గైర్హాజరులోని వైద్యులకు మెమోలు

9 Nov, 2022 03:36 IST|Sakshi

వారిపై కఠిన చర్యలకు రంగం సిద్ధం 

విధుల నుంచి తొలగించే యోచనలో ప్రభుత్వం

సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య శాఖలో నెలలతరబడి అనధికారికంగా గైర్హాజరులో ఉన్న వైద్యుల పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది కొరతకు తావులేకుండా సీఎం వైఎస్‌ జగన్‌ సర్కార్‌ చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో 46 వేల వరకు పోస్టులను భర్తీ చేపట్టింది. అయితే కొందరు వైద్యులు కొన్ని నెలల తరబడి విధులకు హాజరవ్వడం లేదు.

ఆ స్థానంలో కొత్త వారిని నియమించలేని పరిస్థితులు ఉంటున్నాయి. దీనివల్ల ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఇబ్బందులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ) పరిధిలో గైర్హాజరులో ఉన్న 112 మంది వైద్యులకు నోటీసులు జారీ చేశారు. వారిలో పలువురు వైద్యులు తిరిగి విధుల్లో చేరగా, మరికొందరు విధుల్లో చేరలేదు.

విధుల్లో చేరని 18 మంది వైద్యులకు చార్జ్‌మెమోలు జారీ చేయబోతున్నట్టు సమాచారం. వీరిలో ఎనిమిది మంది కడప రిమ్స్, 10 మంది తిరుపతి రుయాకు చెందిన వైద్యులు ఉన్నట్టు తెలిసింది. ఇదే తరహాలో మిగిలిన ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యులకు చార్జ్‌మెమోలు జారీ చేసి, వారిని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలని యోచిస్తున్నట్లు తెలిసింది.   

మరిన్ని వార్తలు