రాష్ట్ర జనాభాలో 10% మందికి కోవిడ్‌ టెస్టులు

25 Sep, 2020 07:53 IST|Sakshi

మిలియన్‌ జనాభాకు లక్షకు పైగా టెస్టులు

దేశవ్యాప్తంగా చేసే ప్రతి 100 టెస్టుల్లో 8 ఏపీలోనే..

సాక్షి, అమరావతి: కోవిడ్‌ మహమ్మారిని నియంత్రించేందుకు టెస్టింగ్‌.. ట్రేసింగ్‌.. ట్రీట్‌మెంట్‌ వ్యూహంతో ముందుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ దిశగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర జనాభాలో 10 శాతం మందికి కరోనా టెస్టులు చేసి రికార్డు సృష్టించింది. రోజు రోజుకూ టెస్టుల సంఖ్య పెంచుకుంటూ వచ్చి  మిలియన్‌ (10 లక్షలు) జనాభాకు లక్షకు పైగా టెస్టులు చేస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌ కంటే జనాభాలోనూ, వైశాల్యంలోనూ, సాధనసంపత్తిలోనూ మిన్నగా ఉన్న రాష్ట్రాలేవీ ఈ రికార్డును చేరుకోలేకపోయాయి. ('నీకు కరోనా రాను')

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వెలుగుచూసేనాటికి ఒక్క ల్యాబొరేటరీ కూడా లేకపోయినా గత ఆరు నెలల్లో టెస్టులు చేసే సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుని ఏపీ దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచింది. దేశంలో జరుగుతున్న ప్రతి వంద టెస్టుల్లో 8 టెస్టులు మన రాష్ట్రంలో జరుగుతున్నాయంటే కరోనా నియంత్రణలో ఆంధ్రప్రదేశ్‌ ఏవిధంగా ముందుకు వెళ్తోందో తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రతి పది లక్షల మందిలో 1,00,718 మందికి కోవిడ్‌ టెస్టులు జరుగుతున్నాయి. మొదట్లో మిలియన్‌కు 10వేల మందికి టెస్టులు చేయడానికి 133 రోజులు పట్టగా, తాజాగా ఆ సంఖ్య 7 రోజులకు చేరింది.

>
మరిన్ని వార్తలు