Women Safety Tool: ‘టచ్‌’ చేస్తే షాకే!

26 Apr, 2021 02:55 IST|Sakshi
ఉమెన్‌ సేఫ్టీ పరికరాన్ని రూపొందించిన విద్యార్థినులు

ఉమెన్‌ సేఫ్టీ పరికరాన్ని రూపొందించిన కాకినాడ ఇంజనీరింగ్‌ విద్యార్థినులు 

బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): మహిళలపై నానాటికీ పెరుగుతున్న అరాచకాలను దృష్టిలో ఉంచుకుని తూర్పు గోదావరి జిల్లా సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థినులు ఉమెన్‌ సేఫ్టీ పరికరాన్ని రూపొందించారు. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌కు చెందిన మౌనిక, దివ్య, ఎస్‌.మహేశ్వరి, ఆశ్రిత, ఐశ్వర్య, సంకీర్తన, మోనిష, గాయత్రిలతో కూడిన బృందం ఈ పరికరాన్ని తయారుచేసింది.

విజిటింగ్‌ కార్డు సైజ్‌ ఉండే ఈ పరికరాన్ని మహిళలు లోదుస్తుల్లో లేదా పాకెట్‌లో ఎక్కడైనా అమర్చుకోవచ్చు. దాన్ని ఎవరైనా ముట్టుకుంటే వెంటనే వారికి కరెంట్‌ షాక్‌ తగిలి, దాదాపు 5 నిమిషాల పాటు ఏమీ చేయలేకుండా ఉండిపోతారు. ఆ సమయంలో మహిళలు ఆపద నుంచి బయటపడొచ్చని, ఈ పరికరం వారికి ఎంతో ఉపయోగపడుతుందని ప్రాజెక్టు గైడ్‌ వి.శేషగిరిరావు తెలిపారు. పరికరం తయారీకి విజిటింగ్‌ కార్డు సైజ్‌ బోర్డు, రెండు స్టీల్‌ పేట్లు, 4 ఓల్ట్‌ బ్యాటరీ, ఫ్రీక్వెన్సీ ట్రాన్స్‌ఫార్మర్, స్పార్క్‌ గ్యాప్‌ కెపాసిటర్, పుష్‌ ఆన్‌ స్విచ్‌ వాడామని చెప్పారు. అరగంట చార్జింగ్‌ పెడితే దాదాపు 6 గంటల వరకు ఈ పరికరం పనిచేస్తుందన్నారు. 

మరిన్ని వార్తలు