పందెం పుంజులు... లక్షల్లో ధరలు.. మొదలైన సంక్రాంతి సందడి 

26 Dec, 2022 10:27 IST|Sakshi
సంక్రాంతి బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్న పందెం పుంజులు 

సాక్షి, కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): జిల్లాలో సంక్రాంతి సందడి అప్పుడే మొదలైంది. కోడి పందేలరాయుళ్ల హడావుడి ప్రారంభమైంది. ఏ రంగుపై ఏ రంగు వదలాలి, ఏది గెలుస్తుంది, ఏది ఓడిపోతుందనే కబుర్లు మొదలయ్యాయి. ఒరేయ్‌ ఈరిగా... పోయిన పండక్కి నా నెమలి నాలుగు పందేలు చేసిందిరా అంటే... నీ నెమలి నాలుగు పందేలే చేసింది... నా కక్కిరి అయితే నీచు తగలకుండా సంపేసిందిరా సూరిగా అంటూ పందెంరాయుళ్లు మాట్లాడుకోవటం మొదలుపెట్టేశారు.

ఇదిలా ఉండగా వచ్చే పండుగను దృష్టిలో పెట్టుకుని పందెంరాయుళ్లు పుంజుల కోసం జల్లెడ పడుతున్నారు. చిన్న చిన్న పందెంగాళ్లు సండే మార్కెట్‌లోకి వచ్చే పుంజులను బేరసారాలు చేసి కొనుక్కుంటుండగా పెద్ద పందెగాళ్లు కోడి రంగు, వాటం, వాటి చూపును చూసి కొనుగోలు చేస్తున్నారు. కోడికూత వినబడితే చాలు చటుక్కున ఆగి కోళ్ల యజమానితో బేరసారాలు మొదలెడుతున్నారు. రంగును బట్టి ధర నిర్ణయించి డబ్బులు విరజిమ్ముతున్నారు.

పుంజు వాటంతో పాటు రంగు రూపు నచ్చితే ధర ఎంతైనా కొనేందుకు వెనుకాడటంలేదు. పందేనికి సిద్ధం  చేసేందుకు రకరకాల మేతలను తయారుచేసి పుంజుల శరీరాన్ని జిమ్‌ బాడీల్లా సిద్ధం చేసేందుకు పూనుకుంటున్నారు. రంగును బట్టి పందెంకోళ్లకు గిరాకీ ఉండటంతో పెంపకందారులు ఈ సీజనులో కాసులు పోగుజేసుకుంటున్నారు. కాకి, పచ్చకాకి, డేగ, కాకిడేగ, నెమలి, సీతువా, కక్కిరి, పింగళా ఇలా రంగులను బట్టి ఒక్కో పందెం కోడి ధర సుమారు రూ.5 వేలు, ఇవే రంగుల్లో జాతికోళ్లు అయితే రూ.15 వేల నుంచి మొదలై లక్షల్లో పలుకుతున్నాయి. అయితే రంగు నచ్చి కోడి మీద పందెంరాయుళ్లకు మోజు పుడితే చాలు ధర ఎంతైనా చెల్లించి పుంజును పట్టుకుపోతున్నారు. 

యుద్ధానికి సిద్ధమవుతున్న పందెంకోళ్లు  
పండుగ సమీపిస్తుండటంతో పందెంరాయుళ్లు పందెం కోళ్లను యుద్ధానికి సిద్ధమయ్యే సైనికుల్లా తయారు చేస్తున్నారు. పందెంరాయుళ్లు పెడుతున్న పుష్టికరమైన తిండి తింటూ పందెం కోళ్లు బరిలోకి దిగేందుకు సై అంటే సై అంటూ సిద్ధమవుతున్నాయి. కత్తి కట్టేందుకు కాలు దువ్వుతున్నాయి. ఇప్పటివరకు తవుడు ముద్దలు, ఒడ్డు, సోళ్లు వంటి వాటిని ఆహారంగా అందించిన పందెంరాయుళ్లు పండుగ దగ్గర పడటంతో  పుంజులను మరింత బలంగా పెంచేందుకు జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా వంటి ఖరీదైన ఆహారాన్ని అందిస్తూ కోళ్లను మేపుతున్నారు. 

మరిన్ని వార్తలు