చదివింది ఏడో తరగతి.. నాదస్వర సాధనలో దిట్ట

6 Sep, 2022 15:04 IST|Sakshi

తండ్రి వారసత్వాన్ని నిలిపే క్రమంలో సంగీత సాధన

చిన్నవయస్సులోనే చక్కటి ప్రతిభ కనబరుస్తున్న కళాకారిణి

దేవాలయాలు, శుభకార్యాల్లో ప్రదర్శనలతో ప్రశంసలు

డోలు, సన్నాయిలా సంగీత సేవలో భార్యాభర్తలు 

మదనపల్లె :  పిట్ట కొంచెం కూత ఘనం.. అన్నట్లుగా ‘ఉష’ చదివింది ఏడో తరగతి అయినప్పటికీ నాదస్వర సాధనలో దిట్ట. ఊపిరి బిగబట్టుకుని సప్తస్వరాలను సన్నాయిలో వినిపించేందుకు మగవారు సైతం జంకే పరిస్థితుల్లో 22ఏళ్ల ఉష నిష్ణాతురాలిలా ప్రదర్శనలు ఇస్తూ పలువురి ప్రశంసలు పొందుతోంది. ఆమె నాదస్వరగానం మంత్రముగ్ధుల్ని చేస్తుంది. శ్రోతలను సంగీత, ఆధ్మాతికలోకంలోకి తీసుకెళుతుంది. తండ్రి నుంచి నేర్చుకున్న విద్యను.. సాధన చేసి మెరుగుపరచుకుని.. కళను కాపాడుకావాలనే లక్ష్యంతో.. భర్త ప్రోత్సాహంతో ముందుకెళుతున్న నాదస్వర కళాకారిణి ఉషపై సాక్షి ప్రత్యేక కథనం...

కర్నాటక సంగీతంలోని గమకాలను యథాతథంగా పలికించగల వాయిద్యాల్లో అగ్రతాంబూలం నాదస్వరానిదే. పురాతనమైన ఆ వాయిద్యం ఎంతో మంగళప్రదమైనది కూడా. అందుకే శుభ కార్యాలలో ఆ వాద్య శ్రవణం చేయడం అనాదిగా ఆచారంగా వస్తోంది. నాదస్వరాన్ని తెలుగులో సన్నాయిగా పిలుస్తారు. తెలుగునాట నాదస్వరంలో నిష్ణాతులైన విద్వాంసులు అరుదనే చెప్పుకోవాలి. పురుషుల ఆధిపత్యం కొనసాగుతున్న ఈ కళలో మహిళలు రాణించడం అరుదైన విషయం. అందులోనూ ఓ 22 ఏళ్ల యువతి రాణించడం విశేషం.       

కర్నాటకలోని గౌనిపల్లెకు చెందిన నాదస్వర విద్వాంసులు సుబ్రహ్మణికి ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి శ్వేత, చిన్నమ్మాయి ఉష. తన వారసత్వ కళను తన పిల్లల్లో ఒకరికి నేర్పిస్తే చాలనుకున్న సుబ్రహ్మణి ఇద్దరు పిల్లలు ఇష్టంగా నేర్చుకునేందుకు ముందుకు రావడంతో ఇంటిపట్టునే సాధన చేయించి నాదస్వరంలో దిట్టలుగా మలిచారు. పురుషుల ఆధిపత్యం కొనసాగుతున్న ఈ కళలో వారికి ఏమాత్రం తీసిపోకుండా తన ఇద్దరు పిల్లలకు నాదస్వర విద్యను నేర్పించి ప్రావీణ్యతను సాధింపజేశారు. ఉష అక్క శ్వేత నాదస్వరాన్ని నేర్చుకునే క్రమంలో ఇంటిపట్టున సాధన చేస్తుండేది. దీన్ని చూసిన ఉష అక్కతో పాటుగా నాదస్వరం నేర్చుకుంటానని పట్టుబట్టింది.  

