రుచి తగ్గిన బ్రాయిలర్‌.. నాటుకోడికి జై, కిలో రూ.600

1 Sep, 2021 08:57 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,తూర్పుగోదావరి: బ్రాయిలర్‌ రాకతో కనుమరుగైన నాటుకోళ్ల పెంపకం జిల్లాలో మళ్లీ ఊపందుకుంటోంది. మార్కెట్లు, రోడ్ల పక్కన వీటి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. నాటుకోడి గుడ్లు, మాంసాన్ని బలవర్ధక ఆహారంగా పరిగణిస్తారు. పూర్వం మాంసాహార ప్రియుల ఇళ్ల వద్ద కోళ్ల గూళ్లలో 10 నుంచి 30 వరకూ నాటుకోళ్లను పెంచేవారు. ఇంట్లో కూరలకు వీటి గుడ్లనే వినియోగించేవారు. చుట్టాలు వచ్చినప్పుడు వారికి నాటు కోడి కూర పెట్టడంతో పాటు పండగలప్పుడు నైవేద్యాలకు నాటుకోళ్లనే కోసేవారు. 1988–92 మధ్య కాలంలో జిల్లాలో లేయర్‌ కోళ్ల పరిశ్రమ విస్తరణతో తక్కువ ధరకే గుడ్లు లభించడం, ఇళ్ల వద్ద ఖాళీ స్థలాలు కనుమరుగవడంతో రానురానూ నాటుకోళ్ల పెంపకం తగ్గిపోయింది. మరోపక్క దుమ్ములు కూడా మెత్తగా నమలడానికి వీలుగా ఉండే బ్రాయిలర్‌ కోళ్ల వినియోగం పెరిగింది.

అయితే కాలక్రమేణా మాంసాహార ప్రియుల అలవాట్లలో మార్పులొస్తున్నాయి. త్వరగా బరువు పెరగడానికి బ్రాయిలర్‌ కోళ్లకు చేస్తున్న హార్మోన్లు ఇంజక్షన్లు ఆరోగ్యానికి చేటు తెస్తాయన్న భావన పెరిగింది. దీనికితోడు వీటి మాంసం రుచి తగ్గడంతో నాటుకోడి వైపు మాంసాహార ప్రియులు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా నాటుకోళ్ల పెంపకం రెండేళ్లుగా జోరందుకుంది. లాభదాయకంగా ఉండటంతో జిల్లా వ్యాప్తంగా 200 పైగా నాటుకోళ్ల ఫారాలు ఏర్పాటయ్యాయి. గ్రామాల్లోని ఫారాల్లో కోళ్లను పెంచి వారాంతంలో పట్టణాలకు, నగరాలకు తీసుకువచ్చి మార్కెట్లు, రోడ్లు పక్కన ఉంచి విక్రయిస్తున్నారు. మార్కెట్లో నాటుకోడి లైవ్‌ కిలో రూ.600, చికెన్‌ రూ.700 ఉంటోంది. మటన్, నాటుకోడి ధరలు మార్కెట్లో దాదాపు ఒకేలా ఉంటున్నాయి. లేయర్‌ కోడి గుడ్డుతో పోలిస్తే నాటుకోడి గుడ్డులో పోషక విలువలు పుష్కలంగా ఉండటంతో ఒక్కో గుడ్డు రూ.20 పలుకుతోంది.

లాభసాటిగా ఉంది 
నాటుకోళ్లకు డిమాండ్‌ పెరగడంతో రెండేళ్ల క్రితం పశువుల మకాం వద్ద నాటుకోళ్ల పెంపకం ప్రారంభించాం. గుడ్ల ఉత్పత్తికి వినియోగించే కోడిపుంజుకు రూ.75 వేలు, పెట్టకు రూ.12 వేలు వెచ్చించాం. పూర్తి ఆర్గానిక్‌ తరహాలో ఒక్కో బ్యాచ్‌ సిద్ధం కావడానికి ఎనిమిది నెలలు పడుతోంది. మా వద్ద పెంచిన కోళ్లను చికెన్‌ వ్యాపారులు హోల్‌సేల్‌గా తీసుకువెళుతుంటారు. నాటుకోళ్ల పెంపకం లాభసాటిగా ఉంది. 
– పిల్లా విజయ్‌కుమార్, ఆర్గానిక్‌ నాటుకోళ్ల రైతు, పాలతోడు

చదవండి: ప్రకాశం జిల్లా: 11 మంది వీఆర్వోల సస్పెన్షన్‌  

మరిన్ని వార్తలు