కంచే చేను మేసేస్తోంది!

27 Aug, 2021 05:04 IST|Sakshi

ఈపీడీసీఎల్‌లో అధికారుల చేతివాటం  

కిందిస్థాయి ఉద్యోగులకు ఉన్నతాధికారుల వత్తాసు  

విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చేందుకు భారీగా వసూళ్లు  

అటెండర్‌ బంధువు వాహనాన్ని వాడుకుంటూ బిల్లు పొందుతున్న మరో అధికారి  

సాక్షి, అమరావతి: కంచే చేను మేసిన చందాన ఉద్యోగులే సంస్థ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. ఉన్నతాధికారులు సైతం వారి అవినీతి వ్యవహారాలకు కొమ్ముకాస్తుండటం విశేషం. ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్‌)కు రావాల్సిన ఆదాయానికి కొందరు ఉద్యోగులు గండికొడుతున్నారు. వారు చేసింది తప్పని పలు విచారణల్లో తేలినా చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈ వ్యవహారాలపై ఏపీ ట్రాన్స్‌కో వరకూ ఫిర్యాదులు వెళ్లడంతో విజిలెన్స్‌ అధికారులు కూపీలాగే పనిలో పడ్డారు. 

ప్రతి డీడీకి సమర్పించుకోవాల్సిందే!
► విశాఖలోని సంస్థ కార్పొరేట్‌ కార్యాలయంలో సీజీఎం స్థాయి అధికారి ఒకరు సీఎండీ పేషీలోని ఒక అటెండర్‌ బంధువుకు చెందిన వాహనాన్ని అద్దెకు తీసుకుని వాడుకుంటున్నారు. నిజానికి ట్రావెల్‌ వాహనాన్ని వినియోగించాల్సి ఉన్నా.. అలా చేయలేదు. సంస్థ నుంచి బిల్లు రూపంలో నగదు తీసుకుంటూ అటెండర్‌ బంధువుకు ప్రయోజనం చేకూరుస్తున్నారు. 
► ఏలూరు ఆపరేషన్‌ సర్కిల్లోని భీమవరం డివిజన్‌లో విద్యుత్‌ సర్వీస్‌ కోసం సంస్థ పేరు మీద వినియోగదారులు డీడీ తీయాలంటే తన సంతకం తప్పనిసరంటూ ఓ అధికారి నిబంధన విధించారు. ప్రతి డీడీకి కొంత మొత్తాన్ని తనకు లైన్‌మేన్లు చెల్లించడమన్నది ఆనవాయితీగా మార్చారు.  
► తణుకు సబ్‌ డివిజన్‌లో భవనాలపై ఉన్న పెంట్‌ హౌస్‌కు విద్యుత్‌ సర్వీస్‌ ఇచ్చేందుకు ఇదే ప్రాంతంలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు భారీగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.  
► నిడదవోలు డివిజన్‌ ఉండ్రాజవరం మండలంలో ఓ అధికారి.. అపార్ట్‌మెంట్లకు విద్యుత్‌ సర్వీస్‌ ఇవ్వడంలో అవినీతికి పాల్పడినట్టు ఫిర్యాదులు రావడంతో ఇటీవలే విజిలెన్స్‌ విచారణ జరిపించారు. ఇలా అనేక చోట్ల సంస్థకు రావాల్సిన ఆదాయాన్ని ఉద్యోగులు, అధికారులు పక్కదారి పట్టిస్తున్నట్టు ట్రాన్స్‌కో విజిలెన్స్‌కు సమాచారం అందింది. 

త్వరలోనే చర్యలు  
డిస్కంకు నష్టం చేకూర్చేలా ప్రవర్తించిన ఏ ఉద్యోగిపైనైనా సరే తక్షణమే చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం అటువంటి వారిపై విచారణ జరుగుతోంది. కొందరు  తప్పు చేసినట్టు రుజువైనప్పటికీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోలేదు. వారి ప్రమేయం పైనా ఆరా తీస్తున్నాం. త్వరలోనే మా వైపు నుంచి చర్యలుంటాయి.  
–ఏపీ ట్రాన్స్‌ కో విజిలెన్స్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వరరావు. 

తప్పు చేశాడని తేలినా..  
శ్రీకాకుళానికి చెందిన జి.సత్యవతి తన ఇంటికి విద్యుత్‌ కనెక్షన్‌ పొందేందుకు రూరల్‌ సెక్షన్‌ను సంప్రదించారు. ఆమె ఇంటికి విద్యుత్‌ సర్వీస్‌ ఇవ్వాలంటే డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్, విద్యుత్‌ స్తంభాలతో కలిపి మొత్తం రూ.1,04,000 ఖర్చవుతున్నా అక్కడి అసిస్టెంట్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌(ఏఈఈ) బి.నాగేశ్వరరావు ఆమె నుంచి అనధికారికంగా రూ.లక్ష తీసుకుని కేవలం రూ.8,900కే ప్రతిపాదనలిచ్చారు. సంస్థ అవసరానికి వాడుకునేందుకు పక్కన ఉంచిన డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్, విద్యుత్‌ స్తంభాలతో పని పూర్తిచేశారు. ఈ వ్యవహారంపై శ్రీకాకుళం రూరల్‌ ఏడీఈ విచారణ జరిపి ఎస్‌ఈకి నివేదిక ఇచ్చారు. ఎస్‌ఈ మరోసారి డివిజనల్‌ ఇంజనీర్‌ స్థాయి అధికారితో విచారణ జరిపించారు. ఆయన విచారణలోనూ ఏఈఈ నేరం రుజువైంది. ఈ మొత్తం నివేదికను విశాఖలోని సంస్థ కార్పొరేట్‌ కార్యాలయంలో ఉండే చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌(సీజీఎం)కు ఎస్‌ఈ పంపించారు. తప్పు చేసిన ఇంజనీర్‌పై చర్యలు తీసుకుంటారని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. సీజీఎం నుంచి ఎలాంటి ఆదేశాలూ వెలువడలేదు.   

మరిన్ని వార్తలు