-

దిక్కుతోచని ‘దేశం’

28 Nov, 2023 04:36 IST|Sakshi

సీఎం జగన్‌ జనాదరణ చూసి చంద్రబాబు గ్యాంగ్‌లో కంగారు

హామీలన్నీ అమలు చేసి, అన్ని వర్గాలకు చేరువైన ముఖ్యమంత్రి

సామాజిక సాధికార యాత్ర, వై ఏపీ నీడ్స్‌ జగన్‌కు జనం నీరాజనం 

ప్రజల ఆశీర్వాదంతో 175 స్థానాల్లో విజయానికి వైఎస్సార్‌సీపీ అడుగులు

టీడీపీ గెలిచిన 23 స్థానాల్లోనూ బలమైన అభ్యర్థులను బరిలోకి దించుతున్న వైఎస్సార్‌సీపీ 

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ ఖాయమంటున్న సర్వేలు 

వచ్చే ఎన్నికల్లో 2019 కంటే ఘోర పరాజయం తప్పదని పసుపుదండు ఆందోళన

తెలుగుదేశం–జనసేన పొత్తుకు జనంలో కనిపించని స్పందన

దీంతో ఓటమికి ఇప్పటి నుంచే సాకులు వెతుక్కుంటున్న టీడీపీ బ్యాచ్‌

ఓట్లు తొలగిస్తున్నారంటూ పచ్చమీడియా విషపు రాతలు

వాటిని పట్టుకుని రాద్ధాంతం చేస్తున్న బాబు, లోకేశ్, పవన్, పురందేశ్వరి

సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజల్లో విశ్వసనీయత సంపాదించినప్పుడే వారి ఆశీస్సులు కోరే హక్కు మనకు ఉంటుందని నమ్మి ఆ మార్గంలో పాలన అందిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌కు రోజురోజుకూ ప్రజా­దరణ పెరుగుతోంది. వైఎస్సార్‌సీపీ చేప­ట్టిన సామాజిక సాధికార యాత్రకు జనం బ్రహ్మ­రథం పడుతుండటం.. వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్య­క్రమానికి ఇంటింటా నీరాజనాలు పలుకుతుండటమే అందుకు తార్కాణం. రాష్ట్రంలో ఇప్పటికి­ప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేయడం ఖాయమని టైమ్స్‌ నౌ వంటి పలు జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లో కూడా వెల్లడయింది. దీంతో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ దిక్కుతోచని స్థితిలో పడిపో­యింది.

2019 ఎన్నికల కంటే ఘోరంగా వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోవడం ఖాయమని అగ్రనేతలకు అర్థమైంది. అందుకే ఉనికినైనా కాపాడుకోవడానికి పసుపుదండు విశ్వప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే పచ్చ మీడియా నిత్యం ప్రభుత్వంపై దుష్ప్రచారానికి ఒడిగడుతోంది. అబద్ధాలను రోజూ పుంఖానుపుంఖాలుగా అచ్చే­స్తోంది. టీడీపీ మద్దతుదారులను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారంటూ పచ్చమీడియా శోకర్ణాలు పెడుతుంటే.. ఆ కథనాలు పట్టుకుని లోకేశ్, పవన్‌ కళ్యాణ్, చంద్రబాబు వదినైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సన్నాయినొక్కులు నొక్కడం నిత్యకృత్యమైంది. 

జనం ఎత్తిన జెండా..
విభజన నేపథ్యంలో 2014లో జరిగిన ఎన్నికల్లో 650 హామీలు ఇస్తూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో అమలు బాధ్యత తనదంటూ జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ నమ్మబలికారు. ఆ ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడి, కేవలం ఐదు లక్షల కోట్ల తేడాతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఏ ఒక్క హామీని సంపూర్ణంగా అమలు చేసిన దాఖలు లేవు. వాటిపై ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతో అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే మేనిఫెస్టోను టీడీపీ వెబ్‌సైట్‌ నుంచి చంద్రబాబు మాయం చేయించారు.

ఇదే అంశాన్ని ఎత్తిచూపుతూ ప్రజలతో మమేకమవుతూ ప్రజాసంకల్ప పాదయాత్రను అప్పట్లో వైఎస్‌ జగన్‌ చేశారు. పాదయాత్రలో ప్రజలు చెప్పిన అంశాలు, తాను గుర్తించిన సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తూ కేవలం రెండు పేజీలతో కూడిన మేనిఫెస్టోను 2019 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ విడుదల చేశారు. ఆ ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించి, 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాలను చేజిక్కించుకోవడం ద్వారా వైఎస్సార్‌సీపీ చారిత్రక విజయాన్ని నమోదుచేసింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 95 శాతం.. ఇప్పటికి 99.5 శాతం హామీలు అమలు చేశారు.

అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను 87 శాతం కుటుంబాలకు అందించారు. డీబీటీ ద్వారా రూ. 2.40 లక్షల కోట్లు, నాన్‌ డీబీటీ ద్వారా రూ. 1.70 లక్షల కోట్లు వెరసి మొత్తం రూ. 4.10 లక్షల కోట్ల మేర ప్రజలకు ప్రయోజనం చేకూర్చారు. వికేంద్రీకరణ, సంస్కరణల ద్వారా విప్లవాత్మక పరిపాలనను అందిస్తుండటంతో ప్రజలు వైఎస్సార్‌సీపీ వెంట నడుస్తున్నారు. 2019 ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ రికార్డు స్థాయి విజయాలు సాధించడమే అందుకు తార్కాణం. 

నిత్యం ప్రజలతో మమేమవుతూ..
ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ ప్రజాసమస్యల పరిష్కారమే పరమావధిగా పోరాటం చేసిన వైఎస్సార్‌సీపీ.. అధికారంలోకి వచ్చాక కూడా నిత్యం జనంతో మమేకమవుతోంది. సంక్షేమాభివృద్ధి ద్వారా ప్రతి ఇంటికీ చేసిన మంచిని చాటిచెప్పడానికి గతేడాది మే 11న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం చేసిన మంచిని చెప్పి.. ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తూ.. ఆశీర్వదించాలని కోరుతున్నారు.

ఇంటింటికీ చేసిన మంచిని చెప్పడానికి ఈ ఏడాది ఏప్రిల్‌ 7న ‘జగనన్నే మా భవిష్యత్తు’ పేరుతో చేపట్టిన కార్యక్రమం ద్వారా 1.45 కోట్ల కుటుంబాలతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు మమేకమ్యాయి. ఇందులో 80 శాతం కుటుంబాలు సీఎం వైఎస్‌ జగన్‌ పరిపాలకు మద్దతు పలుకుతూ ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ అంటూ పీపుల్స్‌ సర్వేలో వెల్లడించారు. నాలుగున్నరేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చేసిన మంచిని వివరించడానికి గత నెల 26 నుంచి చేపట్టిన సామాజిక సాధికార యాత్ర ఇప్పటికి 59 నియోజకవర్గాల్లో పూర్తయింది. ప్రతి నియోజకవర్గంలోనూ వేలాదిగా ప్రజలు తరలివచ్చి వైఎస్‌ జగన్‌ పాలనకు మద్దతు ఇస్తున్నారు. 

వై ఏపీ నీడ్స్‌ జగన్‌
నాలుగున్నరేళ్లలో సాధించిన విప్లవాత్మక మార్పులను వివరించడానికి ఈనెల 9 నుంచి చేపట్టిన ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమానికి ఇంటింటా జనం నీరాజనాలు పలుకుతున్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలంటే జగనే రావాలి.. జగనే కావాలి అంటూ నినదిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయం యూనిట్‌గా ప్రతి ఇంటి తలుపు తట్టి.. 2014–19లో చంద్రబాబు చేస్తానని చెప్పి ఎగ్గొట్టినివి, జగన్‌  చెప్పినవి చేశారా లేదా అనేది గృహసారథులు ప్రజలకు వివరిస్తున్నారు.

ఇప్పటికి 30 లక్షల ఇళ్లు టచ్‌ చేశారు. 6,800 సచివాలయాలు పూర్తి చేశారు. ఇంటింటా జగన్‌కు జనం జై కొడుతున్నారు. మీకు మంచి చేస్తేనే నన్ను ఆశీర్వదించండి అని జగన్‌ స్పష్టంగా చెప్తున్నారు కాబట్టే ప్రజల నుంచి స్పందన లభిస్తోంది. మీ గ్రామానికి ఇంత చేశామని చెప్పగలిగిన ధీమా, ధైర్యం గతంలో ఎవరికైనా చేయలేదు. 

