వెలగబెట్టేశారు!

30 Sep, 2021 05:09 IST|Sakshi

గ్రామ పంచాయతీలకు గుదిబండల్లా ఎల్‌ఈడీ వీధి దీపాలు

కనీసం నియంత్రణ స్విచ్‌లు కూడా ఏర్పాటు చేయని కాంట్రాక్టర్లు

నిన్న మొన్నటి దాకా గ్రామాల్లో పగలూ వెలుగులే 

గత సర్కారు నిర్వాకాలతో పెద్ద ఎత్తున విద్యుత్తు వృథా

పంచాయతీలకు కరెంట్‌ షాక్‌లు.. ఏటా రూ.70 కోట్ల దాకా అదనపు భారం

ఏప్రిల్‌ నుంచి వీధి దీపాల నిర్వహణ మళ్లీ పంచాయతీలకు 

సగానికి సగం తగ్గిన విద్యుత్‌ బిల్లులు

ఒక్క గ్రామంలోనే ఏటా రూ.25 వేలు ఆదా
అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని మాల్యవంతం గ్రామంలో ఐదు నెలల కిత్రం వరకు ఎల్‌ఈడీ వీధి దీపాలు 24 గంటలూ వెలుగుతుండేవి. గ్రామంలో 325 విద్యుత్‌ స్తంభాలుంటే ప్రతి నెలా 650 యూనిట్ల వరకు కరెంట్‌ వినియోగం అయ్యేది. 2018 జూలై నుంచి అదే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రైవేట్‌ కాంట్రాక్టర్ల అధీనంలో ఉన్న వీధి దీపాల నిర్వహణ బాధ్యతను తిరిగి గ్రామ పంచాయతీలకు అప్పగించడంతో గత జూలైలో వినియోగం 310 యూనిట్లకు తగ్గిపోయింది. అంటే ఒక్క గ్రామంలోనే నెలకు 340 యూనిట్లు ఆదా అవుతోంది. యూనిట్‌ రూ.6.05 చొప్పున పంచాయతీపై కరెంట్‌ బిల్లు భారం ప్రతి నెలా రూ.2,057 తగ్గింది. ఇలా ఒక్క పంచాయతీలోనే ఏడాదికి దాదాపు రూ.25 వేల వరకు ఆదా కానుంది. ఇప్పటికే పెద్ద మొత్తంలో విద్యుత్‌ శాఖకు బిల్లులు చెల్లించినప్పటికీ ఏళ్ల తరబడి వీధి దీపాల కరెంట్‌ వృథా కారణంగా ఇంకా రూ.లక్షల్లో బకాయిలున్నట్లు పంచాయతీకి ప్రతి నెలా నోటీసులు అందుతున్నాయి.
– సాక్షి, అమరావతి

ఏం చేస్తున్నావురా వెంకన్నా...?
మా అయ్య చేసిన అప్పులు తీరుస్తున్నా..!
రాష్ట్రంలో పరిస్థితి ఇప్పుడు ఇదే మాదిరిగా ఉంది. గత సర్కారు మోపిన అవినీతి గుదిబండ భారాన్ని మోయలేక గ్రామ పంచాయతీలు, పంచాయతీరాజ్‌ శాఖ సతమతమవుతున్నాయి. రాష్ట్రంలో 13,371 గ్రామ పంచాయతీలుండగా దాదాపుగా అన్ని గ్రామాల పరిస్థితి ‘మాల్యవంతం’ మాదిరిగానే ఉంది. 2018 నుంచి రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో 9 నుంచి 13 లక్షల దాకా వీధి దీపాలు పగలు రాత్రి తేడా లేకుండా వెలుగుతూనే ఉండటమే దీనికి కారణం. వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణ కోసం టీడీపీ సర్కారు నియమించిన కాంట్రాక్టర్లు నిర్వహణ బాధ్యతలను గాలికి వదిలేశారు. కనీసం పంచాయతీలకైనా అప్పగించకుండా నానా ఇబ్బందులకు గురి చేశారు. చివరకు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి వీధి దీపాల నిర్వహణ బాధ్యత నుంచి కాంట్రాక్టర్లను తప్పించి తిరిగి పంచాయతీలకు అప్పగించింది. పగటి పూట వృథాను నివారిస్తూ ప్రతి 20–30 వీధి దీపాలకు ఒక స్విచ్‌ బాక్స్‌ ఏర్పాటు చేసి పంచాయతీ సిబ్బందికి పర్యవేక్షణ బాధ్యతలు కేటాయించారు. గత రెండు నెలలుగా పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన స్విచ్‌ బాక్స్‌ల ఏర్పాటు చేపట్టారు. కర్నూలు మినహా మిగిలిన 12 జిల్లాలో దాదాపు అన్ని గ్రామాల్లో స్విచ్‌ బాక్స్‌ల ఏర్పాటు పూర్తైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

