E Mbook: అక్రమాలకు చెక్‌

12 Feb, 2021 06:39 IST|Sakshi

ఇంజనీరింగ్‌ పనుల్లో అవకతవకలకు పూర్తిగా అడ్డుకట్ట

ఇప్పటికే టెండర్‌ వ్యవస్థ ప్రక్షాళన

పారదర్శకతను మరింత పెంచనున్న ఈ–ఎంబుక్‌ విధానం

పరిపాలన అనుమతి నుంచి పని పూర్తయ్యేదాకా వీటి ద్వారానే బిల్లుల చెల్లింపు

కర్నూలు జిల్లాలో విజయవంతమైన జలవనరుల శాఖ ప్రయోగం

ఏప్రిల్‌ 1 తరువాత దశలవారీగా అన్ని ఇంజనీరింగ్‌ శాఖల్లో అమలు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ పనుల్లో పారదర్శకతను మరింతగా పెంచేందుకు ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఒక పనికి పరిపాలన ఉత్తర్వులు, సాంకేతిక అనుమతి జారీ చేసినప్పటి నుంచి.. అది పూర్తయ్యేదాకా బిల్లుల చెల్లింపులను ‘ఈఎంబుక్‌’–డిజిటల్‌(ఎలక్ట్రానిక్‌) మెజర్‌మెంట్‌ బుక్‌ ద్వారా చేయాలని నిర్ణయించింది. కర్నూలు జిల్లాలో ఆర్నెల్ల క్రితం ప్రయోగాత్మకంగా జలవనరుల శాఖ సారథ్యంలో చేపట్టిన పనులకు ఈ–ఎంబుక్‌ ద్వారా బిల్లుల చెల్లింపును చేపట్టింది. అది విజయవంతం కావడంతో ఏప్రిల్‌ 1 నుంచి జలవనరుల శాఖలో చేపట్టే అన్ని పనులకూ ఈ విధానాన్నే వర్తింపజేయాలని నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేశారు. దశల వారీగా మిగిలిన ఇంజనీరింగ్‌ శాఖల్లో అమలు చేయాలని నిర్ణయించారు. దీనివల్ల అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట పడుతుందని ఇంజనీరింగ్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

ఇప్పటికే టెండర్‌ వ్యవస్థ ప్రక్షాళన
2014–2019 మధ్య రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ పనుల్లో గత టీడీపీ ప్రభుత్వం భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడింది. ఈ నేపథ్యంలో సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించాక ఇంజనీరింగ్‌ పనుల టెండర్‌ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేశారు. రూ.100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ అంచనా వ్యయం కలిగిన పనులకు జ్యుడిషియల్‌ ప్రివ్యూ ఆమోదించిన షెడ్యూళ్లతోనే టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాలని ఆదేశించారు. రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ అంచనా వ్యయం ఉన్న పనులకు రివర్స్‌ టెండరింగ్‌ (ఈ–ఆక్షన్‌) నిర్వహించాలని సూచించారు. జ్యుడిషియల్‌ ప్రివ్యూ ద్వారా టెండర్ల వ్యవస్థ కట్టుదిట్టంగా తయారయ్యింది. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించడం ద్వారా ఒక్క జలవనరుల శాఖలోనే ఇప్పటిదాకా రూ.1,141.89 కోట్లు ఆదా అయ్యాయి. ఇక కొత్తగా చేపట్టిన పనులకు రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఒక్క ఈ శాఖలోనే ఇప్పటిదాకా రూ.223.94 కోట్లు మిగలడం గమనార్హం.

టీడీపీ హయాంలో వందల కోట్ల దోపిడీ
గత ప్రభుత్వ హయాంలో ఎం–బుక్‌ (సాధారణ నోట్‌బుక్‌) ఉపయోగించేవారు. పనులు చేయకుండానే చేసినట్లు నమోదు చేయడం, చేసిన పనినే మళ్లీ కొత్తగా చేసినట్లు రికార్డు రాయడం, చేసిన పని పరిమాణం కంటే ఎక్కువ చేసినట్లు చూపించడం చేశారు. తద్వారా భారీ ఎత్తున ప్రజాధనాన్ని దోపిడీ చేశారు. పోలవరంలో మట్టి తవ్వకం పనులు చేయకుండానే చేసినట్లు చూపి రూ.109 కోట్లు దోచేశారు. ఉపాధి హామీ పథకం కింద గతంలో చేసిన పనులనే 2015–19 మధ్య నీరు–చెట్టు కింద మళ్లీ చేసినట్లు చూపి భారీ ఎత్తున దోచేశారు. ఈ అక్రమాల బాగోతం విజిలెన్స్‌ విచారణలో బట్టబయలైంది. దీంతో ఈ తరహా అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలని జగన్‌ సర్కార్‌ నిర్ణయించింది. ఈ–ఎంబుక్‌ ద్వారా బిల్లులు చెల్లించాలని నిర్ణయించి, సీఎఫ్‌ఎంఎస్‌ (కాంప్రహెన్సివ్‌ ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌)లో ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేయించింది. దీనిద్వారా కర్నూలు జిల్లాలో జలవనరుల శాఖ సీఈ మురళీనాథ్‌రెడ్డి నేతృత్వంలో పైలట్‌ ప్రాజెక్ట్‌గా చేపట్టిన ఈ–ఎంబుక్‌ విధానం పూర్తి స్థాయిలో విజయవంతమైంది. అందువల్ల దీనిని పూర్తి స్థాయిలో అమల్లోకి తేవాలని నిర్ణయించారు. 

ఈ–ఎంబుక్‌ ఏం చేస్తుందీ..
గతంలో చేపట్టిన పనిని మళ్లీ కొత్తగా చేపట్టడానికి, ఈ–ఎంబుక్‌ విధానంలో బిల్లులు చెల్లించడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ పనిని నమోదు చేయడానికే ఈ–ఎంబుక్‌ సాఫ్ట్‌వేర్‌ అనుమతించదు.
పనులను పర్యవేక్షించే జేఈ క్షేత్రస్థాయిలో ఏ రోజు చేసిన పనుల పరిమాణాన్ని ఆ రోజే కొలిచి, వారికి ఇచ్చిన ట్యాబ్‌లోని ఈ–ఎంబుక్‌లో పొందుపరుస్తారు. అగ్రిమెంట్‌ నిబంధనల మేరకు15 రోజులు లేదా నెలకు ఒకసారి కాంట్రాక్టర్‌ చేసిన పనులకు చెల్లించాల్సిన బిల్లును ఈ–ఎంబుక్‌ సాఫ్ట్‌వేర్‌ దానంతటదే సిద్ధం చేస్తుంది.
వాటిని ఆన్‌లైన్‌లో డీఈ, ఈఈలకు పంపుతుంది. ఈ–ఎంబుక్‌లో పొందుపరిచిన పనుల పరిమాణం సక్రమంగా ఉందో లేదో పరిశీలించేందుకు డీఈ, ఈఈలు మరోసారి క్షేత్ర స్థాయిలో పనులను కొలిచి, లోపాలు ఏవైనా ఉంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటారు. ఆ తర్వాత లోపాలను సరిదిద్ది ఎస్‌ఈ, సీఈల ద్వారా బిల్లు చెల్లించాలని పీఏవో (పే అండ్‌ అకౌంట్స్‌ ఆఫీస్‌)కు ఆన్‌లైన్‌లో ప్రతిపాదన పంపుతారు. తర్వాత కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లిస్తారు.
దీనివల్ల చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని అధికారుల చుట్టూ కాంట్రాక్టర్లు తిరగాల్సిన అవసరం కూడా ఉండదు. బిల్లులు చెల్లించడానికి కమీషన్లు ఇవ్వాల్సిన అగత్యం ఉండదు.
జేఈ, డీఈ, ఈఈలు రోజు వారీగా క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించి ఈ–ఎంబుక్‌లో పొందుపర్చాల్సి ఉండటంతో, వారు రోజూ క్షేత్ర స్థాయిలో పనులను పర్యవేక్షిస్తున్నారా లేదా అన్నది బయటపడుతుంది. రోజూ పనులను పర్యవేక్షించడం వల్ల పనుల్లో నాణ్యత మరింత పెరుగుతుంది.

పారదర్శకతకు అత్యున్నత ప్రామాణికం
ఇంజనీరింగ్‌ పనుల్లో పారదర్శకతకు అత్యున్నత ప్రమాణికం ఈ–ఎంబుక్‌ విధానం. ప్రస్తుతం ఒక పని పూర్తయ్యేవరకూ బిల్లులను చెల్లించాలంటే పదుల కొద్దీ పనులు ఎం–బుక్‌లలో రికార్డు చేయాల్సి వస్తోంది. అంతేకాకుండా అనేకరకాల అవకతవకలకు అవకాశం ఉంది. అదే ఈ–ఎంబుక్‌ విధానంలో జేఈ రోజూ క్షేత్ర స్థాయికి వెళ్లి తనకు కేటాయించిన పనుల పరిమాణాన్ని కొలిచి ఈ–ఎంబుక్‌లో రికార్డు చేస్తారు. ఒకసారి ఈ–ఎంబుక్‌లో కొలతలను నమోదు చేసిన తర్వాత వాటిని మార్చడానికి అవకాశం ఉండదు. ఇతర అవకతవకలకు తావుండదు. తద్వారా ప్రజాధనం వృథా కాదు. 
– మురళీనాథ్‌రెడ్డి, చీఫ్‌ ఇంజనీర్, కర్నూలు జిల్లా ప్రాజెక్ట్స్‌
(చదవండి: 274 పంచాయతీల్లో ఎన్నికల్లేవు!
)
పోలవరంలో కీలక ఘట్టం పూర్తి
 

మరిన్ని వార్తలు