ధాన్యంలాగే కొబ్బరీనూ..

16 Sep, 2023 04:33 IST|Sakshi

ఆర్బీకేల ఆధ్వర్యంలో కళ్లాల వద్దే కొనుగోళ్లు  

రైతులపై తగ్గనున్న రవాణా, కూలీల భారం

దళారీ వ్యవస్థకు పూర్తిగా చెక్‌

కోనసీమలో నేటి నుంచి నాఫెడ్‌ కేంద్రాలు ప్రారంభం

కొబ్బరి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సువర్ణావకాశం

సాక్షి అమలాపురం/ అంబాజీపేట : కొబ్బరి కొనుగోలులో దళారుల వ్యవస్థను తొలగించడంతోపాటు రైతులకు రవాణా, కూలి ఖర్చుల భారం తగ్గేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొబ్బరి ధరలు తగ్గిన నేపథ్యంలో నేషనల్‌ అగ్రికల్చర్‌ కోఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (నాఫెడ్‌) ఆధ్వర్యంలో శనివారం నుంచి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో కొబ్బరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనుంది.

ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లుగానే ఈ కేంద్రాల్లో కూడా కొబ్బరి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. గతంలో మార్కెట్‌ యార్డుల కేంద్రంగా కొబ్బరి కొనుగోలు చేయగా, ఈసారి ఆర్బీకే స్థాయిలో కొబ్బరి కొనుగోలు చేయాలని తీసుకున్న నిర్ణయంతో రైతులకు మేలు జరగనుంది. 

గతంలో ఇలా..
గతంలో రైతులు మార్కెట్‌ యార్డులకు ఎండుకొబ్బరిని తీసుకువెళ్లాల్సి వచ్చేది. రోజుంతా అక్కడే కళ్లాలలో ఎండబెట్టేవారు. నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే కొనేవారు. లేదంటే వెనక్కి తెచ్చుకోవాల్సిందే. ఇది రైతులకు నష్టాన్ని కలగజేసేది. ఒకవేళ కొనుగోలు చేసినా నాఫెడ్‌కు తీసుకువెళ్లడానికి రవాణా ఖర్చుతోపాటు ఎండబెట్టడం, మూటలు కట్టడానికి ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకురావాల్సి వచ్చేది.

ప్రస్తుతం రోజుకు కూలి ఖర్చు రూ.600లు కాగా.. యార్డు వరకు తీసుకొస్తే రూ.వెయ్యి వరకు కూలి ఇవ్వాల్సి వచ్చేది. అధికారులే కళ్లాలు వద్దకు వచ్చి నాణ్యత నిర్ధారించి, అక్కడే కొనుగోలు చేయనున్నారు. ఇలా కొన్న కొబ్బరిని రైతులే సమీపంలోని నాఫెడ్‌ కేంద్రాలకు తరలించాల్సి ఉంది. రైతులపై ఈ భారం మాత్రమే పడనుంది.

కూలి ఖర్చులు కలిసిరావడం అంటే రైతులకు క్వింటాల్‌కు రూ.500ల నుంచి రూ.800లు వరకు మిగలనుంది. రైతులే సొంతంగా ఎగుమతి చేస్తే కూలి ఖర్చులు కూడా కలిసివస్తాయి. ఈ విధానంవల్ల దళారుల పాత్ర దాదాపు లేనట్లే. గతంలో ఈ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన కొబ్బరి 90 శాతం దళారులదే. ఇప్పుడు రైతులు నేరుగా లబ్ధిపొందనున్నారు. 

నాఫెడ్‌ కేంద్రాలు సేకరించిన కొబ్బరిని ఆర్బీకేల ఆధ్వర్యంలో కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 
రైతులు ముందుగా ఆర్బీకేల్లో పేరు, ఇతర వివరాలు నమోదు చేయించుకోవాలి. 