రూ.వందల కోట్లు ఆదా..
వీధి దీపాలు రాత్రి 6.30 నుంచి తెల్లవారుజాము వరకు సగటున 11 గంటల పాటు వెలిగితే సరిపోతుంది. రోజంతా 24 వాట్ల ఎల్‌ఈడీ బల్బు అనవసరంగా వెలగడం వల్ల ఏడాదికి 114 యూనిట్లు అదనంగా వినియోగం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇదంతా విద్యుత్తు వృథానే. వీధి దీపాల కరెంట్‌కు యూనిట్‌ రూ.6.05 చొప్పున బిల్లు చెల్లించాలి. పగలు కూడా వెలగడంతో ఒక్కో బల్బుకు ఏటా దాదాపు రూ.700 అదనంగా బిల్లు కట్టాల్సి వస్తోంది. 200 వీధి దీపాలుండే చిన్న పంచాయతీపై ఏటా రూ.1.40 లక్షల వరకు అదనపు భారం పడుతోంది. పగటి పూట వెలిగే వీధి దీపాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలపై ఏటా రూ.70 కోట్ల మేర అదనపు భారం పడినట్లు అంచనా. 

15 మంది ప్రైవేట్‌ కాంట్రాక్టర్లకు..
ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ నెడ్‌క్యాప్, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఈఎస్‌ఎస్‌ఎల్‌ ఆధ్వర్యంలో చేపడుతున్నట్టు గత సర్కారు పేర్కొంది. అయితే ఆ తర్వాత టీడీపీ పెద్దల అనుయాయులే కాంట్రాక్టర్ల అవతారమెత్తి ఒప్పందాలు చేసుకున్నారు. 15 మంది కాంట్రాక్టర్లు జిల్లాలవారీగా పంచుకొని రాష్ట్రవ్యాప్తంగా 24.86 లక్షల ఎల్‌ఈడీ బల్బులు మార్పిడి చేశారు. వాటి పర్యవేక్షణ, మరమ్మతుల బాధ్యత సంబంధిత కాంట్రాక్టర్‌దేనని ఒప్పందంలో ఉన్నప్పటికీ నిర్వహణను గాలికి వదిలేశారు. 13 లక్షల వీధి దీపాలకు స్విచ్‌ బాక్స్‌లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో నిరంతరం వెలిగి పెద్ద ఎత్తున విద్యుత్తు వృథా జరిగినట్లు అధికారులు తెలిపారు.

రూ.3,800 కోట్లకు చేరిన బకాయిలు..
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలు చెల్లించాల్సిన కరెంట్‌ బిల్లుల బకాయిలు రూ.3,800 కోట్ల వరకు ఉన్నట్లు అంచనా. కాంట్రాక్టర్ల నిర్వాకంతో వీధి దీపాలు నిరంతరం వెలగడం, ప్రతి నెలా అపరాధ రుసుము పేరుకుపోవడం భారీ బకాయిలకు కారణం. 2018 ఆగస్టు నుంచి పంచాయతీల్లో సర్పంచుల పాలన ముగిసి ప్రత్యేకాధికారుల కొనసాగిన సమయంలో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.

రూ.వెయ్యి బల్బుకు రూ.6,000
పంచాయతీల్లో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ట్యూబ్‌లైట్‌ వీధి దీపాలను అధిక విద్యుత్తు వినియోగం జరుగుతోందంటూ గత సర్కారు 2017లో తొలగించి ఎల్‌డీఈ బల్బులు ఏర్పాటు చేసింది. పంచాయతీలపై రూపాయి భారం పడకుండా వీటిని సమకూరస్తున్నట్లు నాటి పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేష్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రైవేట్‌ కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. ఎల్‌ఈడీ బల్బుల వల్ల ఆదా అయ్యే విద్యుత్‌ బిల్లులో 80 శాతాన్ని సంబంధిత పంచాయతీలు కాంట్రాక్టర్లకు చెల్లించాలంటూ మెలిక పెట్టారు. ఒక్కో బల్బుకు మూడు నెలలకు ఒకసారి రూ.150 చొప్పున ఏడాదికి రూ.600 పదేళ్ల పాటు కాంట్రాక్టర్‌కు చెల్లించాలని ప్రభుత్వం షరతు విధించింది. రూ.1,000 విలువైన ఎల్‌ఈడీ బల్బుకు గ్రామ పంచాయతీ పదేళ్ల పాటు దాదాపు రూ.6,000 కాంట్రాక్టర్లకు చెల్లించేలా గత సర్కారు ఒప్పందం చేసుకుంది.  

మరిన్ని వార్తలు