నాలుగో రోజూ కొనసాగిన వాదనలు

7 Nov, 2020 03:38 IST|Sakshi

రాజధాని వ్యాజ్యాల్లో తదుపరి విచారణ 9కి వాయిదా

సాక్షి, అమరావతి: పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో నాలుగో రోజు వాదనలు కొనసాగాయి. పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపించారు. దురుద్దేశంతోనే ప్రభుత్వం ఈ చట్టాలు తీసుకొచ్చిందన్నారు. పునర్విభజన చట్టంలో ఒకే రాజధాని అని మాత్రమే ఉందన్నారు.

అమరావతిని రాజధానిగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని, అందులో భాగంగానే కోట్లాది రూపాయల నిధులు విడుదల చేసిందని చెప్పారు. హైకోర్టు ప్రిన్సిపల్‌ బెంచ్‌ను అమరావతిలో నోటిఫై చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులిచ్చారని, అందుకు విరుద్ధంగా ఇప్పుడు ఓ చట్టం ద్వారా హైకోర్టును తరలించడానికి వీల్లేదన్నారు. రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారని తెలిపారు. వారికి ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కోర్టు సమయం ముగియడంతో హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.  

>
మరిన్ని వార్తలు