ఆలస్యంగా పశ్చాత్తాపం

26 Apr, 2021 03:04 IST|Sakshi

చేసిన తప్పును గ్రహించినప్పుడు పశ్చాత్తాపపడటం, ఆ తప్పువల్ల బాధపడినవారికి క్షమాపణ చెప్పడం నాగరిక లక్షణం. అందుకు కాలపరిమితి వుండదు. దశాబ్దాలక్రితం జరిగినా, శతాబ్దాలక్రితం జరిగినా ఆ పని చేయాల్సిందే. బ్రిటన్‌ ఆలస్యంగానైనా అలా చేసింది. తన వలసలుగా మార్చుకున్న దేశాలనుంచి మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో లక్షలమంది సైనికులను బ్రిటన్‌  సమీకరించింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ యుద్ధానికి వెళ్లినవారు కొందరైతే... ప్రభుత్వ దాష్టీకానికి భయపడి వెళ్లినవారు మరికొందరు. సైనికులుగానే కాదు...సేవకులుగా, వంట మనుషులుగా, ఇంకా అనేకానేక ఇతర సేవల నిమిత్తం కూడా వెళ్లినవారున్నారు. 1914 జూలై 28న మొదలై ఆ ఏడాది నవంబర్‌ 11తో ముగిసిన ఆ యుద్ధంలో పాల్గొన్నవారు మొత్తంగా ఏడు కోట్లమంది వుంటారని అంచనా. వారిలో ఆరుకోట్లమంది పరస్పరం కలహించుకుంటున్న యూరోప్‌ దేశాలకు చెందినవారు కాగా, మిగిలినవారంతా ఆ దేశాల వలస పాలనలో చిక్కుకున్న వెనకబడిన దేశాలవారు.

మరణించినవారిలో ఆనాటి అవిభక్త భారత్‌కు చెందిన దాదాపు 50,000మంది వున్నారు. ఇష్టంగానో, అయిష్టంగానో బ్రిటన్‌ పాలకుల ప్రయోజనాలను కాపాడే క్రమంలో బలైపోయినవారిపట్ల బ్రిటన్‌కు ఏమాత్రం గౌరవమర్యాదలు లేకుండాపోయాయి. తమ దేశస్తుల స్మతికి ఘన నివాళులర్పించేవిధంగా విడివిడిగా సమాధులు నిర్మించి, వారి వివరాలను శిలాఫలకాల్లో పొందుపరిచిన ఆనాటి బ్రిటిష్‌ రాజ్యం...వెనకబడిన దేశాలవారిని చిన్నచూపు చూసింది. వారందరినీ అనామకులుగా పరిగణించింది. మూకుమ్మడిగా ఒక శిలాఫలకంపై పేర్లు రాయించి వూరుకుంది. నిజానికి శిలాఫలకాలకూ నోచనివారు మరిన్ని వేలమంది వుంటారని అంచనా. ఈ వివాదం చాన్నాళ్లుగా నడుస్తున్నా ఏ ప్రభుత్వమూ తప్పిదాన్ని గుర్తించలేదు. వలసలు అంతరించి వేటికవి స్వతంత్ర రాజ్యాలుగా అవతరించినా...ఆ దేశాలపై బ్రిటన్‌ చిన్నచూపు పోలేదు. దాని జాత్యహంకారం జాడ చెరగలేదు. యుద్ధంలో నేలకొరిగినవారు శ్వేతేతరులైనంత మాత్రాన ఇలా చిన్నచూపు చూడరాదన్న ఇంగిత జ్ఞానం దానికి లేకపోయింది. ఆనాడు యుద్ధంలో ప్రాణాలర్పించిన వారిలో తూర్పు, పశ్చిమ ఆఫ్రికాలు, ఈజిప్టు, సోమాలియా దేశాలకు చెందినవారు కూడా వున్నారు. వీరందరినీ బ్రిటన్‌  ఒకే రకంగా అవమానించింది.  

