మూడుముళ్ల బందీ!

17 Sep, 2022 09:15 IST|Sakshi

కళ్యాణదుర్గం: సాంకేతికత రోజురోజుకూ పెరుగుతున్నా...ఆధునిక సమాజం వైపు అడుగులు వేస్తున్నా...జిల్లాలో బాల్య వివాహాలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. పెళ్లంటే ఏమిటో కూడా తెలియని వయసులో బాలికలను అత్తారింటికి పంపి, వారి బంగారు భవిష్యత్తుకు తల్లిదండ్రులే సంకెళ్లు వేస్తున్నారు. మరికొందరు ఆడపిల్లలను బరువుగా భావించి వదిలించుకునే ఆలోచనతో పెళ్లిపీటలెక్కిస్తున్నారు.

ఇలాంటి పరిణామాలతో మానసికంగా, శారీరకంగా బాలికలు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నా...పెడచెవిన పెడుతున్నారు. ప్రేమ వివాహాలు, మేనరికాలు, వలసలు, వరుడికి ఉద్యోగం ఉందని పరిపక్వత లేని బాల్యాన్ని మాంగల్యంతో బందీ చేస్తున్నారు. ఆడ పిల్లలను ఇంటి వద్ద ఉంచలేక 18 ఏళ్లలోపే వివాహాలు జరిపిస్తున్న వారు కొందరైతే... పిల్లలు చదువుకునే సమయంలో ప్రేమ, పెళ్లి వైపు వెళ్తే కుటుంబ పరువు పోతుందనే భయంతో మరికొందరు ఇలా చేస్తున్నారు.  

అడ్డుకట్టకు మార్గాలు...  
గ్రామస్థాయిలో వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్, సీడీపీఓ, మండల స్థాయిలో తహసీల్దార్లు, రెవెన్యూ డివిజన్‌ స్థాయిలో ఆర్డీఓలు బాల్య వివాహాలను అడ్డుకునే అధికారం ఉంది. ఎవరైనా చైల్డ్‌లైన్‌(112)కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయొచ్చు. 18 ఏళ్లు నిండకుండానే అమ్మాయిలకు పెళ్లి చేయకూడదని, ఒక వేళ బాల్య వివాహం చేస్తే కలిగే అనర్థాల గురించి ఇప్పటికే ఐసీడీఎస్‌ ప్రాజెక్టు స్థాయి సమావేశాల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు, మండల మహిళా సమాఖ్య, సంరక్షణ అధికారుల సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  

వివాహ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి 
బాల్య వివాహాల నిరోధానికి అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ‘వివాహ రిజిస్ట్రేషన్‌ చట్టం – 2002’ అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం జీఓ జారీ చేసింది. గ్రామ, వార్డు స్థాయిలో మహిళా సంరక్షణ కార్యదర్శి ద్వారా వివాహ రిజిస్ట్రేషన్‌ తప్పకుండా చేయించుకోవాలని ఆదేశాలిచ్చారు.

పెళ్లికి ముందే వధువు, వరుడు ఇద్దరూ సంతకం చేసిన దరఖాస్తును నివాస ధ్రువీకరణ పత్రాలు, వయస్సు నిర్ధారణకు ఆధార్, రెండు పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలు, వివాహ వధువు, వరుడు ఇద్దరూ సంతకం చేసిన దరఖాస్తును నివాస ధ్రువీకరణ పత్రాలు, వయస్సు నిర్ధారణకు ఆధార్, రెండు పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలు, వివాహ రిజిస్ట్రేషన్‌ తప్పకుండా చేయించుకోవాలని ఆదేశాలిచ్చారు. ఆహ్వాన పత్రికలతో కలిసి సమర్పించాలి. ఒకవేళ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటే జైలు శిక్ష, జరిమానా ఉంటుంది.   

  • కళ్యాణదుర్గం మండలం పాలవాయి గ్రామంలో ఇటీవల ఓ బాల్య వివాహం జరగబోతోందన్న సమాచారం అందుకున్న ఐసీడీఎస్, పోలీసు అధికారులు గ్రామానికి వెళ్లారు. వధూవరుల కుటుంబాలకు కౌన్సెలింగ్‌ ఇచ్చి అప్పటికి ఆ వివాహం అడ్డుకున్నారు. అయితే మరుసటి రోజే అధికారుల కళ్లుగప్పి ఇరు కుటుంబాల వారు మరో ప్రాంతానికి వెళ్లి పెళ్లి తంతు ముగించారు.  
  • కళ్యాణదుర్గం మండలం బోయలపల్లి పంచాయతీలో రెండు నెలల క్రితం బాల్య వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్న విషయం     తెలుసుకుని ఐసీడీఎస్, పోలీసు, రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని బాల్య వివాహాన్ని నిలుపుదల చేశారు.  
  • ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పిస్తున్నా కొందరు తల్లిదండ్రుల్లో మార్పు రావడం లేదు. దీంతో బాల్య వివాహాలు జిల్లాలో ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. అధికారులకు ముందస్తు సమాచారం అందితే వెంటనే అక్కడికి వెళ్లి బాల్య వివాహాలు అడ్డుకుని.. బాలల     బంగారు భవిష్యత్తు బుగ్గిపాలు కాకుండా చూస్తున్నారు.

శిక్షలతోనే బాల్య వివాహాలకు చెక్‌ 
బాల్య వివాహాలు చేస్తున్న వారిపై పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసి.. శిక్ష పడేలా చేస్తే బాల్య వివాహాలకు చెక్‌ పడుతుంది. గ్రామాల్లో అన్ని రకాలుగా ప్రభుత్వం, ప్రైవేట్‌ సంస్థలు అవగాహన కల్పిస్తున్నా ప్రజల్లో మార్పు రాలేదు. అమ్మాయిలను చదివిస్తే కొంతవరకు వీటిని తగ్గించవచ్చు. గ్రామాలలో చట్టంపై అవగాహన కలి్పస్తే తగ్గుముఖం పడుతాయి.  
– శ్రీదేవి, ప్రాజెక్ట్‌ డైరెక్టర్, ఐసీడీఎస్‌ 

మా ఊర్లో బాల్య వివాహాలకు తావులేదు 
నా పేరు వన్నూరమ్మ. నేను ఆర్డీటీ సంస్థలో లీడరుగా పనిచేస్తున్నాను. ఊర్లో బాల్య వివాహాలు అడ్డుకోవడం, మహిళలపై దాడులు ఇలాంటి వాటిని అరికట్టడానికి పనిచేస్తున్నాను. పదేళ్లుగా మా ఊర్లో బాల్య వివాహాలు జరగలేదు. అలా ఎవ్వరైనా చేయాలని చూసినా వెంటనే అక్కడికి చేరుకుని ఐసీడీఎస్‌ అధికారులతో పాటు పోలీసుల (డయల్‌ 100)కు, చైల్డ్‌లైన్‌ (112)కు సమాచారం అందిస్తున్నాం.  
– వన్నూరమ్మ, మోరేపల్లి 

బాలికల విద్యను ప్రోత్సహించాలి 
బాలికల విద్యను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక డ్రాపౌట్స్‌ పూర్తిగా తగ్గిపోయింది. అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన లాంటి పథకాలు బాలికలకు వరంగా మారాయి. చదువు ఉంటే బాల్య వివాహాలు అనే ఆలోచన రాదు. బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది.  
– ఉషశ్రీచరణ్, రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి   

(చదవండి: శుద్ధ అబద్ధం: మినరల్‌ కాదు జనరల్‌ వాటర్‌)

మరిన్ని వార్తలు