మంటగలిసిన మానవత్వం, కాసేపటికే వ్యక్తి మృతి

9 May, 2021 13:37 IST|Sakshi

రోగిని దారి మధ్యలోనే దించేసిన ఆటో డ్రైవర్‌..కాసేపటికే మృతి

గోపాలపట్నం (విశాఖ పట్నం): నరవలో జీవీఎంఈ వ్యాన్‌ డ్రైవర్‌గా పని చేస్తున్న సత్తి గంగరాజు (38) అనారోగ్యంతో మృతి చెందారు. గోపాలపట్నం పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..కోటనరవలో నివాసముంటున్న గంగరాజు వ్యాన్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గత నాలుగు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. శనివారం ఉదయం పరిస్థితి విషమించడంతో ఆటోలో బయలుదేరాడు. గోపాలపట్నం స్టేషన్‌ రహదారిలో సాయిబాబా ఆలయ సమీపానికి వచ్చేసరికి అపస్మాకర స్థితిలోకి వెళ్లాడు. దీంతో భయపడిన ఆటో డ్రైవర్‌ గంగరాజును రోడ్డు పక్కన విడిచిపెట్టి వెళ్లిపోయాడు.

కొద్దిసేపటి తరువాత గంగరాజు కుప్పకూలిపోయాడు. అటుగా వెళుతున్న పారిశుద్ధ్య కార్మికులు గమనించి పోలీసులకు సమాచారమందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుని వద్దనున్న పుస్తకంలోని ఫోన్‌ నంబర్ల ఆధారంగా వివరాలు సేకరించారు. మృతుడు పశ్చిమ గోదావరి జిల్లా బావయ్యపాలెం వాసి. అతడి భార్య దుబాయిలో ఉంటోంది. వారికి ఇద్దరు పిల్లలున్నారు. ఉద్యోగ రీత్యా నరవలో ఒక్కడే ఉంటున్నాడు. ఎస్‌.కోటలో నివాసముంటున్న గంగరాజు సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి గోపాలపట్నం శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. గంగరాజు అంత్యక్రియలకు 89వ వార్డు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దొడ్డి కిరణ్‌ రూ. 10వేలు సాయమందించారు.
(చదవండి: విశాఖలోని ఆస్పత్రిపై కేసు నమోదు)

>
మరిన్ని వార్తలు