పనులు సరే.. డబ్బు సంగతి తేల్చండి

24 May, 2021 04:44 IST|Sakshi

పోలవరం నావిగేషన్‌ టన్నెల్, కెనాల్‌ వ్యయంపై నోరుమెదపని ఎన్‌ఐడబ్ల్యూఏ

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నావిగేషన్‌ కెనాల్‌ (నౌకామార్గం)ను జాతీయస్థాయి ప్రమాణాలతో విస్తరించాలని, పునర్నిర్మించాలని ప్రతిపాదించిన జాతీయ అంతర్గత జలరవాణా సంస్థ (ఎన్‌ఐడబ్ల్యూఏ).. అందుకయ్యే వ్యయాన్ని భరించడంపై మాత్రం నోరుమెదపడం లేదు. నావిగేషన్‌ కెనాల్‌ నిర్మాణానికి అయ్యే వ్యయంతో కేంద్ర జల్‌శక్తిశాఖకు సంబంధం లేదని, ఆ వ్యయాన్ని పూర్తిగా ఎన్‌ఐడబ్ల్యూఏ భరించాలని ఈనెల 21న కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మరోసారి స్పష్టం చేసింది. దీంతో నావిగేషన్‌ కెనాల్‌ వ్యయం అంశాన్ని తక్షణమే తేల్చాలని ఎన్‌ఐడబ్ల్యూఏను మరోసారి కోరాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), రాష్ట్ర జలవనరులశాఖ అధికారులు నిర్ణయించారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించకముందే.. గోదావరి నదీ మార్గంలో ప్రాజెక్టు ఎగువకు, దిగువకు పడవలు రాకపోకలు సాగించేలా ప్రాజెక్టు ఎడమ వైపున కొండలో 12 మీటర్ల వ్యాసంతో సొరంగం, దానికి అనుబంధంగా 20 మీటర్ల వెడల్పుతో నావిగేషన్‌ కెనాల్‌ తవ్వి నదిలో కలిపే పనులు చేపట్టారు. ఇందులో సొరంగంతోపాటు, నావిగేషన్‌ కెనాల్, మూడు ప్రాంతాల్లో నావిగేషన్‌ లాక్స్, వరదను నియంత్రించే గేట్ల నిర్మాణం 2009 నాటికే పూర్తయ్యాయి. 

జాతీయ జలమార్గం ప్రకటనతో..
బంగాళాఖాతం, గోదావరి, కృష్ణానదుల మీదుగా కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు 1,095 కిలోమీటర్ల పొడవున అంతర్గత జలమార్గాన్ని నాలుగో జాతీయ జలమార్గంగా అభివృద్ధి చేస్తామని 2010లో ఎన్‌ఐడబ్ల్యూఏ ప్రకటించింది. ఇందులో కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు 767 కిలోమీటర్లు బ్రిటిష్‌ సర్కార్‌ హయాంలో నిర్మించిన కాలువను తాజాగా అభివృద్ధి చేయడంతోపాటు భద్రాచలం నుంచి రాజమహేంద్రవరం వరకు 171 కిలోమీటర్ల పొడవున గోదావరి నదిలోను, తెలంగాణలోని నల్లగొండ జిల్లా వజీరాబాద్‌ నుంచి విజయవాడ వరకు 157 కిలోమీటర్ల పొడవున కృష్ణానదిలోను జలమార్గాన్ని నిర్మిస్తామని ప్రకటించింది. ఈ మేరకు 2017 ఏప్రిల్‌ 14న రాష్ట్ర ప్రభుత్వంతో ఎన్‌ఐడబ్ల్యూఏ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది.

వ్యయంపై గప్‌చుప్‌..
పోలవరం ప్రాజెక్టులో నావిగేషన్‌ కోసం జాతీయ ప్రమాణాల మేరకు ఇప్పటికే 12 మీటర్ల వ్యాసంతో తవ్విన సొరంగాన్ని 20 మీటర్ల వ్యాసానికి, 20 మీటర్ల వెడల్పుతో తవ్విన నావిగేషన్‌ కెనాల్‌ను 40 మీటర్ల వెడల్పునకు విస్తరించాలని, ఆ మేరకు నావిగేషన్‌ లాక్స్, వరద నియంత్రణ గేట్లను పునర్నిర్మించాలని ఎన్‌ఐడబ్ల్యూఏ ప్రతిపాదించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. ఆ ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని వందశాతం భరిస్తామని పేర్కొంది. ఎన్‌ఐడబ్ల్యూఏ ప్రమాణాల మేరకు నావిగేషన్‌ టన్నెల్, కెనాల్‌ సంబంధిత పనులను చేపట్టడానికి నిధులు మంజూరు చేయాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కేంద్ర జల్‌శక్తిశాఖ తోసిపుచ్చింది. ఆ వ్యయాన్ని ఎన్‌ఐడబ్ల్యూఏ భరించాలని స్పష్టం చేసింది. కానీ దీనిపై ఎన్‌ఐడబ్ల్యూఏ నోరుమెదపడం లేదు.

నావిగేషన్‌ కెనాలే అడ్డంకి..
పోలవరం ప్రాజెక్టును 2022 నాటికి పూర్తిచేసే దిశగా ప్రభుత్వం పనులను వేగవంతం చేసింది. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఎన్‌ఐడబ్ల్యూఏ ప్రమాణాల మేరకు నావిగేషన్‌ టన్నెల్, కెనాల్‌ సంబంధిత పనులను చేపట్టడం అంత సులువు కాదు. ఎన్‌ఐడబ్ల్యూఏ ప్రమాణాల ప్రకారం వాటి పనులు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డిజైన్లను ఇటీవల సీడబ్ల్యూసీ ఆమోదించింది. ఆ పనులకు అయ్యే వ్యయాన్ని ఎన్‌ఐడబ్ల్యూఏ భరించాలని ఈనెల 21న సీడబ్ల్యూసీ మరోసారి స్పష్టం చేసింది. దాంతో ఈ పనులకయ్యే వ్యయంపై ఏదో ఒకటి తేల్చిచెప్పాలని ఎన్‌ఐడబ్ల్యూఏను కోరాలని రాష్ట్ర ప్రభుత్వం, పీపీఏ నిర్ణయించాయి.  

మరిన్ని వార్తలు