నివర్‌ తుపాన్‌: ఏపీలో వర్ష బీభత్సం..

26 Nov, 2020 10:44 IST|Sakshi

సాక్షి, అమరావతి: ‘నివర్‌ తుపాన్‌’ నేపథ్యంలో పలు జిల్లాలో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తుపాన్‌ ప్రభావంతో చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో వర్షాలు ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాలు నీటి మునిగాయి. దీంతో ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

కృష్ణా: 
నివర్ తుఫాన్ ఎఫెక్ట్‌తో మచిలీపట్నంలో తెల్లవారుజాము నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి. వర్షంతో పాటు చలి గాలుల వల్ల జనజీవనం స్తంభించింది. తిరువూరు, గంపలగూడెం, ఏ-కొండూరు, విస్సన్నపేట మండలాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతాంగాన్ని రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశారు. ఉదయం నుంచి వీస్తున్న చలిగాలులు విస్తున్నాయి.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చిత్తూరు:
జిల్లాలోని తిరుపతిలో నివర్ తపాను ప్రభావంతో  లోతట్టు ప్రాంతాలు నీటి మునిగాయి. ప్రాధాన రోడ్లన్ని జలమయం అయ్యాయి. ఎర్ర మిట్ట, జీవకోన, లీల మహల్ సర్కిల్‌, సత్యనారాయణపురం, కొర్ల గుంట, వినాయక సాగర్‌లో పలు గృహాలు నీట మునిగాయి. లీలా మహల్, కరకంబాడి ప్రధాన మార్గంలో నాలుగు అడుగుల మేర వర్షపు నీరు నిలిచింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో సిబ్బంది వర్షపు నీరు ప్రవహిస్తున్న కాలువల్లో జేసిబి సహాయంతో పూడికలు తీస్తున్నారు. 

తిరుమలలో మెదటి ఘాట్ రోడ్డులో 56వ మలుపు వద్ద భారీ వృక్షం కూలిపోయింది. దీంతో టీటీడీ సిబ్బంది ట్రాఫిక్ అంతరాయం తోలిగిస్తున్నారు. స్వామివారి భక్తులకు అధికారులకు సమాచారం అందించారు. సిబ్బంది వృక్షాన్ని తొలగిస్తున్నారు. 

వైఎస్సార్‌ కడప:
జిల్లాలోని ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాల్లో గత 12 గంటలుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రెండు మండలాల్లోని చెరువుల్లోకి వర్షపు నీరు భారీగా చేరుకుంటోంది. ఇప్పటికే పలు చెరువుల్లో 80 శాతం పైగా వర్షపు నీరు చేరింది. చెరువుల్లో నీరు నిండుగా చేరడంతో రెండు మండలాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాగునీరుకు ఇబ్బంది ఉండదని రెండు ఏళ్ల పాటు పంటలు పెట్టు కోవచ్చని రైతులు తెలిపారు. కొద్ది గంటల్లో ఒంటిమిట్ట చెరువు నిండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఒంటిమిట్ట చెరువు కింద 1100 ఎకరాల ఆయకట్టు భూమి సాగులోకి రానుంది. 15ఏళ్లు తర్వాత ఒంటిమిట్ట చెరువుకు నిండుగా నీరు చేరడం ఇదే మొదటిసారి. పుల్లంపేట మండల కేంద్రానికి సమీపంలో ఉన్న పుల్లంగేరు ఉదృతంగా ప్రవహిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొని మానిటరింగ్ చేస్తోంది. అయితే పుల్లంగేరు ప్రవహిస్తుండటంతో రాజంపేట మండలం పోలిచేరువు కింద ఉన్న ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే కోడూరు మండలం జ్యోతికాలనీ వద్ద పొంగి ప్రవహిస్తున్న వంక తిరుపతితో కోడూరు రాక పోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రైల్వే కోడూర్ గుంజన నది లోతట్టు ప్రాంతమైన నరసరావుపేట, ధర్మాపురం, గాంధీనగర్‌లో పలు గృహాలు నీట మునిగాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు జాగ్రత్త వహించాలని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించాలని ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు ఆదేశించారు.