11వ ఏట సన్నాయిని చేతపట్టిన ఉష సుమారు ఏడేళ్లపాటు కఠోర సాధనతో రాగం, తాళం, స్వరాలపై మంచి పట్టును సాధించింది. తండ్రి సుబ్రహ్మణి  తనతోపాటుగా దేవాలయాలు, శుభకార్యాలు, కచేరీలకు పిల్లలు ఇద్దరినీ తీసుకెళ్లి ప్రదర్శనలు ఇప్పించేవారు. ఈ క్రమంలో పిల్లలిద్దరికీ పెళ్లిళ్లు కావడంతో వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి స్థిరపడిపోయారు. వివాహరీత్యా అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీ–2, వైఎస్సార్‌ కాలనీలో స్థిరపడిన ‘ఉష’.. భర్త పురుషోత్తం, అత్తామామల ప్రోత్సాహంతో తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మదనపల్లె పరిసర ప్రాంతాల్లో జరిగే సంగీతకార్యక్రమాలు, పెళ్లిళ్లు, శుభకార్యాల్లో ‘ఉష’ నాదస్వరాలాపన ప్రత్యేక ఆకర్షణగా మారింది.   

తండ్రి వారసత్వం
ఉష నాన్న సుబ్రహ్మణి నాదస్వర విద్వాంసులు. ఏ గ్రేడ్‌ ఆర్టిస్ట్‌. కోలారు, బెంగళూరు, శ్రీనివాసపురం తదితర ప్రాంతాల్లో జరిగిన త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో ప్రదర్శనలు ఇచ్చి పలువురి ప్రశంసలు పొందారు. ఈ క్రమంలో తొలిసారిగా ఉష తండ్రితో కలిసి తన 17 ఏళ్ల వయస్సులో బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో తొలి ప్రదర్శన ఇచ్చింది. మొదటి ప్రయత్నంలోనే తన నాదస్వరంతో శ్రోతలను ఆకట్టుకోవడంతో ప్రతిభను మరింత మెరుగుపరచుకునే దిశగా అడుగులు వేసింది. సరళి స్వరాలు, జంటలు, అలంకారాలు, పిల్లారి గీతాలు, కృతులు, వర్ణాలు, అన్నమాచార్య కీర్తనలు, లయ, తాళం, రాగం, శృతులను నేర్చుకుంది. మాఘ, చైత్ర, వైశాఖ, శ్రావణమాసాల్లో జరిగే సంగీత కార్యక్రమాల్లో నాదస్వరంలో రాణిస్తూ.. పలు ప్రశంసాపత్రాలు, షీల్డులు అందుకుంది. సన్మానాలు పొందింది. 

డోలు.. సన్నాయి..
ఉష సన్నాయి కళాకారిణి అయితే ఆమె భర్త పురుషోత్తం డోలు విద్వాంసుడు. డోలు, సన్నాయి వేర్వేరు వాయిద్యాలు అయినప్పటికీ ఆ రెండూ కలిస్తే అద్భుతమైన కలయిక. వాటి నుంచి వెలువడే మంగళ వాయిద్యం వినేందుకు ఎంత అద్భుతంగా ఉంటుందో... ఉష, పురుషోత్తంలు కలిసి ఇస్తున్న ప్రదర్శనలు అంతే గొప్పగా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పురుషోత్తం తిరుపతి ఎస్వీ మ్యూజికల్‌ కళాశాలలో ఆరేళ్లపాటు డోలు విద్యలో కోర్సు పూర్తిచేశారు. తిరుమల నాద నీరాజనం, తిరుపతి త్యాగరాజ కళామండపం, టీటీడీ అనుబంధ దేవాలయాల్లో పలు ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు పొందారు. భగవంతుడి అనుగ్రహంతో ఒక్కటైన ఈ జంట.. డోలు, సన్నాయిలా కలిసిపోయి ఒకవైపు వివాహబంధాన్ని కొనసాగిస్తూనే.. మరోవైపు వాయిద్య ప్రదర్శనలతో పలువురిని ఆకట్టుకుంటున్నారు.

మరిన్ని వార్తలు