175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా..
వచ్చే ఎన్నికల్లో 175 శాసనసభ స్థానాల్లో పోటీకి నిలబెట్టేందుకు టీడీపీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడింది. మరోపక్క 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ వ్యూహాలు రచిస్తోంది. ఈ విషయంలో సీఎం వైఎస్‌ జగన్‌ కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. 2019 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన 23 స్థానాలనూ కైవసం చేసుకోవడానికి అక్కడ బలమైన అభ్యర్థులను, అవసరమైతే మంత్రులను బరిలోకి దించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కునారిల్లిపోయిన టీడీపీ ఉనికిని కాపాడుకోవడానికి అడ్డమైన దారులు తొక్కుతోంది.

చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ముసుగును తొలగించి.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ–జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. ఆ పొత్తుపై జనస్పందన కన్పించలేదు. ఉమ్మడి మేనిఫెస్టో పేరుతో రెండు పార్టీల నేతలు ఆడుతున్న నాటకాలు రక్తికట్టడం లేదు. 2019 కంటే ఘోరంగా ఓడిపోవడం ఖాయమని, అది పార్టీ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చుతుందని చంద్రబాబు నేతృత్వంలోని పసుపుదండు ఆందోళన చెందుతోంది. దీంతో ఓటమికి ఇప్పటి నుంచే సాకులు టీడీపీ బ్యాచ్‌ సాకులు వెతుక్కుంటోంది. 

ఉగ్రవాదం కంటే నీచమైన స్థాయికి..
తెలుగుదేశం ఉనికి కాపాడటానికి ఎల్లో మీడియా రంగంలోకి దిగి నిత్యం ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నాయి. సంక్షేమ పథకాల వల్ల అర్హత ఉన్న 87 శాతం కుటుంబాలు లబ్ధి పొందుతుంటే వాటి గురించి పట్టించుకోని పచ్చ పత్రికలు.. సంక్షేమ పథకాలు అందడం లేదంటూ దుష్ప్రచారం చేస్తున్నాయి. ఫ్యామిలీ డాక్టర్‌ విధానంతో ఇంటి వద్దే ప్రజలకు వైద్య సేవలు అందిస్తుండటం వల్ల బోధనాసుపత్రుల్లో ఓపీలు తగ్గితే దానిపైనా తప్పుడు కథనాలు రాశాయి. అంటే ఆస్పత్రులన్నీ కళకళలాడాలని కోరుకుంటున్నారా? ఒకప్పుడు ఎరువుల కోసం కిలోమీటర్ల మేర క్యూలలో రైతులు నిలబడేవారు.

ఇప్పుడు ఆ కళే కనిపించడం లేదంటూ రాస్తే ఇక వారిని ఏమనాలి? ఉగ్రవాదం స్థాయిని దాటి అత్యంత నీచమైన స్థాయికి దిగజారారు. వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార యాత్రకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలు వేలాదిగా హాజరవుతుంటే.. దాన్ని జీర్ణించుకోలేని పచ్చ పత్రికలు సభ ప్రారంభానికి ముందు, పూర్తయిన తర్వాత ఫోటోలు తీసి ఖాళీ కుర్చీలంటూ తప్పుడు కథనాలు అచ్చేస్తున్నాయి. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ విషప్రచారం ఊపందుకుని రోజూ అబద్ధపు రాతలు రాస్తున్నారు.   

నైరాశ్యంలో తమ్ముళ్లు..
అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ దోచుకు.. పంచుకో.. తినుకో పద్ధతిలో ప్రజాధనాన్ని లూటీ చేశారు. ఆ కుంభకోణాల్లో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఇటీవలే జైలుకెళ్లి వచ్చారు. స్కిల్‌ స్కాం కేసులో రూ. 371 కోట్లు దోచేశారని పక్కా ఆధారాలతో తేల్చిన సీఐడీ ఆయన్ను అరెస్టు చేసింది. ఏసీబీ కోర్టు రిమాండ్‌పై జైలుకు పంపింది.

తనను జైలుకు పంపితే సానుభూతి వస్తుందన్న చంద్రబాబు అంచనాలు తప్పాయి. వ్యవస్థలను మేనేజ్‌ చేసుకుంటూ తప్పించుకు తిరుగుతున్న చంద్రబాబును జైలుకు పంపడంతో ఇప్పటికైనా న్యాయం గెలిచిందనే భావన ప్రజల్లో వ్యక్తమవడంతో ఆపార్టీ శ్రేణులను నైరాశ్యంలోకి నెట్టింది.

మరిన్ని వార్తలు