ఆర్బీకేల ద్వారా కళ్లాల్లోనే కొనుగోలు..
 ఎకరాకు నెలకు రెండు కొబ్బరి బస్తాల (క్వింటాల్‌) చొప్పున కొనుగోలుకు విలేజ్‌ హార్టికల్చర్‌ అసిస్టెంట్‌లు రైతులకు ధ్రువీకరణ పత్రాలిస్తారు. 
 రైతుల వివరాలతో పాటు, కొబ్బరి విక్రయాలకు సంబంధించి కంటిన్యూస్‌ మోనిటరింగ్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ప్రైనిస్‌ అండ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ (సీఎం యాప్‌)లో నమోదు చేస్తారు.
దీని ఆధారంగా నాఫెడ్‌కు ఇంప్లిమెంట్‌ ఏజెన్సీగా ఉన్న ఆయిల్‌ ఫెడ్‌ అధికారులు రైతుల వద్దకు వెళ్లి కొబ్బరి కొనుగోలు చేస్తారు.

సర్కారు ప్రత్యేక చొరవతో కేంద్రం అనుమతి..
రాష్ట్రంలో మూడు లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతుండగా, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 1.78 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. ఇక్కడ సగటున 106.90 కోట్ల కాయలు దిగుబడిగా వస్తాయని అంచనా. తమిళనాడు, కేరళ, కర్ణాటకల నుంచి పోటీవల్ల ఉత్తరాదికి ఎగుమతులు క్షీణించడంతో కొబ్బరి ఉత్పత్తుల ధరలు తగ్గాయి. వెయ్యి కాయల ధర రూ.7 వేలు ఉంది. ధరలు పతనం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని నాఫెడ్‌ కేంద్రాల ద్వారా కొబ్బరి కొనుగోలుకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకొచ్చింది.

జిల్లాలో తొలుత అంబాజీపేటలోను, తరువాత కొనుగోలు సామర్థ్యాన్ని బట్టి ముమ్మిడివరం, తాటిపాక, రావులపాలెం, నగరం మార్కెట్‌ యార్డుల్లో వీటిని ప్రారంభించనున్నారు. మిల్లింగ్‌ కోప్రా (ఎండు కొబ్బరి)ని క్వింటాల్‌కు రూ.10,860లు, బాల్‌కోప్రా (కురిడీ కొబ్బరి గుడ్డు) క్వింటాల్‌ రూ.11,750 చొప్పున కొనుగోలు చేయనున్నారు. ప్రస్తుత మార్కెట్‌లో ఎండు కొబ్బరి ధర రూ.8 వేలు, కురిడీ కొబ్బరి గుడ్డు రూ.తొమ్మిది వేల నుంచి రూ.12 వేల వరకు ఉంది. ఈ కేంద్రాల ఏర్పాటువల్ల బహిరంగ మార్కెట్‌లో కొబ్బరికాయకు ధర వస్తోందని, స్థానికంగా నిల్వ ఉన్న కొబ్బరి మార్కెట్‌కు వెళ్తే వచ్చే దసరా, దీపావళికి డిమాండ్‌ వస్తుందని రైతులు ఆశిస్తున్నారు.

షెడ్యూలు ప్రకారం కొనుగోలు
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్బీకే స్థాయిలో కొబ్బరి కొనుగోలు చేస్తాం. రైతులు మార్కెట్‌ యార్డుల వద్దకు వచ్చి కొబ్బరి ఎండబెట్టి అమ్మకాలు చేయాల్సిన అవసరం ఉండదు. మేం కొనుగోలు చేసిన తరువాత సమీపంలో యార్డుకు తరలిస్తే సరిపోతోంది. సీఎం యాప్‌లో నమోదును బట్టి ఆయా ఆర్బీకేలకు ఒక షెడ్యూలు పెట్టుకుని కొబ్బరి కొనుగోలు చేస్తాం.– యు. సుధాకరరావు, మేనేజర్, ఆయిల్‌ఫెడ్‌ 

మరిన్ని వార్తలు