డిగ్రీ ఇంటర్న్‌షిప్‌కు సర్వం సిద్ధం

8 Mar, 2022 04:04 IST|Sakshi

27 వేలకు పైగా సంస్థలతో ఏర్పాట్లు 

జిల్లాలవారీగా సంస్థలను గుర్తించి కాలేజీలకు అనుసంధానం 

వివిధ సంస్థలతో సమన్వయానికి ప్రతి జిల్లాకు ఓ కమిటీ 

విద్యార్థులను సమగ్ర నైపుణ్యాలతో తీర్చిదిద్దుతాం: ప్రొఫెసర్‌ హేమచంద్రారెడ్డి

సాక్షి, అమరావతి: ఏపీలో ఉన్నత విద్యలో అత్యున్నత ప్రమాణాలకు చేపట్టిన సంస్కరణల్లో భాగంగా డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇంజనీరింగ్‌ తదితర ప్రొఫెషనల్‌ కోర్సులకు ఏడాది పాటు ఇంటర్న్‌షిప్‌ అమలు చేస్తున్నారు. నాన్‌ ప్రొఫెషనల్‌ కోర్సుల్లో నాలుగేళ్ల డిగ్రీ ఆనర్‌ కోర్సులు అభ్యసించే వారికి ఏడాది ఇంటర్న్‌షిప్‌ను ప్రవేశపెట్టారు. మూడేళ్లలో డిగ్రీ కోర్సు నుంచి ఎగ్జిట్‌ అయ్యేవారికి 10 నెలల ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశారు. రెండేళ్లుగా కరోనా కారణంగా ఇంటర్న్‌షిప్‌ అమలులో ఆటంకాలు కలిగాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో కరోనా తగ్గింది. కాలేజీల్లో ప్రత్యక్ష తరగతులూ జరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వ సూచనల మేరకు రాష్త్ర ఉన్నత విద్యా మండలి ఇంటర్న్‌షిప్‌ అమలుకు ఏర్పాట్లు చేస్తోంది.  

27వేల సంస్థల గుర్తింపు.. 
విద్యార్థుల ఇంటర్న్‌షిప్‌నకు రాష్ట్రంలోని  27,119 సంస్థలను గుర్తించారు. వీటిలో ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. పరిశ్రమలు, ఐటీ సంస్థలు, ప్రముఖ వర్తక, వాణిజ్య సంస్థలతో సహా కోర్సులతో సంబంధమున్న మైక్రో, స్మాల్, మీడియం, లార్జ్, మెగా సంస్థలను ఎంపికచేశారు. మాన్యుఫాక్చరింగ్‌తో పాటు సర్వీసు సంస్థలూ ఉన్నాయి. వీటిలో ఏపీ జెన్‌కో, హ్యుందాయ్, కియా మోటార్స్, విప్రో, అమర రాజా బ్యాటరీస్, కోల్గేట్‌ పామోలివ్‌ (ఇండియా) లిమిటెడ్, హీరో మోటోకార్ప్‌ లిమిటెడ్, జిందాల్‌ అర్బన్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్, ఏపీ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్, రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్, సెంబ్‌కార్ప్‌ ఎనర్జీ లిమిటెడ్, అరబిందో ఫార్మా లిమిటెడ్, డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్, హెటిరో ల్యాబ్స్‌ లిమిటెడ్, ఫైజర్‌ హెల్త్‌కేర్‌ ఇండియా, విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్, మైలాన్‌ లేబొరేటరీస్‌ లిమిటెడ్‌ సహా వేలాది కంపెనీల్లో  ఇంటర్న్‌షిప్‌నకు అవకాశముంది.

ఇంటర్న్‌షిప్‌ చేసేందుకు ఉన్నత విద్యా మండలి పోర్టల్‌లో  లెర్నింగ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఎల్‌ఎంఎస్‌)ను ఏర్పాటు చేశారు. జిల్లాలవారీగా గుర్తించిన సంస్థల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచారు.  ఆయా సంస్థలతో సమన్వయం చేసేందుకు కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలను ప్రభుత్వం నియమించింది. వీటిలో వర్సిటీల వీసీలు, కొన్ని కాలేజీల ప్రిన్సిపాళ్లు, ఇతర అధికారులు ఉన్నారు. విద్యార్థులకు సహకరించేందుకు కాలేజీల్లో సమన్వయకర్తలను నియమించారు. ఇంటర్న్‌షిప్‌ ద్వారా విద్యార్థులను సమగ్ర నైపుణ్యాలతో తీర్చిదిద్దుతామని ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి చెప్పారు.  

మరిన్ని వార్తలు