మరో 180 ఆలయాల్లో ఆన్‌లైన్‌ సేవలు

5 Sep, 2021 04:13 IST|Sakshi

దేవదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వాణీమోహన్‌

పెనుగంచిప్రోలు: ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో సేవలు, పూజలు చేసుకునే అవకాశం భక్తులకు కల్పించామని దేవదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, కమిషనర్‌ పి.వాణీమోహన్‌ పేర్కొన్నారు. శనివారం ఆమె కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలోని శ్రీ లక్ష్మీతిరుపతమ్మ వారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గత మూడు నెలలుగా ప్రముఖ ఆలయాలన్నింటిలో ఆన్‌లైన్‌ సేవలు కొనసాగుతున్నాయని, మరో 180 దేవాలయాల్లో కొత్తగా ఆన్‌లైన్‌ సేవలు కల్పిస్తున్నట్లు చెప్పారు.

అలాగే ప్రముఖ ఆలయాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించటంతో పాటు రిజిస్టర్లు, బంగారం, వెండి నిల్వలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రముఖంగా భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించటంపై దృష్టి పెడుతున్నామన్నారు. అనంతరం ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఆలయ ఈవో మూర్తి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలతో ప్రిన్సిపల్‌ సెక్రటరీని సత్కరించారు. 

మరిన్ని వార్తలు