ఆ పార్టీలకు ఓటడిగే హక్కు లేదు

12 Apr, 2021 03:22 IST|Sakshi
తిరుపతిలో మీడియాతో మాట్లాడుతున్న మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తదితరులు

రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించిన బీజేపీ, టీడీపీ

తిరుపతిలో గెలుపు వైఎస్సార్‌సీపీదే

వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు

తిరుపతి ఎడ్యుకేషన్‌: బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలకు తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటు అడిగే హక్కులేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు చెప్పారు. తిరుపతిలో ఆదివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014లో తిరుపతిలో నిర్వహించిన బహిరంగసభలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని, విభజన చట్టాన్ని నెరవేరుస్తామని, 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు ప్రత్యేక హోదా పొడిగిస్తామని ప్రగల్భాలు పలికారని దుయ్యబట్టారు. అదే వేదికపై పవన్‌కల్యాణ్‌ కూడా ఉన్నారన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేశారని విమర్శించారు. ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని బీజేపీ విక్రయానికి పెట్టిందన్నారు. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ ప్రత్యేక హోదాను సాధించలేక ప్రత్యేక ప్యాకేజీతో సరిపెట్టుకుందని విమర్శించారు.

ఆ పార్టీలకు ఓట్లడిగే హక్కు లేదని చెప్పారు. తిరుపతి ఉప ఎన్నికలో సామాన్య కార్యకర్త, నిరుపేద దళితుడైన డాక్టర్‌ గురుమూర్తికి ఎంపీ టికెట్‌ ఇచ్చి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి గెలుపు నల్లేరుపై నడకేనన్నారు. ఆలయాల ధ్వంసం కేసుల్లో టీడీపీ హస్తం ఉన్నా బీజేపీ ఎందుకు మాట్లాడటంలేదన్నారు. ఎన్నికల ప్రచారంలో లోకేశ్‌ ముఖ్యమంత్రిని విమర్శిస్తుండటాన్ని వారి అనుకూల మీడియాలో ప్రచారం చేస్తూ అతడిని హీరో చేయాలనుకుంటున్నారని, ప్రజలు అతడిని కమెడియన్‌లా చూస్తున్నారని ఎద్దేవా చేశారు.

ప్రజారోగ్యం దృష్ట్యా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బాధ్యతగల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి సభను రద్దు చేసుకున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి అందిస్తున్న పారదర్శక పాలన, అవినీతి రహిత ప్రజాసంక్షేమ పథకాలతో ప్రజలు వైఎస్సార్‌సీపీ పక్షాన ఉన్నారని, తిరుపతి ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆయన పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, హఫీజ్‌బాషా తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు