జీవో 2283 అభ్యంతర పిటిషన్‌.. అర్హతే లేదన్న ఏజీ

6 Dec, 2023 15:55 IST|Sakshi

సాక్షి, గుంటూరు: విశాఖకు క్యాంపు కార్యాలయాల తరలింపును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ  పిటిషన్‌ విచారణ అర్హతే లేదని.. పైగా పిటిషనర్లు అమరావతిలో భూముల్ని కలిగి ఉన్నారనే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌. 

ఉత్తరాంధ్ర అభివృద్ధి పర్యవేక్షణ, సమీక్ష కోసం.. కాబోయే పాలనా రాజధాని విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు కోసం ఏపీ ప్రభుత్వం నవంబర్‌ 22వ తేదీన జీవో నెంబర్‌ 2283 జారీ చేసింది. విశాఖలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను గుర్తిస్తూ ఐఏఎస్‌ల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ జీవో రిలీజ్‌ చేసింది. అయితే ఈ జీవోను సవాల్‌ చేస్తూ ఓ రిట్‌ పిటిషన్‌ దాఖలైంది.  

అమరావతి పరిరక్షణ సమితి మేనేజింగ్‌ ట్రస్టీ గద్దె తిరుపతిరావు, రాజధాని ప్రాంత రైతులు మాదాల శ్రీనివాసరావు, వలపర్ల మనోహరం ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. జీవో అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు వేయాలని కోర్టును పిటిషన్‌ ద్వారా కోరారు వాళ్లు. అయితే ఇవాళ్టి విచారణలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) రూపేనా కోర్టు ముందుకు రావాలే తప్ప రిట్‌ రూపంలో కాదని ఏజీ శ్రీరామ్‌ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. 

బుధవారం ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. ‘‘ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయాల్సిన అంశాన్ని రిట్ పిటిషన్గా దాఖలు చేశారు. రాజధానితో ముడిపడి ఉన్న అంశం చీఫ్‌ జస్టిస్‌ బెంచ్ లేదంటే ఫుల్ బెంచ్ ముందుకు మాత్రమే రావాల్సి ఉంటుంది. కానీ పిటిషనర్లు కావాలనే రిట్ వేశారు. పైగా పిటిషనర్లు అమరావతిలో భూములు కలిగి ఉన్నారు. కాబట్టి ఇది ఫోరమ్ షాపింగ్ కిందకు వస్తుందన్నారు (ఫోరమ్‌ షాపింగ్‌పై పలు తీర్పులను న్యాయస్థానానికి వివరించారాయన.. ). ఇరువైపులా వాదనలు విన్న కోర్టు.. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది.

ఇదీ చదవండి: విశాఖలో అధికారుల క్యాంప్ కార్యాలయాలు గుర్తింపు

>
మరిన్ని వార్తలు