నెల్లూరు:
నివర్ తుఫాన్ తీరం దాటడంతో  జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నెల్లూరు నగరంలో తెల్లవారుజామున నుండే కరెంట్ బంద్ అయింది. మరో పక్క రహదారులపై చెట్లు కూలి పడటంతో ప్రభుత్వ సిబ్బంది వాటిని తొలగింస్తున్నారు. పంటకాలువలు, రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. నెల్లూరు, తడ, సూల్లూరు పేట, నాయుడుపేట, గూడూరు, వాకాడు, కోట, మనుబోలు, ముత్తుకూరు, కావాలిలో కుంభవృష్టి వర్షం కురుస్తోంది. జిల్లాల్లోని 1600 చెరువులు నిండు కుండను తలపిస్తున్నాయి. దీంతో మరింత అప్రమత్తమైన అధికారులు.. చెరువులకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

ఇప్పటికే  జిల్లాలో 950 కుటుంబాలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. సోమశిల, కండలేరు నుంచి భారీగా సముద్రంలోకి నీటి విడుదల చేశారు. సూళ్లూరుపేటలో తుఫాన్ ఎఫెక్ట్‌తో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కాళంగి నదిలోకి భారీగా వరద నీరు చేరుకుంది. చాలా చోట్ల చెట్లు కూలిపోయాయి. నాయుడుపేటలో నివర్ తుఫాన్ ప్రభావంతో రాత్రి కురిసిన వర్షానికి ఎగువ ప్రాంతాల నుండి స్వర్ణముఖి నదికి భారీగా వరద నీరు చేరుకుంటోంది. కండలేరు జలాశయంలో గురువారం ఉదయానికి 60.324 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సోమశిల నుంచి 45 వేల క్యూసెక్కులు నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. జిల్లాలో పరిస్థితిపై మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి అధికారులతో సమీక్షిస్తున్నారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి అనిల్‌కుమార్‌, అధికారులతో కలిసి పర్యటించారు.

పలు రైళ్ల రద్దు: దక్షిణ మధ్య రైల్వే
నివర్ తుపాను దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నడిచే 7 రైళ్లు నిలిపివేసినట్లు తెలిపింది. మరో 8 సర్వీసులను దారి మళ్లించింది. హైదరాబాద్-తాంబరం, మధురై-బికనూరు, చెన్నై సెంట్రల్-సంత్రగచి మధ్య రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. చెన్నై, తిరుపతి, రేణిగుంట, పాకాల వైపు నడిచే మరిన్ని రైలు సర్వీసులకు అంతరాయం కలగవచ్చని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.

కర్నూలు:
నివర్ తుపాన్‌ కారణంగా బనగానపల్లె, కోవెలకుంట్ల,అవుకు, సంజామాల, కొలిమిగుండ్ల మండలాల్లో ఉదయం నుంచి తేలికపాటి వర్షం కురుస్తోంది.

ప్రకాశం: నివర్ర్ తుఫాన్ ప్రభావంతో కందుకూరు,గుడ్లూరు, వలేటివారిపాలెం, లింగసముద్రం, ఉలవపాడు మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. భారీ వర్షాలతో రాళ్లపాడు రిజర్వాయర్‌కు ఇన్ ప్లో  పెరుగుతోంది. రాళ్లపాడు రిజర్వాయర్ ప్రస్తుత నీటి మట్టం 17.8 అడుగులు కొనసాగుతోంది.

అనంతపురం:
తుపాన్‌ కారణంగా కదిరిలో భారీ వర్షం కురుస్తోంది. పలు రోడ్లు జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు బయటకు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.

పశ్చిమ గోదావరి:
జిల్లాలోని తాడేపల్లిగూడెంలో నివర్ తుఫాన్ ప్రభావంతో రాత్రి నుంచి తీవ్ర చలి గాలులతో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. జిల్లా అంతటా చెదురు మదురు వర్షాలతో ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగింది. రాగల 48గంటలు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారలు హెచ్చరికలు జారీ చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా