ఎన్నాళ్లో వేచిన ఉదయం

17 Sep, 2022 12:16 IST|Sakshi

ఆర్టీసీ ఉద్యోగులకు అక్టోబర్‌ నుంచి పీఆర్సీ 

ఉద్యోగ సంఘాల హర్షం

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 3,600 మందికి లబ్ధి

రాజమహేంద్రవరం సిటీ: ఆర్టీసీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన ఉద్యోగులకు అక్టోబర్‌ నుంచి పీఆర్సీ అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటనతో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. పీఆర్సీ అమలు ప్రకటనను స్వాగతిస్తున్నామంటూ ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న పీఆర్సీతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో (ప్రస్తుత తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలు) సుమారు 3,600 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. సీఎం వైఎస్‌ జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఆర్‌టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేసి పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ (ఏపీఎస్‌పీటీడీ)గా మార్చారు. కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పదోన్నతి కల్పించారు. 

కార్మికుల సంబరాలు
అక్టోబర్‌ నుంచి పీఆర్సీ అమలు కానుండడంతో ఆర్టీసీ ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమయంలో ఆర్టీసీని అప్పుల ఊబిలో నుంచి కొంతమేర బయటకు తీసుకువచ్చి, ఆర్టీసీ కార్మికులకు అనేక రాయితీలు కల్పించి అండగా నిలిచారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆర్టీసీపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మరిన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయింది. వైఎస్‌ జగన్‌ సీఎం అయిన తర్వాత 2020 జనవరిలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినట్లు ప్రకటించారు. అయితే సంస్థాగత, సాంకేతిక, విధాన పరంగా కొన్ని చిక్కులు రావడంతో ప్రత్యేక దృష్టి సారించి వాటిని పరిష్కరించారు. అనంతరం అక్టోబర్‌ 1వ తేదీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త పీఆర్సీని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. 

పెరగనున్న జీతాలు 
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో రాజమహేంద్రవరం, అమలాపురం, కాకినాడ, రావులపాలెం, రామచంద్రపురం, రాజోలు, ఏలేశ్వరం, తుని, గోకవరం, కొవ్వూరు, నిదడవోలు ఆర్టీసీ డిపోలున్నాయి. ఈ డిపోల్లోని సుమారు 3600 మంది ఉద్యోగులకు నూతన పీఆర్సీ ప్రకారం కొత్త జీతాలు అందనున్నాయి. వీరిలో పర్యవేక్షణ అధికారులు, సిబ్బంది, డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, క్లీనర్లు, ఎల్రక్టీíÙయన్లు ఉన్నారు. వీరికి వారి ఉద్యోగ స్థాయి ప్రకారం రూ.2 వేల నుంచి 6 వేల వరకు అదనంగా జీతాలు పెరగనున్నాయి. ప్రతిరోజు ఉమ్మడి జిల్లాలో 2 లక్షల నుంచి 3 లక్షల మంది వరకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. రోజుకు సుమారు రూ.కోటి వరకు ఆదాయం వస్తుంది. దీంతో పాటు కార్గో ద్వారా ఆదాయం సమకూరుతోంది.  

పీఆర్సీని స్వాగతిస్తున్నాం 
మేము ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన తరువాత మొదటిసారి అమలు చేస్తున్న పీఆర్సీని స్వాగతిస్తున్నాం. ముఖ్యమంత్రి నిర్ణయం ఆనందాన్ని నింపుతోంది. పాత బకాయిలు సైతం విజయదశమి నాటికి అందజేస్తే ఉద్యోగులకు మరింత ఊరట కలుగుతుంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
– గిడ్ల చిరంజీవి, ఏపీపీటీడీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ సెక్రటరీ, రాజమహేంద్రవరం

సీఎం జగన్‌కు ధన్యవాదాలు
ఇప్పటివరకూ చిన్నపాటి మొత్తంలో జీతాలు తీసుకుంటున్న మాకు కొత్త పీఆర్సీ ద్వారా వచ్చే జీతాలు ఎంతో ఉపయోగపడతాయని భావిస్తున్నాం. మా దశాబ్దాల కల నెరవేరింది. ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేర్చారు. మా ఉద్యోగులు అందరి తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. 
– సీహెచ్‌ఎన్‌ లక్ష్మీ, ఏపీపీటీడీ ఎంప్లాయూస్‌ యూనియన్, మహిళా కమిటీ కోశాధికారి, రాజమహేంద్రవరం

చాలా సంతోషం
ఆర్టీసీ కార్మికులందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా మార డం సంతోషంగా ఉంది. ఇప్పుడు అన్ని రాయితీలు మాకు అందుతున్నాయి. కొత్త పీఆర్సీ అమలుతో జీతాలు కూడా పెరుగుతాయి. మేము ప్రభుత్వ ఉద్యోగులమని గర్వంగా చెప్పుకుంటున్నాం. మాకు సమాజంలో గౌరవం పెరిగింది. సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం. 
– పోలిశెట్టి లక్ష్మణరావు, ఏపీపీటీడీ మజ్దూర్‌ యూనియన్‌ అధ్యక్షుడు, రాజమహేంద్రవరం 

సాహసోపేతం
ఆరీ్టసీని పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌ మెంట్‌గా మార్చి ప్రభుత్వంలో విలీనం చేసి, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేయడం సాహసోపేత నిర్ణయం. ఎన్ని అవరోధాలు ఏర్పడినా సీఎం జగన్‌ తాను ఇచ్చిన హామీని నెరవేర్చారు. ఉద్యోగుల తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పీఆర్సీ అమలుతో కొత్త జీతాలు రావడం ఆనందంగా ఉంది.
– వీరమల్లు శివ లక్ష్మణరావు, డ్రైవింగ్‌ స్కూల్‌ కోచ్, రాజమహేంద్రవరం  

మరిన్ని వార్తలు