ఆయిల్‌పామ్‌ @ 2.30 లక్షల ఎకరాలు

18 Aug, 2023 01:05 IST|Sakshi

ఈ ఏడాదికి సాగులక్ష్యం ఖరారు చేసిన ఉద్యానశాఖ 

ప్రోత్సాహం అందించేందుకు ముందుకొచ్చిన కేంద్రం

అత్యధికంగా ఆయిల్‌ఫెడ్‌కు 77 వేల ఎకరాలు 

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 2.30 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేయాలని ఉద్యాన శాఖ నిర్ణయించింది. ఇందుకు ప్రభుత్వం రూ.750 కోట్లు కేటాయించింది. ఉద్యాన శాఖ సాగు ప్రణాళికకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణం వేగంగా పెరిగే అవకాశముంది.

ఇప్పటికే ఆయా జిల్లాల్లో 38 నర్సరీలు ఏర్పాటు చేసిన కంపెనీలు అవసరమైన మొక్కల్ని పెంచుతున్నాయి. ఆయిల్‌పామ్‌ సాగుపై ఆసక్తి గల రైతులు ఆయా జిల్లాల ఉద్యానశాఖ అధికారులు,  గ్రామాల్లోని ఏఈఓలను సంప్రదించాలని ఉన్నతాధికారులు చెబుతున్నారు. 

ఆయిల్‌ఫెడ్‌కు ఈ ఏడాది అధిక విస్తీర్ణంలో సాగు లక్ష్యాన్ని నిర్దేశించించింది. ఈ సంస్థ 8 జిల్లాల పరిధిలో  76,900 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేయాలి. తర్వాత ప్రీ యూనిక్‌ కంపెనీ 7 జిల్లాల్లో 34,800 ఎకరాలు, లోహియా కంపెనీ 27,100 ఎకరాలు, రుచిసోయా  24,300 ఎకరాలు, తిరుమల ఆయిల్‌ కంపెనీ 14,900 ఎకరాల్లో రైతులను సాగుకు ప్రోత్సహించేలా అనుమతి ఇచ్చింది. 

జిల్లాల వారీగా సాగు టార్గెట్‌ చూస్తే...కరీంనగర్‌ జిల్లాలో 18 వేల ఎకరాలు, సిద్దిపేట జిల్లాలో 17,800 ఎకరాలు,  కొత్తగూడెంలో 16,800 ఎకరాలు, పెద్దపల్లిలో 14,900 ఎకరాలు, భూపాలపల్లిలో 12,800 ఎకరాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. 

గతేడాదివరకు రాష్ట్రంలో 27 జిల్లాలకే ఆయిల్‌పామ్‌ సాగు పరిమితమైంది. ఈ ఏడాది కొత్తగా రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాలు ఈ  జాబితాలో చేరాయి. హైదరాబాద్, మేడ్చల్‌ జిల్లాలను మినహాయిస్తే మొత్తం 31 జిల్లాల్లో ఆయిల్‌పామ్‌ సాగుకానుంది.  

రంగారెడ్డి జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగుకు వాల్యూ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సర్వీసెస్‌ కంపెనీ ముందుకురాగా,  ఈ ఏడాది 5,500 ఎకరాలు లక్ష్యంగా నిర్దేశించారు. వికారాబాద్‌ జిల్లాలో హెల్తీ హార్ట్స్‌ కంపెనీకి 3 వేల ఎకరాలు, మెదక్‌ జిల్లాలో లివింగ్‌ కంపెనీకి 5 వేల ఎకరాలు, సంగారెడ్డి జిల్లాలో గోద్రెజ్‌ కంపెనీకి 5 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేపట్టేలా అనుమతి ఇచ్చింది. 

రాష్ట్రం ఏర్పడే నాటికి ఆయిల్‌పామ్‌ సాగు కేవలం 36 వేల ఎకరాలు మాత్రమే.  ప్రస్తుతానికి ఈ సాగు   1.54 లక్షల ఎకరాలకు పెరిగింది. సాగు గణాంకాల్లో దేశవ్యాప్తంగా చూస్తే తెలంగాణ రెండోస్థానంలో ఉంది. 

>
మరిన్ని వార్తలు