అర్ధరాత్రి కారు చీకటి.. ఆ ఫోన్‌ కాల్‌ కాపాడింది

6 Jun, 2021 09:00 IST|Sakshi

నూతిలో పడిన మహిళ

రక్షించిన పోలీసులు, అగ్నిమాపక దళం  

అమలాపురం టౌన్‌: ఒక్క ఫోన్‌ కాల్‌ ఆమె ప్రాణాలను నిలిపింది.. అర్ధరాత్రి కారు చీకటి.. ఆపై 25 అడుగుల లోతు నూతిలో పడిపోయిన మహిళను పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలతో కాపాడారు. కేవలం 15 నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టడంతోనే ఇది సాధ్యమైంది. ఆపద సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖ ద్వారా అందుబాటులోకి తెచ్చిన 112 కాల్‌ బాధితురాలిని రక్షించింది. సాహసోపేత సేవలు అందించిన సిబ్బందిని రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ప్రశంసించారు. జిల్లా ఎస్పీ నయీం అస్మి, అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి కూడా అభినందించారు. ఆ వివరాల్లోకి వెళితే.. అమలాపురం రూరల్‌ మండలం పాలగుమ్మి గ్రామానికి చెందిన బొక్కా భవానీదుర్గ (49) ప్రతికూల పరిస్థితుల వల్ల ఇంటి ఆవరణలోని నూతిలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పడిపోయింది. ఆమె బంధువు తక్షణమే 112కు కాల్‌ చేసి ప్రమాద వార్తను చేరవేశారు.

ఆ కాల్‌ సెంటరు వారు తక్షణమే 100కి కాల్‌ చేసి చెప్పారు. అక్కడి నుంచి అమలాపురం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కి ఫోన్‌ చేసి అప్రమత్తం చేశారు. ఆ సమయంలో స్టేషన్‌లో డ్యూటీలో ఉన్న ఏఎస్సై సత్యనారాయణ తక్షణమే అమలాపురం అగ్నిమాక దళానికి సమాచారం అందించారు. నైట్‌ రౌండ్స్‌లో ఉన్న కానిస్టేబుల్‌ కుడుపూడి వీరవెంకట సత్యనారాయణ, హోంగార్డు నాగులకు కూడా ఏఎస్సై తెలిపారు. రాత్రి 12.40 గంటలకు కాల్‌ రిసీవ్‌ చేసుకున్న ఏఎస్సై 15 నిమిషాల వ్యవధిలోనే కానిస్టేబుల్, హోంగార్డు, అగ్నిమాపక దళంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీస్‌ స్టేషన్‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలగుమ్మికి వేగంగా వారు జీపులో వెళ్లారు. ఆ సమయానికి అగ్నిమాపక శకటం, అగ్నిమాపక దళాధికారి కేవీ మురళీ కొండబాబు ఆధ్వర్యంలో లీడింగ్‌ ఫైర్‌మెన్‌ శ్రీరాములు, సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చారు.

నూతి లోతు 25 అడుగులకు పైగా ఉంది. అందులో పడి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న భవానీదుర్గను కాపాడే ప్రయత్నాలు చకాచకా మొదలు పెట్టారు. అగ్నిమాపక దళానికి చెందిన నిచ్చెన, తాడుతో సిబ్బంది నూతిలోకి దిగి బాధిత మహిళను జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చారు. ఆమె నూతిలో నిచ్చెన పట్టుకునే స్థితిలో లేకపోవడంతో తాడు కట్టి అతికష్టం మీద పైకి చేర్చారు. తర్వాత సపర్యలు చేసి ప్రాణాపాయం నుంచి కాపాడారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట లోపు 112 కాల్, 100 కాల్‌లకు సంబంధించిన కేసును క్లోజ్‌ చేశారు. బాధిత మహిళ కుటుంబంలోని కొందరు కోవిడ్‌తో బాధపడుతున్నారు. కొద్దిరోజుల కిందటే ఆమె కూడా కోవిడ్‌ నుంచి కోలుకున్నట్లు కుటుంబీకులు చెబుతున్నారు. అర్ధరాత్రి నూతి వద్దకు వచ్చిన ఆమె ప్రమాదవశాత్తూ జారి పడిపోయిందని అంటున్నారు. అమలాపురం రూరల్‌ సీఐ జి.సురేష్‌బాబు, తాలూకా ఎస్సై రాజేష్‌లు ఏఎస్సై, కానిస్టేబుల్, హోంగార్డులను అభినందించారు.

చదవండి: బాలిక కిడ్నాప్‌ కేసు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి..
చదివింది ఎమ్మెస్సీ.. అమ్మేది గంజాయి

     

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు