నైరుతి రాగం.. రైతుకు లాభం

30 Sep, 2020 05:15 IST|Sakshi

నేటితో ముగియనున్న ఖరీఫ్‌ సీజన్‌

ఈ ఏడాది సాధారణం కంటే 26 శాతం అధిక వర్షపాతం

భారీగా పెరిగిన సాగు విస్తీర్ణం

అనూహ్యంగా పెరిగిన భూగర్భ జలమట్టం

సాక్షి, అమరావతి: ఊహించిన దాని కంటే అధిక వర్షాలు కురిపించిన నైరుతి రుతు పవనాలు అన్నదాతల్లో సంతోషాన్ని నింపాయి. వాతావరణ శాఖ అంచనాల కంటే ఈసారి రాష్ట్రంలో అధిక వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో శ్రీశైలం, నాగార్జున సాగర్‌తోపాటు అన్ని ప్రాజెక్టులు  నిండుకుండల్లా మారాయి. కృష్ణా, గోదావరి, పెన్నా, తుంగభద్ర, కుందూ, వంశధార, మహేంద్ర తనయ నదుల్లో వరద పోటెత్తడంతో భూగర్భ జలమట్టం పైకి వచ్చింది. గత ఖరీఫ్‌తో పోలిస్తే.. ప్రస్తుత సీజన్‌లో సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. జూన్‌ 1న ఆరంభమైన ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ (నైరుతి రుతు పవనాల కాలం) బుధవారంతో ముగియనుంది.

► నైరుతి సీజన్‌లో శ్రీకాకుళం, విజయనగరం మినహా అన్ని జిల్లాల్లో సాధారణ, అధిక వర్షపాతం నమోదైంది. 
► రాష్ట్రంలో సాధారణ సగటు వర్షపాతం 549.1 మిల్లీమీటర్లు కాగా.. ప్రస్తుత సీజన్‌లో 691.6 మిల్లీమీటర్ల (26 శాతం అధికం) వర్షపాతం నమోదైంది.
► మొత్తం 670 మండలాలకు గాను 437 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది.
► 173 మండలాల్లో సాధారణ.. 57 మండలాల్లో లోటు, 3 మండలాల్లో అత్యల్ప వర్షపాతం నమోదైంది. 
► వైఎస్సార్‌ జిల్లాలో అత్యధికంగా 76.3 శాతం అధిక వర్షపాతం నమోదైంది.  

పెరిగిన సాగు
► మంచి వర్షాలు కురవడంతో సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. గత ఏడాది ఖరీఫ్‌లో 32.64 లక్షల హెక్టార్లలో పంటలు వేయగా.. ఈ ఏడాది ఈ నెల 23వ తేదీ నాటికే సాగు విస్తీర్ణం 34.05 లక్షల హెక్టార్లకు చేరింది. 
► వారం రోజుల్లో సాగులోకి వచ్చే పంటల్ని చేరిస్తే సాగు విస్తీర్ణం 35 లక్షల హెక్టార్లకు చేరుతుందని అంచనా.
► గత ఏడాది 5.30 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు చేయగా.. ఈ ఏడాది ఈ నెల 23వ తేదీ నాటికే 6.62 లక్షల హెక్టార్లకు చేరింది. 
► గత ఖరీఫ్‌లో 13.71 లక్షల హెక్టార్లలో వరి సాగవగా.. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటికే 14.35 లక్షల హెక్టార్లకు చేరింది. 
► నూనెగింజల సాగు విస్తీర్ణం గత ఖరీఫ్‌లో 5.81 లక్షల హెక్టార్లు కాగా.. ఈ సీజన్‌లో ఇప్పటికే 7.16 లక్షల హెక్టార్లకు పెరిగింది. 

మరిన్ని వార్తలు