నారికేళం ‘ధర’హాసం 

18 Oct, 2023 02:41 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వం చొరవతో పెరిగిన కొబ్బరి ధర 

వెయ్యి కాయలకు రూ.రెండు వేల వరకు పెరుగుదల 

కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో దిగివచ్చిన వ్యాపారులు 

మరోవైపు కలిసొస్తున్న దసరా.. దీపావళి.. కార్తీక మాసం

సాక్షి అమలాపురం/అంబాజీపేట: కొబ్బరి ధర పతనమై రైతులు ఇబ్బంది పడుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలించాయి. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని నాఫెడ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయించింది. దీంతో కొబ్బరి ధరలు అమాంతంగా పెరిగాయి. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన తరువాత పచ్చి కొబ్బరి వెయ్యి కాయలకు రూ.రెండు వేల వరకు ధర పెరగ్గా.. ఎండు కొబ్బరి క్వింటాల్‌కు రూ.500 చొప్పున పెరగడం విశేషం.

రాష్ట్రంలో 3 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగవుతుండగా.. ఉభయ గోదావరి జిల్లాలలోనే అత్యధికంగా 1.78 లక్షల ఎకరాల్లో ఉంది. ఉద్యాన శాఖ అంచనా ప్రకారం సగటున 106.9 కోట్ల కాయల దిగుబడిగా వస్తోంది. ఇందులో అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో 1.03 లక్షల ఎకరాలు, కాకినాడ జిల్లాలో 20 వేల ఎకరాలు, తూర్పు గోదావరి జిల్లాలో 18,754 ఎకరాల్లో సాగు కొబ్బరి సాగవుతోంది.   

నాఫెడ్‌ కేంద్రాలు.. వరుస పండుగలతో.. 
రాష్ట్రంలో కొబ్బరి మార్కెట్‌ ధరలు అంబాజీపేట మార్కెట్‌పై ఆధారపడి ఉంటాయి. కొబ్బరి ధరలు పతనం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని కోనసీమ జిల్లాలో నాఫెడ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయించింది. ప్రస్తుతానికి అంబాజీపేట మార్కెట్‌ యార్డు కేంద్రంగా కార్యకలాపాలకు అధికారులు సిద్ధమయ్యారు. తొలిసారి ఆర్‌బీకేల ద్వారా కూడా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ మిల్లింగ్‌ కోప్రా (ఎండు కొబ్బరి)ను క్వింటాల్‌ను రూ.10,860, బాల్‌ కోప్రా (కురిడీ కొబ్బరి గుడ్డు) క్వింటాల్‌ రూ.11,750 చొప్పున ధర చెల్లించి కొనుగోలు చేయనున్నారు.

కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో కొబ్బరి మార్కెట్‌లో ఒక్కసారిగా కదలిక వచ్చింది. ఈ పరిస్థితుల్లో స్థానిక వ్యాపారులు దిగి వచ్చి ధరలు పెంచారు. మరోవైపు దసరా, దీపావళి, కార్తీక మాసం రావడంతో ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు జోరందుకున్నాయి. దీంతో పచ్చికాయ, ముక్కుడు కాయల ధరలు పెరిగాయి. ప్రస్తుత మార్కెట్‌లో వెయ్యి కాయల ధర రూ.8 వేల నుంచి రూ.8,500 వరకు ఉంది. గడచిన 10 రోజులలో ధర రూ.2 వేల వరకు పెరగడం విశేషం.

మరిన్ని వార్తలు