వాహనదారులపై చిరుత దాడి

8 Aug, 2020 14:33 IST|Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమల క్షేత్రంలో చిరుత భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఘాట్ రోడ్డులో వెళ్లే వాహనదారులపై దాడికి దిగుతుంది. ఒకే రోజు వరుసగా మూడు సార్లు పంజా విసిరింది. ద్విచక్ర వాహనదారులు తృటిలో చిరుత పంజా నుండి తప్పించుకున్నారు. తిరుమల క్షేత్రంలో ఎన్నడు లేని విధంగా చిరుత దాడికి దిగటంతో అటు టీటీడీ అధికారులకు, ఇటు భక్తులు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. శేషాచలం అటవీ ప్రాంతం అంటేనే ఎన్నో క్రూరమృగాలు ఉంటాయి. ముఖ్యంగా చిరుతలు, ఏనుగులు, మిగిలిన జంతువులన్నీ ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. అయితే జనసంచారం పెద్దగా తిరుమలలో లేకపోవడంతో జంతువులన్నీ రోడ్లపైకి వచ్చేస్తున్నాయి. తాజాగా ఓ చిరుత తిరుమలలోని రెండవ ఘాట్ రోడ్డులో ప్రత్యక్షమైంది.

మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వాహనదారుడిపై అలిపిరి టోల్ గేట్ నుంచి సరిగ్గా నాలుగు కిలోమీటర్ల దూరంలో దాడి చేసింది. ఆ తరువాత అక్కడే కూర్చుండి పోయింది. మరో ఇద్దరు వేర్వేరు ద్విచక్రవాహనాల్లో వెళుతుండగా వారి మీద కూడా దాడి చేసింది. వీరిలో ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు కూడా ఉన్నారు. ఎలాగోలా వారు తప్పించుకుని తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి టోల్గేట్ నుంచి సరిగ్గా నాలుగు కిలోమీటర్ల దూరంలో చిరుత ఉందనే సమాచారం టీటీడీతో పాటు అటవీశాఖ అధికారుల దృష్టికి వెళ్ళింది. దీంతో అటవీ శాఖాధికారులు రంగంలోకి దిగారు. 

చిరుతను అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ వాహనాలను మాత్రం యథావిధిగా ఘాట్ రోడ్డులో పంపించేస్తున్నారు. ఐదు, ఆరు వాహనాలను ఒకేసారి తిరుమలకు అనుమతిస్తున్నారు. మరోసారి చిరుత సంచారం శేషాచలం అటవీ ప్రాంతంలో ఉండడంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.

చిరుత దాడి బాధితులు మాత్రం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని తిరుమల కి చేరుకున్నారు. గతంలో అనేకమార్లు చిరుత జనావాసాల మధ్యకు వచ్చిన ఎవ్వుపై దాడికి పాల్పడలేదు. కుక్కలు,పందులు,జింకలు, దుప్పులు లాంటి జంతువుల పై దాడిచేసింది.. చాలా సంవత్సరాల క్రితం నడకదారిలో ఓ ఏడేళ్ల చిన్నారిపై దాడికి పాల్పడింది. మరి నేటి వరకు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. మళ్లి నేడు ఒకే రోజు మూడుసార్లు వాహన దారులపై పంజా విసరటం కలకలం రేపుతుంది.

మరిన్ని వార్తలు