ఎన్‌హెచ్‌ఏఐ కొత్త కార్యాచరణ.. పార్కింగ్‌ స్థలం లేకపోతే మూతే

5 Jul, 2022 10:33 IST|Sakshi

దాబాలు, హోటళ్లకు మార్గదర్శకాలు

రోడ్డు ప్రమాదాల నివారణకు ఎన్‌హెచ్‌ఏఐ కార్యాచరణ

సాక్షి, అమరావతి: రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) కొత్త కార్యాచరణకు ఉపక్రమించింది. జాతీయ రహదారులను ఆనుకుని ఉండే దాబాలు, హోటళ్లకు విధిగా పార్కింగ్‌ స్థలాలు ఉండాలని స్పష్టం చేసింది. నిర్ణీత గడువులోగా తగినంత పార్కింగ్‌ ప్రదేశాలు లేని దాబాలు, హోటళ్లను తొలగించాలని కూడా నిర్ణయించింది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల వెంబడి రోడ్డు ప్రమాదాల తీరును ఎన్‌హెచ్‌ఏఐ విశ్లేషించింది. జాతీయ రహదారులపై ఓ పక్కకు నిలిపి ఉంచే వాహనాలను ఇతర వాహనాలు ఢీకొట్టడమే ఎక్కువ ప్రమాదాలకు కారణమని గుర్తించింది.

జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న దాబాలు, హోటళ్లకు సమీపంలోనే ఎక్కువగా వాహనాలను నిలిపి ఉంచుతున్నట్టు కూడా ఎన్‌హెచ్‌ఏఐ పరిశీలనలో వెల్లడైంది. దాంతో హైవేల వెంబడి ఉన్న దాబాలు, హోటళ్లకు తగినంత పార్కింగ్‌ ప్రదేశాలు తప్పనిసరిగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఎన్‌హెచ్‌ఏఐ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల్లోనూ హైవేల వెంబడి ఉన్న దాబాలు, హోటళ్లను గుర్తించి పార్కింగ్‌ ప్రదేశాలపై నివేదిక సమర్పించాలని కోరింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని హైవేలను ఆనుకుని ఉన్న దాబాలు, హోటళ్లపై ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చేపట్టిన సర్వే దాదాపు పూర్తి కావచ్చింది.

చదవండి: (అల్లూరి విగ్రహావిష్కరణ: రచ్చ చేయబోయి.. చతికిలపడ్డ టీడీపీ) 

పార్కింగ్‌ లేకుండా 40 శాతం దాబాలు, హోటళ్లు
రాష్ట్రంలో దాదాపు 40 శాతం దాబాలు, హోటళ్లకు పార్కింగ్‌ స్థలాలు లేవని సర్వేలో తేలినట్టు సమాచారం. ఆ దాబాలు, హోటళ్లకు త్వరలో నోటీసులు జారీ చేయనున్నారు. మూడు నెలల్లో పార్కింగ్‌ ప్రదేశాలు సమకూర్చుకోవాలని నిర్దేశించనున్నారు. జాతీయ రహదారిని ఆనుకుని 7.50 మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలు ఉండకూడదు. అంటే రోడ్డుకు దాబా, హోటళ్లకు మధ్య కనీసం 7.50 మీటర్ల దూరం ఉండాలి. ఆ మధ్యలో పార్కింగ్‌ ప్రదేశాన్ని చూపించకూడదు.

దాబాకు పక్కన పార్కింగ్‌ ప్రదేశాన్ని వేరేగా చూపించాలి. దాబాలు, హోటళ్ల వద్ద తగిన లైటింగ్‌ సదుపాయం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. తెల్లవారుజామున మంచు కురుస్తున్నప్పుడు కూడా వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఫాగ్‌ లైట్లను ఏర్పాటు చేయాలి. తప్పనిసరిగా టాయిలెట్లు, స్నానాల గదులు ఉండాలి. ప్రతి దాబా, హోటల్‌లో ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లు అందుబాటులో ఉండాలి. ఆ సమీపంలోని ఆస్పత్రులు, పోలీస్‌ స్టేషన్ల ఫోన్‌ నంబర్లు, ఇతర వివరాలతో బోర్డులు ఏర్పాటు చేయాలి. మూడు నెలల్లో పార్కింగ్‌ ప్రదేశాలు ఏర్పాటు చేయని దాబాలు, హోటళ్లను మూసివేయిస్తారు.  

మరిన్ని వార్తలు