ఉత్తరాదిలో శ్రీవారికి మరింత శోభ 

11 Nov, 2021 04:10 IST|Sakshi
బాధ్యతలు స్వీకరిస్తున్న వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి 

టీటీడీ ఢిల్లీ స్థానిక సలహామండలి చైర్‌పర్సన్‌గా ప్రశాంతిరెడ్డి బాధ్యతల స్వీకరణ 

సాక్షి, న్యూఢిల్లీ/తిరుమల: టీటీడీ ఆధ్వర్యంలో ఉత్తర భారతదేశంలో ఉన్న ఆలయాలను అభివృద్ధి చేయటానికి, కొత్తగా నిర్మించే ఆలయాల పర్యవేక్షణకు ఢిల్లీ స్థానిక సలహామండలి సమర్థంగా పనిచేయనుందని తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) బోర్డు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న సనాతన ధర్మప్రచార కార్యక్రమాలతో ఉత్తర భారతదేశంలో శ్రీవేంకటేశ్వరస్వామి వైభవాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ కమిటీ కృషిచేస్తుందన్నారు. ఢిల్లీలోని టీటీడీ ఆలయ స్థానిక సలహామండలి చైర్‌పర్సన్‌గా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

ఢిల్లీలోని శ్రీవారి ఆలయంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ జమ్మూలో చేపట్టిన ఆలయ నిర్మాణాన్ని 18 నెలల్లో పూర్తి చేయాలని నిర్దేశించినట్లు తెలిపారు. అయోధ్యలో రామజన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ కేటాయించే స్థలాన్ని బట్టి శ్రీవారి ఆలయంగానీ, భజన మందిరంగానీ నిర్మిస్తామని చెప్పారు. గో సంపద పరిరక్షణ ధ్యేయంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆలయాలకు ఆవును, దూడను ఇచ్చే కార్యక్రమం చేపట్టామని, ఇప్పటికే వంద ఆలయాలకు ఇచ్చామని తెలిపారు. గోఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని టీటీడీ నిర్ణయించినట్లు తెలిపారు.

సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో ఏపీ రైతు సాధికార సంస్థతో ఎంవోయూ చేసుకున్నట్లు చెప్పారు. గోఆధారిత వ్యవసాయంతో పండించిన పంటలను రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి టీటీడీ కొనుగోలు చేస్తుందన్నారు. శ్రీవారి ప్రసాదాలు, నిత్యాన్నదానంతో పాటు టీటీడీ అవసరాలకు గో ఆధారిత ఉత్పత్తులను సేకరిస్తామన్నారు. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ఢిల్లీతో పాటు ఉత్తరాదిలో శ్రీవారి వైభవాన్ని తెలియజెప్పే కార్యక్రమాలను చేపట్టడమేకాకుండా, భక్తులకు సౌకర్యాల కోసం కృషిచేస్తానని చెప్పారు. అనంతరం గోపూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, టీటీడీ చెన్నై స్థానిక సలహామండలి చైర్మన్‌ శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు