AP: ‘సాగర’మాయె సంబరమే

31 Jul, 2021 08:51 IST|Sakshi
నాగార్జున సాగర్‌ టెయిల్‌పాండ్‌ ప్రాజెక్టు నుంచి పులిచింతలకు పరవళ్లు తొక్కుతున్న నీరు

నాగార్జున సాగర్‌లోకి 4.24 లక్షల క్యూసెక్కుల ప్రవాహం 

232.62 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ 

శ్రీశైలం నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్టు: జూరాల నుంచి కృష్ణా ప్రవాహం, సుంకేసుల నుంచి తుంగభద్ర వరద ఉద్ధృతి కొనసాగుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లను 15 అడుగుల మేర ఎత్తి దిగువకు వరద ప్రవాహాన్ని విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో నిరంతరాయంగా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. శ్రీశైలం స్పిల్‌ వే గేట్లు, విద్యుత్‌ కేంద్రాల ద్వారా 5.26 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ వరద నాగార్జున సాగర్‌కు చేరుతోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు సాగర్‌లో నీటి నిల్వ 560.1 అడుగుల్లో 232.62 టీఎంసీలకు చేరింది. సాగర్‌ నిండటానికి ఇంకా 80 టీఎంసీలు మాత్రమే అవసరం.  

మూడు రోజుల్లో నిండటం ఖాయం 
ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టుల్లోకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. అక్కడ వచ్చిన వరదను వచ్చినట్టు దిగువకు వదిలేస్తున్నారు. ఈ వరద కనీసం మూడు నాలుగు రోజులు కొనసాగనున్న నేపథ్యంలో.. మూడు రోజుల్లో నాగార్జున సాగర్‌ నిండటం ఖాయమని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సాగర్‌లో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ వదులుతున్న నీటిలో 27,873 క్యూసెక్కులు పులిచింతల ప్రాజెక్టుకు చేరుతున్నాయి. తెలంగాణ సర్కారు పులిచింతల ప్రాజెక్టులో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ ఆ నీటిని దిగువకు వదిలేస్తోంది. ప్రకాశం బ్యారేజీలోకి 18,370 క్యూసెక్కులు చేరుతుండగా.. 7,912 క్యూసెక్కులను కృష్ణా డెల్టాకు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 10,458 క్యూసెక్కులను 14 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు.  

నదీ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తుంగభద్రలో వరద ప్రవాహం క్రమేపీ తగ్గుతోంది. తుంగభద్ర డ్యామ్‌లోకి 52,140 క్యూసెక్కులు చేరుతుండగా.. స్పిల్‌ వే గేట్లు ఎత్తి 29,500 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఇదిలావుండగా.. నాగర్జుసాగర్‌ టెయిల్‌పాండ్‌ విద్యుత్‌ ప్రాజెక్టు నుంచి 28,428 క్యూసెక్కులను దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్‌కు విడుదల చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు