రక్త మార్పిడి కలకలం: యువకుడి మృతిపై అనుమానాలు?

1 Sep, 2021 08:57 IST|Sakshi
మృతుడు రామకృష్ణ

రక్తం ఎక్కించిన ఆర్‌ఎంపీ

డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విచారణ

రక్తం ప్యాకెట్‌ స్వాధీనం

ములకలపల్లి: రక్త మార్పిడి చేయించుకున్న యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆర్‌ఎంపీ అందించిన వైద్యం వికటించి మృతి చెందాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమలాపురంలో కలకలం రేపింది. గ్రామానికి చెందిన యువకుడు జక్కా రామకృష్ణ (29) మంగళవారం ఆకస్మిక మృతి చెందగా..ఆర్‌ఎంపీ వైద్యం వికటించడంతోనేనని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. మూడు రోజులుగా నీరసంగా ఉంటోందని మా«ధారంలోని ఓ ఆర్‌ఎంపీ వద్ద చికిత్స పొందుతున్నాడు. సోమవారం ములకలపల్లి సెంటర్‌లోని ఓ రక్తపరీక్షా కేంద్రంలో కమలాపురం గ్రామానికి చెందిన చెందిన ఓ యువకుడి రక్తాన్ని సేకరించి..సదరు మాధారం ఆర్‌ఎంపీ పర్యవేక్షణలో ఎక్కించారు. ఈ క్రమంలో రామకృష్ణ ఆరోగ్యం క్షీణించి..చనిపోయాడని కుటుంబ సభ్యులు అంటున్నారు.
చదవండి: ప్రాణం తీసిన పేకాట.. మద్యంమత్తులో బండరాయితో మోది..


ఆర్‌ఎంపీ నివాసంలో రక్తం పరిశీలిస్తున్న వైద్యారోగ్య శాఖ అధికారులు

అధికారుల విచారణ
మృతుడికి భార్య సమ్మక్క, ఏడాది వయసు కూతురు ఉంది. ప్రస్తుతం ఆమె గర్భిణి. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ పోటు వినోద్‌ కమలాపురం వెళ్లి వివరాలు సేకరించారు. రక్తం ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ములకలపల్లిలోని రక్త పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసి తాత్కాలికంగా సీజ్‌ చేశారు. మాధారంలోని ఆర్‌ఎంపీ ఇంటికి వెళ్లగా ఆయన అందుబాటులో లేడు. అక్కడ మందులను పరిశీలించారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు డిప్యూటీ డీఎంహెచ్‌ఓ తెలిపారు. మృతుడి తల్లి సత్యవతి ఫిర్యాదు మేరకు ఎస్సై సురేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

చదవండి: ‘సారూ.. భూములు లాక్కోద్దు’ తహసీల్దార్‌ కాళ్లపై రైతులు

మరిన్ని వార్తలు