చరిత్రను తిరగరాసిన నిమ్మ ధరలు... కిలో నిమ్మ రూ.180

5 Apr, 2022 09:06 IST|Sakshi

సాక్షి, గూడూరు (తిరుపతి జిల్లా): నిమ్మ ధర రోజు రోజుకూ పెరుగుతూ చరిత్రను తిరగరాస్తోంది. సోమవారం కిలో నిమ్మకాయల ధర రికార్డు స్థాయిలో రూ.180 పలికింది. లూజు బస్తా కనిష్ట ధర రూ.12 వేలు.. గరిష్ట ధర రూ.14 వేల వరకు పలుకుతోంది. నిమ్మ పండ్లు కూడా ఎన్నడూ లేనివిధంగా కిలో కనిష్టంగా రూ.110.. గరిష్టంగా రూ.130 వరకు ధర పలుకుతుండటంతో నిమ్మ రైతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

నార్త్‌ టు సౌత్‌ డిమాండ్‌తో..
గూడూరు నిమ్మ మార్కెట్‌ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి లారీల కొద్దీ నిమ్మకాయలు ఎగుమతి అవుతాయి. ప్రస్తుతం అక్కడ «నిమ్మకాయలకు డిమాండ్‌ బాగా పెరిగింది. దీంతో ఇక్కడి నిమ్మ మార్కెట్‌కు ఊపొచ్చింది. ఎండల తీవ్రత అధికంగా ఉన్నా.. నార్త్‌ ఢిల్లీ నుంచి ఇటు సౌత్‌ చెన్నై, బెంగళూరు వరకూ రెండు రోజులుగా నిమ్మకాయలకు డిమాండ్‌ పెరగడంతో ధర పరుగులు తీస్తోంది.

కాపు తగ్గడంతో..
ఒక రోజులోనే ఢిల్లీ మార్కెట్‌కు కాయల్ని తరలించగలిగేంత దూరంలో ఉన్న భావానగర్, మహారాష్ట్రలోని బీజాపూర్‌లో నిమ్మ దిగుబడి ఆశించిన స్థాయిలో లేదు. రాష్ట్రంలోని తెనాలి, ఏలూరు, రాజమండ్రి తదితర ప్రాంతాల్లోనూ కాపు తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో గూడూరు మార్కెట్‌లో నిమ్మకాయలకు ధర భారీగా పెరిగింది.

ఈ ధర కొన్నాళ్లుంటే కోటీశ్వరులే
నిమ్మ ధర ఇప్పటివరకూ ఇంత పలికిందే లేదు. వారం..పది రోజులుగా నిలబడిందీ లేదు. ఈ ధరలు కొన్నాళ్లు నిలకడగా ఉంటే నిమ్మ రైతులంతా కోటీశ్వరులవుతారు.
– పంట నాగిరెడ్డి, మిటాత్మకూరు, గూడూరు మండలం

(చదవండి: హైదరాబాద్‌ నుంచి ఢాకా, బాగ్దాద్‌ నగరాలకు విమానాలు!)

మరిన్ని వార్తలు