విద్యార్థుల జీవితాలతో నారాయణ ఆడుకున్నారు: ఏజీ పొన్నవోలు

30 Nov, 2022 07:16 IST|Sakshi

స్వీయ ప్రయోజనాలు, లబ్ధి కోసమే ప్రశ్నపత్రం లీక్‌ 

హైకోర్టుకు నివేదించిన అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి 

తీర్పు వాయిదా వేసిన న్యాయమూర్తి జస్టిస్‌ రఘునందన్‌రావు  

సాక్షి, అమరావతి: పదో తరగతి ప్రశ్నపత్రం లీక్‌ చేయడం ద్వారా నారాయణ విద్యా సంస్థ, దాని అధిపతి, మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఎంతో మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. ఇలాంటి వారి పట్ల న్యాయస్థానం మెతక వైఖరి అవలంబించకూడదని అన్నారు. తీవ్ర నేరానికి పాల్పడిన నారాయణకు రిమాండ్‌ తిరస్కరించి, బెయిల్‌ మంజూరు చేయడం ద్వారా మేజి్రస్టేట్‌ తప్పు చేశారని, పరిధి దాటి వ్యవహరించారని, మినీ ట్రయల్‌ నిర్వహించారని తెలిపారు.

ఇది ఎంతమాత్రం సమర్థనీయం కాదని అన్నారు. సెషన్స్‌ కోర్టు ఉత్తర్వుల్లో ఈ కోర్టు జోక్యం చేసుకుంటే, మేజిస్ట్రేట్ల తప్పులను సమర్థించినట్లవుతుందని తెలిపారు. అందువల్ల మేజిస్ట్రేట్‌ ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేస్తూ సెషన్స్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ నారాయణ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావు తీర్పును రిజర్వ్‌ చేశారు. నారాయణ ఈ నెల 30వ తేదీలోపు లొంగిపోవాలంటూ సెషన్స్‌ కోర్టు నిర్దేశించిన గడువును తీర్పు వెలువరించేంత వరకు పొడిగిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.

చదవండి: (ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టు షాక్‌)

మేజి్రస్టేట్‌ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేస్తూ చిత్తూరు సెషన్స్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పొంగూరు నారాయణ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావు మంగళవారం మరోసారి విచారణ జరిపారు. ఏఏజీ సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. నారాయణకు బెయిల్‌ రద్దు ఉత్తర్వులు తాత్కాలికమైనవి కావని, మధ్యంతర ఉత్తర్వులని వివరించారు. అందువల్ల వాటిపై రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేయాలే తప్ప, క్వాష్‌ పిటిషన్‌ కాదని అన్నారు. ఈ సందర్భంగా చట్ట నిబంధనలను, పలు తీర్పులను వివరించారు.

నిబంధనల ప్రకారమే బెయిల్‌ మంజూరు చేయాలి తప్ప, ఫలానా సెక్షన్‌ వర్తించదని రిమాండ్‌ సమయంలో మినీ ట్రయల్‌ నిర్వహించడానికి వీల్లేదని, ప్రస్తుత కేసులో మేజి్రస్టేట్‌ ఇలాంటి ట్రయల్‌ నిర్వహించారని, దీనిపైనే తమ ప్రధాన అభ్యంతరమని తెలిపారు. ప్రశ్నపత్నం లీకేజీ వెనుక ఉన్న కుట్రను ఛేదించాలని, అందుకు నారాయణను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన బాధ్యత దర్యాప్తు అధికారులపై ఉందన్నారు. మేజిస్ట్రేట్‌ ఉత్తర్వుల వల్ల దర్యాప్తునకు విఘాతం కలిగిందన్నారు. విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న వ్యవహారమైనందువల్ల నారాయణ చర్యలను తేలిగ్గా తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. నారాయణ తరపు సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు.

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు