'విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాజేయాలని చూస్తే ఊరుకోం'

22 Nov, 2020 13:10 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను పోస్కోకు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ ఏయూ మాజీ వీసీ డాక్టర్‌ జీఎస్‌ఎన్‌ రాజు 'పోస్కో వరమా- శాపమా' అనే పుస్తకాన్ని ఆదివారం విశాఖలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌ నరసింగరావు మాట్లాడుతూ.. 'స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం. కేంద్ర ప్రభుత్వం ఒక దురుద్దేశ్య పూర్వకంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర చేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నష్టాలు సాకుగా చూపి దక్షిణ కొరియా సంస్థ పోస్కోకు కట్టబెట్టేందుకు సిద్ధం చేస్తోంది. స్టీల్ ప్లాంట్ పోస్కో ఒప్పందం విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడం దారుణం. ఏపీ మణిహారం విశాఖ స్టీల్ ప్లాంట్. ఎందరో త్యాగాల ఫలితంగా స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం. నవంబర్‌ 26న భారీ ఎత్తున సమ్మెకు దిగుతున్నాం' అని నరసింగరావు పేర్కొన్నారు.

కార్యక్రమంలో స్టీల్‌ప్లాంట్‌ ఐఎన్‌టీయూసీ జనరల్‌ సెక్రటరీ, వైఎస్సార్‌సీపీ నేత మంత్రి రాజశేఖర్‌ మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకుంటాం. ఉద్యోగుల పదవీ విరమణ అంశం వెనక్కి తీసుకోవాలి. స్టీల్ ప్లాంట్‌లో ప్రస్తుతం ఉన్న మ్యాన్ పవర్ సరిపోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది. 18 వేల మంది పర్మినెంట్, మరో 18 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. పరోక్షంగా లక్షలాది మంది ఈ స్టీల్ ప్లాంట్‌పై ఆధారపడి జీవిస్తున్నారు.  (ఉన్నత లక్ష్యంతో పోలీస్‌ ఉద్యోగంలోకి: శ్రావణి)

స్టీల్ ప్లాంట్ ద్వారా ఏడాదికి కేంద్ర ప్రభుత్వానికి 30 వేల కోట్ల రూపాయలు సెంట్రల్ టాక్స్ వస్తున్నాయి. ఏపీకి సేల్స్ టాక్స్ రూపంలో ఆదాయం వస్తోంది. పోస్కో సంస్థను ఒరిస్సా, బెంగాల్‌లో అడుగుపెట్టనీయలేదు. ఏపీలో  విశాఖ తప్పించి మరెక్కడైనా పోస్కో స్టీల్ ప్లాంట్ పెట్టుకోవచ్చు. విశాఖ స్టీల్‌పై పోస్కో కన్ను పడింది, కాజేయలని చూస్తే... ఊరుకోం. పోస్కో విషయంలో కొందరు రాజకీయ లబ్ధి కోసం సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్నారు, అది మానుకోవాలి. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వము చేస్తున్న కుట్ర. దీనిలో రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. (అక్రమ కట్టడాలపై జీవీఎంసీ కొరడా)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా