర్సిటీ ఏర్పడ్డాక కాకినాడ, అనంతపురం, హైదరాబాద్‌ ఈ మూడు ఇంజినీరింగ్‌ కళాశాలలు హైదరాబాద్‌ యూనివర్సిటీ అధీనంలో ఉండేవి. తరువాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఆగస్టు 2008లో జేఎన్‌టీయూ కాకినాడ యూనివర్సిటీ ఏర్పాటు చేసి దాని అధీనంలోకి జేఎన్‌టీయూ కాకినాడ పరిధిలోని కళాశాలను తీసుకువచ్చారు.


కళాశాల ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహణకు సిద్ధం కాగా.. 2020 జూలై 16న ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కే.హేమచంద్రారెడ్డి, మెట్రో రైల్‌ మాజీ ఎండీ ఈ.శ్రీధర్, వర్చువల్‌ విధానంలో వీటిని ప్రారంభించారు. అప్పటి వీసీ రామలింగరాజు, ప్రిన్సిపాల్‌ బాలకృష్ణ కళాశాల ఆవరణలో ప్రారంభించారు. రెండేళ్ల పాటు విద్యార్థులకు అకడమిక్‌ వర్క్‌ షాపులు, ప్రముఖులతో సెమినార్లు నిర్వహిస్తూ వచ్చారు.  

పూర్వ విద్యార్థులు.. ప్రముఖులు 
ఇదే కళాశాలలో ఇంజినీరింగ్‌ విద్యను అభ్యసించి ప్రముఖ స్థానాల్లో ఉన్న వారు ఉన్నారు. బెల్‌ సీఏండీ శాస్త్రి, శాంత బయోటెక్‌ అధినేత పద్మ విభూషణ్‌ వరప్రసాద్‌రెడ్డి, మెట్రో సీఏండీ పద్మవిభూషణ్‌ శ్రీధర్, ఉన్నత విద్య ముఖ్యకార్యదర్శి శ్యామలరావు ఐఏఎస్‌లు కృష్ణబాబు, రవిచంద్ర, జిల్లాకు చెందిన దివంగత ఎస్‌వీప్రసాద్‌ మాజీ ఐఏఎస్, ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు కేంద్ర రంగ సంస్థల్లో ప్రముఖ స్థానాల్లో ఉన్నవారు, శాసన సభ్యులు ఉన్నారు. జేఎన్‌టీయూ కాకినాడ యూనివర్సిటీ వీసీగా చేసిన డాక్టర్‌ రామలింగరాజు, ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్‌ ఉదయభాస్కర్‌ ఇదే కళాశాలలో అభ్యసించారు. 

రెండు రోజుల పాటు కార్యక్రమాలు 
శుక్ర, శనివారాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా వర్సిటీ అతిథి గృహం వద్ద వాటర్‌ ఫాల్‌ పైలాన్‌ నిర్మిస్తున్నారు. తొలిరోజు పైలాన్‌ ఆవిష్కరణ, నక్షత్ర వనం సందర్శన, పరిచయాలు, సాయంత్రం ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త గరికపాటి నరసింగరావు ప్రవచనం ఏర్పాటు చేశారు. రెండోరోజు క్రీడామైదానంలో పూర్వ విద్యార్థులు దాదాపు రూ.రెండు కోట్లతో నిర్మించే అతిథి గృహానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే పూర్వ విద్యార్థులు కళాశాలలో వివిధ విభాగాలకు, పలు ల్యాబ్‌ల నిర్మాణాలకు, కళాశాల అభివృద్ధికి సహకరించనున్నారు.  

ఏర్పాట్లు పూర్తి 
ఇంజినీరింగ్‌ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకల నిర్వహణకు కమిటీలు వేశాం. అవసరమైన ఏర్పాట్లు చేశాం. ఇదే కళాశాలలో అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరిన వారు ఉన్నారు. వారి సహకారంతో కళాశాలను మరింత అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేస్తున్నాం. ఇప్పటికే అందరికీ ఆహ్వానాలు పంపాం. దేశ విదేశాల్లో ఉన్నవారు సైతం స్పందించి కళాశాల అభివృద్ధికి చేయూత ఇస్తామంటున్నారు. నా హాయాంలో ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉంది.  
– డాక్టర్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు, వీసీ జేఎన్‌టీయూకే  

మరిన్ని వార్తలు