కరోనా వ్యాక్సిన్‌: వృద్ధుడి మృతి

13 Mar, 2021 10:20 IST|Sakshi

ఏలూరు టౌన్‌: పక్షవాతం, మధుమేహం, ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్న వృద్ధుడు కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్న అనంతరం తీవ్ర అనారోగ్యానికి గురై మృతిచెందాడు. ఏలూరు ప్రభుత్వాసుపత్రి వైద్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెదవేగి మండలం ఒంగూరు గ్రామానికి చెందిన పల్లి కుటుంబరావు (65) వాచ్‌మెన్‌గా పనిచేస్తుంటాడు. పల్లి కుటుంబరావుకు కుటుంబ సభ్యులు ఈనెల 10న ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలోని వ్యాక్సినేషన్‌ సెంటర్‌లో కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించారు. కొద్దిసేపు హాస్పిటల్‌లోనే ఉంచి పరిశీలించిన అనంతరం ఇంటికి తీసుకువెళ్లారు.

అనంతరం కుటుంబరావుకు జ్వరం రావటంతో కుటుంబ సభ్యులు స్థానికంగా వైద్యం చేయించారు. కానీ జ్వరం తగ్గకపోవటంతో శుక్రవారం ఏలూరు జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించటంతో కుటుంబరావు మృతిచెందాడు. మృతుని కుమారుడు పవన్‌కుమార్‌ ఏలూరు టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై ఏలూరు టూటౌన్‌ ఎస్‌ఐ ఎన్‌ఆర్‌ కిషోర్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా కేంద్ర హాస్పిటల్‌ ఇన్‌ఛార్జ్, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ ఏవీఆర్‌ మోహన్‌ మాట్లాడుతూ.. కుటుంబరావు కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవటం వల్ల మృతిచెందలేదని, అతను పక్షవాతంతో బాధపడుతున్నాడని, మధుమేహం ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని స్పష్టం చేశారు. పోస్టుమార్టం అనంతరం నివేదిక ఆధారంగా కుటుంబరావు మృతికి కారణాలు తెలుస్తాయని డాక్టర్‌ ఏవీఆర్‌ తెలిపారు.
చదవండి:
టీడీపీ దౌర్జన్యకాండ: వస్త్రాలు లాగి అసభ్యంగా ప్రవర్తించి..    
తాళి కట్టిన వాడే కాలనాగు? 

మరిన్ని వార్తలు