బొగ్గు కొరత రానివ్వొద్దు 

7 Sep, 2022 04:38 IST|Sakshi

ఇంధన శాఖ, గనుల శాఖ సమన్వయంతో పనిచేయాలి 

బొగ్గు గనులు నిర్వహిస్తున్న ఏపీఎండీసీ సహకారం తీసుకోవాలి 

వ్యవసాయ కనెక్షన్ల మంజూరులో జాప్యం వద్దు 

అధికారులతో సమీక్షలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని థర్మల్‌ విద్యుత్కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. విజయవాడలోని క్యాంప్‌ కార్యాలయంలో ఇంధన, గనులు, ఖనిజాభివృద్ధి శాఖల అధికారులతో మంగళవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని థర్మల్‌ విద్యుత్కేంద్రాలకు దేశీయంగా లభిస్తున్న బొగ్గుతో పాటు విదేశాల నుంచి కూడా దిగుమతులు చేసుకుంటున్నామన్నారు. ఏపీ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎండీసీ) వంటి ప్రభుత్వరంగ సంస్థలు బొగ్గు రంగంలోకి ప్రవేశించిన నేపథ్యంలో దేశీయంగా లభించే బొగ్గును మన రాష్ట్రంలోని థర్మల్‌ కేంద్రాలు వినియోగించుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలని మంత్రి ఆదేశించారు.

దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా బొగ్గు గనుల నిర్వహణకు ఏపీఎండీసీ సిద్ధంగా ఉందని, ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో సుల్యారీ గనిని నిర్వహిస్తోందన్నారు. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల్లో మరికొన్ని గనులను కూడా చేపట్టే అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గును అందించేందుకు ఉన్న అన్ని మార్గాలను పరిశీలించాలని.. ఇందుకు ఇంధన, గనుల శాఖాధికారులు  సమన్వయం చేసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి సూచించారు.  

ఇంధన శాఖ పునర్వ్యవస్థీకరణ 
ఇక ఇంధన శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేయడంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంల పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. రాష్ట్రంలో పెరిగిన జిల్లాలకు అనుగుణంగా ఇంధన శాఖను కూడా పునర్వ్యవస్థీకరించాలని ఆయన  సూచించారు.

ఇక రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన రైతులకు వ్యవసాయ కనెక్షన్లను ఇవ్వడంలో జాప్యం చేయకూడదని సీఎం జగన్‌ ఆదేశాలిచ్చారని.. దానికి అనుగుణంగా అధికారులు పనిచేయాలన్నారు. అలాగే, వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించే కార్యక్రమాన్ని కూడా నిర్ణీత లక్ష్యంలోగా పూర్తిచేయాలని సూచించారు.   

పెండింగ్‌ కేసులపై దృష్టి 
ఇంధనశాఖ పరిధిలో వివిధ విభాగాలకు సంబంధించిన కోర్టు కేసులను సత్వరం పరిష్కరించే విషయంలో అధికారులు దృష్టిసారించాలని కూడా మంత్రి పెద్దిరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా నెడ్‌క్యాప్‌ (ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ) ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్టులపై రూపొందించిన హ్యాండ్‌బుక్‌ను మంత్రి ఆవిష్కరించారు.

ఈ సమావేశంలో ఇంధన శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కే విజయానంద్, గనుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, ట్రాన్స్‌కో సీఎండీ బీ శ్రీధర్, నెడ్‌క్యాప్‌ వీసీ–ఎండీ ఎస్‌.రమణారెడ్డి, ఏపీఎండీసీ వీసీ–ఎండీ వీజీ వెంకటరెడ్డి పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు