‘నౌకాయానం రంగంలో.. ఏపీ ప్రతిపాదనలను ఆమోదించాలి’

28 Jul, 2021 08:43 IST|Sakshi

మెరైన్‌ ఎయిడ్స్‌ టు నావిగేషన్‌ బిల్లుపై చర్చలో వైఎస్సార్‌సీపీ ఎంపీ మోపిదేవి

సాక్షి, న్యూఢిల్లీ: నౌకాయానం, ఓడరేవులు సంబంధిత రంగంలో ఆంధ్రప్రదేశ్‌ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను ఆమోదించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు కేంద్రాన్ని కోరారు. నౌకాయానానికి సహకారిగా ఉండే సముద్ర ఉపకరణాల బిల్లు–2021పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. నౌకాయాన ఉపకరణాల అభివృద్ధి, నిర్వహణ, యాజమాన్యానికి వీలు కల్పించే ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడం ఈ బిల్లు ముఖ్యోద్దేశమని, లైట్‌హౌస్‌ యాక్ట్‌–1929 చట్టాన్ని దీని ద్వారా తొలగించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలన్నారు. ఏపీకి సంబంధించి 2015లో గుర్తించిన లైట్‌హౌస్‌ల అభివృద్ధిలో పురోగతిలేదని నివేదించారు. దేశ వాణిజ్యం పరిణామాత్మకంగా 95 శాతం, విలువ పరంగా 70 శాతం సముద్రయానం ద్వారానే జరుగుతోందని.. 2019–20లో భారత ఓడరేవులు 1.2 బిలియన్‌ మెట్రిక్‌ టన్నుల మేర సరుకు రవాణాకు వీలు కల్పించాయన్నారు. 

మరిన్ని వార్తలు