తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీలో చిరుత

17 Oct, 2021 05:09 IST|Sakshi

యూనివర్సిటీ క్యాంపస్‌(చిత్తూరు జిల్లా)/విజయపురిసౌత్‌(మాచర్ల): తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో ఓ చిరుత శనివారం తెల్లవారు జామున రోడ్డు దాటుకుని పొదల్లోకి వెళ్లే దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. గురువారం రాత్రి వర్సిటీ సమాచార కేంద్రం వద్ద ఉన్న ప్రహరీపై చిరుత కూర్చుని ఉండడాన్ని సెక్యూరిటీ సిబ్బంది వీడియో తీసిన విషయం విదితమే. చిరుత సంచరిస్తుందనే సమాచారంతో వర్సిటీ ఉద్యోగులు, విద్యార్థులు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు.  

నెల రోజులుగా తిష్ట! 
శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ వర్సిటీలో గత నెల రోజులుగా చిరుత తిష్ట వేసినట్లు తెలుస్తోంది. వర్సిటీ చుట్టూ ఎతైన ప్రహరీ గోడ ఉంది. అయితే రైల్వే క్రాసింగ్‌ సమీపంలో ఒకటి, వ్యవసాయ కళాశాల వైపు మరో ద్వారం ఉన్నాయి. అర్థరాత్రి సమయంలో ఎవరూ లేని సమయంలో వర్సిటీకి వచ్చి ఉండవచ్చని.. చుట్టూ ప్రహరీ ఉండడం వల్ల తిరిగి వెళ్లలేకపోయిందని వర్సిటీ ఉద్యోగులు భావిస్తున్నారు. కాగా వర్సిటీలో నీటి కుంటలు, దట్టమైన పొదలు ఉండడం వల్ల అక్కడ తలదాచుకుని ఉండవచ్చని పలువురు అనుమానిస్తున్నారు.  

చింతలతండాలో పెద్ద పులి? 
గుంటూరు జిల్లా మాచర్ల మండలం చింతలతండా పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తుందనే వార్తలు సంచలనం రేపుతున్నాయి. వారం రోజులు గడుస్తున్నా పులి జాడ తెలియకపోవడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ విషయంపై విజయపురిసౌత్‌ సెక్షన్‌ డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ ఖాజా రహంతుల్లాను వివరణ కోరగా.. చింతలతండా శివారులోని పంట పొలాల్లో పెద్ద పులి అడుగుజాడలు కనిపించాయన్నారు. చింతలతండా నుంచి అనుపులోని లిఫ్ట్‌ ఇరిగేషన్‌ జాక్వెల్‌ ప్రాంతంలోని సిద్దలదరి వరకు 34 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. పెద్దపులి తిరిగి అడవిలోకి వెళ్లి ఉండవచ్చని రహంతుల్లా అన్నారు.  

మరిన్ని వార్తలు