బ్రిటిష్‌ పాలనపై 1857లో ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం జరగడానికి ముందూ వెనకా అనేకప్రాంతాల్లో తిరుగుబాట్లు తలెత్తడానికి బ్రిటిష్‌ పాలకుల దోపిడీ, జాత్యహంకార విధానాలే కారణం. ఈ చరిత్రను కప్పెట్టడానికి అనంతరకాలంలో బ్రిటిష్‌ ప్రభుత్వాలు అనేకవిధాల ప్రయత్నించాయి. తాము ఎదురు లేకుండా ఒకప్పుడు ప్రపంచాన్నేలామని, రెండో ప్రపంచ యుద్ధకాలంలో నాజీయిజాన్ని మట్టి కరిపించామని ఆ దేశ పౌరులు నమ్ముతారు. వలస దేశాల్లో తమ పాలన సమస్తం పరపీడన పరాయణత్వమని, నాజీయిజాన్ని వీరోచితంగా ప్రతిఘటించి మట్టికరిపించింది ఆనాటి సోవియెట్‌ అనే సంగతి వారికి పెద్దగా తెలియదు. పాఠశాల విద్యనుంచీ అవాస్తవిక చరిత్రను బోధించడంతో తప్పుడు ఆధిక్యతా భావం ఆ సమాజంలో ఈనాటికీ కొనసాగుతోంది. అందుకే జాత్యహంకార దుర్గుణం అక్కడింకా పోలేదు. వాస్తవానికి యుద్ధంలో మరణించినవారందరినీ సమానంగా గౌరవించాలని 1917లోనే అనుకున్నారు. అందుకు ఒక కమిషన్‌ వేశారు. అయితే అప్పటి విదేశాంగమంత్రి చర్చిల్‌  అందరికీ ఉమ్మడిగా ఒక ఫలకం సరిపోతుందని సూచనలిచ్చారు.

జాత్యహంకారం నరనరానా గూడుకట్టుకుని వున్న చర్చిల్‌ ఇలా చెప్పడంలో వింతేమీ లేదు.  వేర్వేరు దేశాలనుంచి వచ్చిన సైనికుల వివరాలు తెలియకపోయి వుండొచ్చని కొందరు చేసిన వాదన వీగిపోయింది. యుద్ధంలో పాల్గొంటున్న సైనికులు కొందరు చెప్పిన మాటలను ఆనాటి ఆర్మీ అధికారులు రికార్డు చేశారు. తమ భౌతికకాయాలను దహనం చేసినా, ఖననం చేసినా తమకు అభ్యంతరం లేదుగానీ, శిలాఫలకంపై పేరు, ప్రాంతం వగైరా వివరాలు పొందుపరచాలని వారు కోరుకున్నారని రికార్డుల్లో బయటపడింది. అయినా ఇదే వివక్ష రెండో ప్రపంచయుద్ధంలో మరణించినవారిపట్ల కూడా కొనసాగించారు. ఆ రెండు యుద్ధాల్లోనూ మొత్తంగా 17 లక్షలమంది చనిపోగా, అందులో వలస దేశాల వారు గణనీయంగా వున్నారు. కామన్వెల్త్‌ గ్రేవ్స్‌ కమిషన్‌ పేరిట ఏర్పాటైన బృందం సమాధుల విషయంలో చూపిన వివక్షను ఎత్తిచూపగా ఇప్పుడు బ్రిటన్‌ దాన్ని ఆమోదించి, క్షమాపణలు కోరింది. 

నిజానికి గత తప్పిదాలు క్షమాపణ చెప్పినంత మాత్రాన మాసిపోవు. చరిత్రను మార్చటం కూడా అసాధ్యం. కానీ తమ వల్లగానీ, తమ పూర్వీకుల వల్లగానీ తప్పులు జరిగాయని తెలిసినప్పుడు వ్యక్తులకైనా, దేశాలకైనా అపరాథ భావం ఏర్పడుతుంది. అది సమూలంగా సమసిపోవాలంటే క్షమాపణ కోరడమే మార్గం. పూర్వీకులు చేసిన తప్పులకు తామెలా బాధ్యులమని ప్రశ్నించేవారూ లేకపోలేదు. కానీ వెనకటి తరాల తప్పులను గుర్తించటమంటే, అందుకు క్షమాపణలు చెప్పటమంటే అలాంటి అనాగరిక ధోరణులను పరిహరించుకోవటం... స్వీయ ప్రక్షాళన చేసుకోవటం... మనుషులుగా తమను తాము నిరూపించుకోవటం. వెనకటి తరాల సంపదనూ, జ్ఞానాన్ని అనుభవిస్తూ...వారి తప్పులకు మాత్రం తమ బాధ్యత లేదనడం అనాగరికం. అది ఆలస్యంగానైనా గ్రహించి బ్రిటన్‌ ప్రధాని క్షమాపణ కోరడం మంచిదే.  

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు