అవాస్తవాల ప్రచారానికి టీడీపీ, రామోజీ ఎన్ని ఆపసోపాలు పడుతున్నారో!

13 Jul, 2021 02:31 IST|Sakshi
తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండలం జలదాం నుంచి వెళ్లే రహదారి

రోడ్డు ఏర్పాటు నేరమా? తవ్విన ఖనిజాన్ని రోడ్డుపై తరలించటం తప్పా?

ఆ రోడ్డును గ్రామస్తులు, ఇతరులు కూడా వాడుతున్నారుగా...! 

దాన్ని తప్పుబడుతూ ఈనాడు, టీడీపీ నేతల రాద్ధాంతంపై విస్మయం 

అనుమతి ఉన్న లీజు నుంచి లేటరైట్‌ తవ్వాక తరలించకుండా ఏం చేయాలి? 

లేటరైట్‌ను రాష్ట్రంలోని చాలా సిమెంట్‌ పరిశ్రమలు కొనుగోలు చేస్తున్నాయి 

ఒక్క కడప సిమెంట్‌ ఫ్యాక్టరీకే తరలిస్తున్నారనటం కుట్రపూరితం కాదా? 

తవ్విన ఖనిజాన్ని రోడ్డుకు దగ్గర్లో నిల్వ చేసుకుంటే తప్పేంటి? 

భారీ వాహనాల్లో కాకుండా సైకిళ్లు, బైకులపై ఖనిజాన్ని తరలిస్తారా? 

నిన్నటి దాకా బాక్సైట్‌ అంటూ రాసిన రాతలేమయ్యాయి? 

లేటరైటే నిజమని తెలిశాక... రోడ్డుపై తరలిస్తున్నారంటూ పిచ్చి రాతలు 

సాక్షి, అమరావతి: నిన్నటిదాకా అక్కడ తవ్వుతున్నది లేటరైట్‌ కాదు... బాక్సైట్‌ను తవ్వేస్తున్నారంటూ అసత్య వార్తలు. తీరా ఆ రాతల్లో అక్షరం కూడా నిజం లేదని తేలేసరికి... ఇపుడు అది లేటరైటే కానీ... దాన్ని అక్రమంగా రోడ్డు మార్గంలో తరలించేస్తున్నారంటూ మరో కథనం!!. ఇదీ ‘ఈనాడు’ తీరు. పైపెచ్చు తవ్విన లేటరైట్‌ను కడపలోని సిమెంట్‌ ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారని, అది కూడా భారీ వాహనాలపై తరలించేస్తున్నారని... దాని కోసం రోడ్డుకు దగ్గర్లోనే లేటరైట్‌ డంప్‌ వేశారని... ఇలా రకరకాల పాయింట్లతో కథనాన్ని వండేసింది ఈనాడు!. నిజానికి కాస్త ఇంగితజ్ఞానం ఉన్నవారెవరికైనా ఈ రాతల్లోని డొల్లతనం ఇట్టే అర్థమైపోతుంది.

ఎందుకంటే లేటరైట్‌ను అధికారికంగా లీజుకు తీసుకున్నపుడు... తవ్విన ఖనిజాన్ని ఒక ప్రాంతం నుంచి మరోచోటకు తరలించడం తప్పు కాదనేది జగమెరిగిన సత్యం. అందుకోసం అందుబాటులో ఉన్న మార్గాన్ని ఎంచుకోవటం కూడా తప్పేమీ కాదు. అయినా అక్కడి రోడ్డు స్థానిక గ్రామాలను కలిపేందుకు కూడా చాలా అవసరం. అలాంటి రోడ్డును లీజుదారు తానే నిర్మించుకుని, వాడుకోవటంలో తప్పేంటన్నది ‘ఈనాడు’కు, ఈ కథనాన్ని పట్టుకుని రాద్ధాంతం చేస్తున్న టీడీపీ నేతలకు మాత్రమే తెలిసిన రహస్యం. అవాస్తవాల ప్రచారానికి టీడీపీ, రామోజీ ఎన్ని ఆపసోపాలు పడుతున్నారో ఈ కథనం చూస్తే తెలియకపోదు.  

దారి అందరూ వినియోగించుకుంటారు... 
విశాఖ జిల్లా నాతవరం మండలంలో లేటరైట్‌ను తవ్వి తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండలానికి భారీ వాహనాల్లో తరలించి నిల్వ చేస్తున్నారనేది కథనం సారాంశం. రౌతులపూడి మండలం జల్దాం నుంచి విశాఖ జిల్లా నాతవరం మండలం సిరిపురం వరకు రోడ్డు నిర్మించడం తప్పనేది వీళ్ల పాయింటు. అసలు ఏదో ఒక దారి లేకుండా తవ్విన ఖనిజాన్ని బయటకు తరలించడం సాధ్యమా? నిర్మించిన రోడ్డు కేవలం ఖనిజ రవాణాకే పరిమితం కాదు కదా!!. పైపెచ్చు లీజుదారు ఖనిజాన్ని వెలికితీసి అమ్ముకోవడానికి ఎక్కడో ఒకచోటుకు తరలించడం తప్పనిసరి.

లీజుకు తీసుకునేదే ఖనిజాన్ని తవ్వి విక్రయించడానికి. అలాంటప్పుడు తవ్వడం, తవ్విన దాన్ని తరలించడం తప్పు ఎలా అవుతుందనేది ఇక్కడ అసలు ప్రశ్న. ఇక లీజుదారు సౌలభ్యాన్ని బట్టి ఎక్కడో ఒకచోట నిల్వ చేసుకోవడం తప్పనిసరి. అందులో భాగంగానే భమిడిక లేటరైట్‌ లీజు ప్రాంతంలో తవ్విన ఖనిజాన్ని రోడ్డుకు దగ్గరగా ఉండటంతో రౌతులపూడి మండలం రాఘవాపురంలో నిల్వ చేసుకున్నారు. దీనికి మైనింగ్‌ శాఖ అనుమతి ఉంది. ఒకవేళ అటవీ ప్రాంతంలో స్టాక్‌ పాయింట్‌ పెడితే అక్కడికి భారీ వాహనాలు వెళ్లడం వల్ల ఇబ్బంది కాదా? అదే జరిగితే వీళ్లు మరో రకంగా రాద్ధాంతం చేసి ఉండేవారని కూడా వినవస్తోంది.  

భారీ వాహనాల్లో కాకుండా సైకిళ్లపై తరలించాలా? 
భారీ వాహనాల్లో యధేచ్చగా తరలిస్తున్నారనేది ‘ఈనాడు’ ఫోటోలతో సహా చేసిన మరో ఆరోపణ. నిజానికి ఖనిజాన్ని భారీ వాహనాలైన టిప్పర్లు, లారీల్లో కాకుండా సైకిళ్లు, బైకులపై తరలిస్తారేమో రామోజీకి, చంద్రబాబుకే తెలియాలి. ఎందుకంటే వారి అనయాయుడు సుజనా చౌదరికి మాత్రమే అలా తరలించే తెలివితేటలున్నాయి కనక. మోటారు సైకిళ్లపై వందల టన్నుల స్టీల్‌ను తరలించిన ఫ్రాడ్‌ చరిత్ర తనకున్నది కనక. ఇక్కడ మైనింగ్‌ అధికారులు ఇచ్చిన పర్మిట్ల ప్రకారమే లీజుదారు స్టాక్‌ పాయింట్‌కు తరలిస్తుండగా... దాన్ని కూడా అక్రమమంటూ చిత్రీకరించే ప్రయత్నం చేయటం ఈనాడుకే చెల్లించదనుకోవాలి.  

కడపే కాదు అన్ని సిమెంటు పరిశ్రమల్లో లేటరైటే 
ఈ ఖనిజాన్ని కడప సిమెంట్‌ పరిశ్రమకు తరలిస్తున్నట్లు టీడీపీ నేతలు పదేపదే విమర్శించటం... ఈనాడు రాయటం కూడా విచిత్రమే. ఎందుకంటే ఖనిజాన్ని తవ్విన తర్వాత లీజుదారు పరిశ్రమలకు అమ్ముకోకుండా ఏం చేస్తారు? కడపలోని సిమెంటు పరిశ్రమలే కాదు రాష్ట్రంలోని అన్ని సిమెంటు పరిశ్రమలకూ కొంత లేటరైట్‌ కావాలి. సిమెంటు తయారీలో దీన్ని కూడా వినియోగించాల్సి ఉంటుంది. కాకపోతే అది ఒక శాతం లోపే. కాబట్టి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని సిమెంట్‌ పరిశ్రమలు ఈ లేటరైట్‌ను కొంటున్నాయి.

అవన్నీ వదిలేసి కడప సిమెంటు పరిశ్రమలకు తరలిస్తున్నారని పేర్కొనటం పెద్ద కుట్రేనన్నది పరిశీలకుల మాట. ఇవన్నీ ఒకెత్తయితే మొన్నటివరకు బాక్సైట్‌ తవ్వకాలు జరిగిపోతున్నాయని హైడ్రామా నడిపిన వారంతా అసలు అక్కడ ఆ ఖనిజమే లేదని నిరూపణ కావడంతో కంగుతిని ఈ కొత్త నాటకానికి తెరతీశారన్నది వాస్తవంగా కనిపిస్తోంది. అది లేటరైటేనని ఒప్పుకుంటూనే... ఖనిజాన్ని తవ్వడం, తరలించడం, నిల్వ చేయడం లాంటి సాధారణ అంశాలు కూడా అక్రమమనే వింత ప్రచారం మొదలుపెట్టడం గమనార్హం. 

లేటరేట్‌ దారి మళ్లలేదు.. అంతా సక్రమమే  
– వీజీ వెంకటరెడ్డి, గనుల శాఖ డైరెక్టర్‌  
అన్ని అనుమతులు తీసుకుని రౌతులపూడి ప్రాంతంలో లీజుదారే రోడ్డు నిర్మించుకున్నారు. అందులో అక్రమం ఏమీ లేదు. మైన్‌లో నుంచి మెటీరియల్‌ తీసుకువెళ్లి స్టాక్‌ పాయింట్‌లో నిల్వ చేసుకున్నారు. స్టాక్‌ పాయింట్‌కు అనుమతి ఉంది. నిబంధనల ప్రకారం కూడా మైనింగ్‌ చేసుకోకూడదంటే ఎలా? మైనింగ్‌ ప్రాంతానికి వెళ్లి ధర్నా చేయడం సరికాదు. మాకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. అక్రమ మైనింగ్‌ను మేమెందుకు ప్రోత్సహిస్తాం? ఏదో జరిగిపోతోందని అమాయకులైన గిరిజనులను రెచ్చగొట్టడం సరికాదు. పర్మిట్ల ప్రకారమే ఖనిజాన్ని తరలిస్తున్నారు. ఎక్కడా ఉల్లంఘన జరగలేదు.  ఇంతకుముందు బాక్సైట్‌ తవ్వుతున్నారని ఆరోపణలు చేశారు. అందులో నిజం లేదని మేం నిరూపించడంతో ఇప్పుడు దారి మళ్లిస్తున్నారని అంటున్నారు. మైనింగ్‌ జరక్కుండా ఆపాలన్నది వాళ్ల ఉద్దేశం కావచ్చు. దానివల్ల ప్రభుత్వానికి నష్టం వస్తుంది. పరిశ్రమలకు మెటీరియల్‌ కొరత ఏర్పడుతుంది. సక్రమంగా ఉన్నా ఏదో ఒక ఆరోపణ చేయడం సరికాదు. అక్రమ మైనింగ్‌ జరిగితే ఉక్కుపాదంతో అణచివేస్తాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం.    

మరిన్ని వార్తలు