పులిచింతల ప్రాజెక్ట్‌: విరిగిన గేటు.. దిగువ ప్రాంతాలు అప్రమత్తం

5 Aug, 2021 21:06 IST|Sakshi

పులిచింతల ప్రాజెక్ట్‌ను పరిశీలించిన మంత్రి అనిల్

సాక్షి, అమరావతి: పులిచింతల ప్రాజెక్ట్‌ను రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ పరిశీలించారు. 16వ నంబర్‌ గేట్ వద్ద సాంకేతిక సమస్యను ఆయన పరిశీలించారు. ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. గేట్లు ఎత్తే సమయంలో హైడ్రాలిక్ గడ్డర్‌ విరిగిపోయిందని మంత్రి అనిల్‌ తెలిపారు. రాత్రి 3.30 గంటల ప్రాంతంలో 16వ నంబర్‌ గేట్‌ ఊడిపోయిందని వివరించారు. ఇప్పటికే ఇద్దరుప్రాజెక్టు ఇంజనీర్లు, నిపుణులు పరిశీలించారని, మరో రెండు ఇంజనీరింగ్ నిపుణుల బృందాల్ని పిలిపించామని తెలిపారు. 6 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నామని, తప్పనిసరి పరిస్థితుల్లో సముద్రంలోకి నీటి విడుదల చేస్తున్నామని మంత్రి అనిల్‌ తెలిపారు.

పులిచింతల ప్రాజెక్టు వద్దకు పలువురు మంత్రులు 
మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు పులిచింతల ప్రాజెక్ట్‌ వద్దకు వెళ్లారు. అధికారులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. 16వ నెంబర్ గేటును పరిశీలించారు. రాత్రి జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. ‘‘ ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటన. వరద తాకిడికి 16వ నంబరు గేట్ కొట్టుకుపోయింది. నీటి సామర్థ్యం తగ్గిస్తేనే గేటు బిగించడం సాధ్యం. గేటును వీలైనంత త్వరగా ఏర్పాటు చేసేందుకు యత్నిస్తున్నారు’’ అని తెలిపారు.

యుద్ధప్రాతిపదికన చర్యలు: సామినేని
ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను మాట్లాడుతూ, యుద్ధప్రాతిపదికన చర్యలు ప్రారంభించామని, రైతులకు ఎలాంటి సమస్య లేకుండా చూస్తామని తెలిపారు.

సాగర్ నుంచి పులిచింతలకు 1.88లక్షల క్యూసెక్కుల నీరు
సాగర్ నుంచి పులిచింతలకు 1.88లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. పులిచింతల నుండి ప్రాజెక్టు 16వ గేటుతో కలిపి మరో 14 గేట్లు ఎత్తడంతో ఇప్పటివరకు 3.50 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 16వ గేట్ అమర్చేందుకు మరో 3 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల చేయాలని, 5 మీటర్లకు నీటిమట్టం తగ్గిస్తేనే గేటు అమర్చడం సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు.


 

మరిన్ని వార్తలు