పరిశ్రమలకు పూర్తి విద్యుత్తు

19 May, 2022 06:03 IST|Sakshi

ఇంధన శాఖ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష

32 లక్షల టన్నుల విదేశీ బొగ్గు కొనుగోలుకు టెండర్లు

వ్యవసాయానికి సెకీ నుంచి 7 వేల మెగావాట్లు

రాష్ట్రంలో 29 పంప్డ్‌ స్టోరేజీ హైడ్రోపవర్‌ ప్లాంట్లు 

సాక్షి, అమరావతి: ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశ్రామిక రంగానికి పూర్తి స్థాయిలో విద్యుత్‌ సరఫరా చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. విద్యుత్‌ సంస్థల అధికారులతో బుధవారం ఆయన టెలికాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్‌ సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరాపై అన్ని పరిమితులను ఎత్తివేసి సాధారణ స్థితిని పునరుద్ధరించినట్లు మంత్రి పేర్కొన్నారు. పారిశ్రామిక రంగానికి విద్యుత్‌ సరఫరా కొనసాగించాలనే లక్ష్యంతో అధిక ధరలతో కొనుగోలుకు కూడా వెనుకాడలేదన్నారు.

విదేశీ బొగ్గుకు టెండర్లు
రాష్ట్రంలో బొగ్గు సరఫరా పర్యవేక్షణకు కోర్‌ మేనేజ్‌మెంట్‌ బృందాన్ని ఏర్పాటు చేసి విద్యుత్‌ సరఫరా స్థితిగతులను సీఎం తరచూ సమీక్షిస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. థర్మల్‌ ప్లాంట్లకు తగినంత బొగ్గు సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరామని, 32 లక్షల టన్నుల విదేశీ బొగ్గు దిగుమతి కోసం టెండర్లు జారీ చేశామని వివరించారు. దేశంలో బొగ్గు సరఫరా ఇంకా సమస్యాత్మకంగానే ఉన్నందున అప్రమత్తంగా వ్యవహరించాలని విద్యుత్‌ సంస్థలకు సూచించారు.

ఖరీఫ్‌కు కొరత రాకూడదు
ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కానున్నందున వ్యవసాయ రంగానికి విద్యుత్‌ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ కొరత రాకూడదని మంత్రి పెద్దిరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. వ్యవసాయ అవసరాల కోసం 7 వేల మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలు చేసేందుకు సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ)తో ఒప్పందం చేసుకుంటున్నామని, బొగ్గు సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని 33,240 మెగావాట్ల సామర్థ్యంతో 29 పంప్డ్‌ స్టోరేజీ హైడ్రోపవర్‌ ప్లాంట్ల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. సమీక్షలో ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్, ట్రాన్స్‌కో జేఏండీ ఐ. పృథ్వీతేజ్, డిస్కమ్‌ల సీఎండీలు కె.సంతోషరావు, జే పద్మజనార్దనరెడ్డి, హెచ్‌. హరనాథరావు, డైరెక్టర్‌ ఏవీకే భాస్కర్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు