‘ఆ నిజం నమ్మడం కష్టంగా ఉంది’

25 Sep, 2020 16:38 IST|Sakshi

ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మృతి పట్ల మంత్రులు సంతాపం

సాక్షి, కృష్ణా జిల్లా/చిత్తూరు: గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మృతి పట్ల పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సంతాపం తెలిపారు. సినీ పరిశ్రమలో నలభై ఏళ్ల సినీ ప్రస్థానంలో నలభై వేల పాటలు 11 భాషలలో పాడి, నలభై సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచంలోనే ఒక అరుదైన రికార్డు సృష్టించారని ఆయన తెలిపారు. బాలు కుటుంబ సభ్యులకు భగవంతుడు మనో ధైర్యం ప్రసాదించాలని మంత్రి కొడాలి నాని ప్రార్థించారు.

ధర్మాన కృష్ణదాస్‌ దిగ్ర్భాంతి..
ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మరణం పట్ల డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సినీ లోకానికి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని, అనేక భాషలలో పాటలు పాడి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న బాలు లేని లోటు ఎన్నటికి పూడ్చలేనిదని తెలిపారు.

ఆయన మృతి కలిచివేసింది: ఎమ్మెల్యే రోజా
గాన గంధర్వుడు, తెలుగు కళామ తల్లి ముద్దుబిడ్డ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మృతి కలిచివేసిందని ఏపీఐఐసీ చైర్ పర్సన్, ఎమ్మెల్యే రోజా దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తన నాన్న గారి స్నేహితుడిగా చిన్నప్పటి నుండి తమ కుటుంబానికి ఆయన ఆత్మీయులేనని, వారు లేరన్న నిజం నమ్మడం కష్టంగా ఉందని రోజా పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు రోజా ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ప్రత్యేక ముద్ర వేసుకున్నారు: టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి
తిరుమల: ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మృతి పట్ల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఎస్పీ బాలు బహు భాషల్లో కొన్ని వేల  గీతాలు ఆలపించారని ఆయన చెప్పారు. బాలు లేని లోటు భారతీయ సినీ ప్రపంచానికి, సంగీత అభిమానులకు తీరని లోటని ఆయన పేర్కొన్నారు. సినీ సంగీత ప్రపంచంలో ఆయన ప్రత్యేక ముద్ర వేసుకున్నారని ఆయన చెప్పారు. ఎస్పీ బాలు కుటుంబ సభ్యులకు వైవీ సుబ్బారెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఎస్పీ బాలు మృతి బాధాకరం: ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం బాధాకరమని టీటీడీ మాజీ చైర్మన్, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో తనకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు. ఎస్పీ బాలు కుటుంబ సభ్యులకు భూమన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా