పత్తి బంగారమైంది

2 Nov, 2021 02:50 IST|Sakshi

రైతన్నకు ప్రభుత్వ దన్ను, అంతర్జాతీయంగా పత్తి ధర పెరగడమే కారణం

మేలు రకం పత్తి ధర క్వింటాల్‌కు రూ.8,800.. సెకండ్‌ క్వాలిటీ రూ.6,109

కనీస మద్దతు ధరకు మించి వ్యాపారుల కొనుగోలు

ఈసారి క్వింటాల్‌ రూ.10 వేల మార్కును అందుకునే అవకాశం

సాక్షి, అమరావతి: పత్తి రైతుకు ఈ ఏడాది పండగే అయింది. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం, అంతర్జాతీయంగా డిమాండ్‌ పెరగడంతో తెల్ల బంగారమే అయింది. కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)కంటే ఎక్కువే రైతుకు లభిస్తోంది. ప్రస్తుతం పత్తి ఎమ్మెస్పీ క్వింటాల్‌కు రూ.6,025 ఉండగా, మార్కెట్‌లో రూ.8,800 పలుకుతోంది. ఇది రూ.10వేల వరకు వెళ్లవచ్చని అంచనా వేస్తున్నారు. 

తగ్గిన విస్తీర్ణం.. పెరిగిన డిమాండ్‌
రాష్ట్రంలో పత్తి సాధారణ విస్తీర్ణం 14.73 లక్షల ఎకరాలు. గతేడాది 14.91లక్షల ఎకరాల్లో సాగైంది. ఈ ఏడాది 12.86 లక్షల ఎకరాల్లోనే సాగైంది. గతేడాది 10.46 లక్షల మిలియన్‌ టన్నుల దిగుబడి రాగా,  ఈ ఏడాది 9.33 లక్షల మిలియన్‌ టన్నులు వస్తుందని అంచనా. ఈ ఏడాది క్వింటాల్‌ పొడుగు పింజ పత్తి రూ.6025, మధ్యస్థ పత్తి రూ.5,726గా కనీస మద్దతు ధర నిర్ణయించారు. గత రెండేళ్లలో ఎమ్మెస్పీ లభించకపోవడంతో ప్రభుత్వం కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ద్వారా 2019–20లో 13 లక్షల క్వింటాళ్లు,  2020–21 లో 18 లక్షల క్వింటాళ్ల పత్తిని 44,440 మంది రైతుల నుంచి ఎమ్మెస్పీకి కొనుగోలు చేసింది.

ఈ ఏడాది 50 మార్కెట్‌ యార్డులతో పాటు 73 జిన్నింగ్‌ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. దీంతో వ్యాపారులు రేటు తగ్గించే అవకాశం లేకుండా పోయింది. సీజన్‌ ఆరంభం నుంచి మంచి ధర పలుకుతోంది. రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణం తగ్గింది. కొన్ని ప్రాంతాల్లో దిగుబడి పెరిగినప్పటికీ, అకాల వర్షాలతో కొన్ని చోట్ల దిగుబడి తగ్గింది. మొత్తం మీద చూస్తే దిగుబడి తగ్గింది. దీంతో డిమాండ్‌ పెరిగింది. దీనికి నాణ్యత కూడా తోడవడంతో పత్తి రైతుకు ఎక్కువ ధర లభిస్తోంది. కోవిడ్‌ నేపథ్యంలో అంతర్జాతీయంగా దూది వినియోగం పెరడం, కాటన్‌ యార్న్‌ ధరలు పెరగడం కూడా పత్తి ధరల పెరుగుదలకు కారణాలుగా చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కాటన్‌ సీడ్‌కు కూడా మంచి రేటొస్తోంది. క్వింటాల్‌కు కనిష్టంగా రూ.3,180 గరిష్టంగా రూ.3,620 పలుకుతోంది.

ఆదోని ‘పత్తి’ యార్డుకు మహర్దశ
పత్తికి మంచి ధర వస్తుండటంతో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాన పత్తి మార్కెట్‌గా పేరొందిన కర్నూలు జిల్లా ఆదోని యార్డుకు వ్యాపారులు క్యూ కడుతున్నారు. ఇక్కడకు ఏపీతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల పత్తి రైతులొస్తుంటారు. సీజన్‌ ప్రారంభం నుంచి సోమవారం వరకు 2 లక్షల క్వింటాళ్ల పత్తి అమ్మకాలు జరిగాయి. రోజుకు వెయ్యి మంది రైతులు 25 వేల క్వింటాళ్ల పత్తిని తీసుకొస్తున్నారు. 

క్వింటాల్‌ రూ.8,670కు అమ్ముకున్నా
నేను మూడెకరాల్లో పత్తి సాగు చేస్తున్న. ఈ ఏడాది ఎకరాకు 9 క్వింటాళ్ల వరకు వస్తోంది. సోమవారం ఆదోని యార్డులో క్వింటాలు రూ.8,670 చొప్పున 8 క్వింటాళ్లు అమ్మాను. గతంలో ఎప్పుడూ ఇంత ధర రాలేదు. చాలా ఆనందంగా ఉంది.
– కే.వీరన్న, పరవతపురం, కర్నూలు జిల్లా

గత ఏడాదికంటే ధర పెరిగింది
నేను 2 ఎకరాల్లో పత్తి వేశా.  మొదటి కోతలో 3 క్వింటాళ్లు రాగా క్వింటాల్‌ రూ.6,800కు అమ్మాను. రెండో కోతలో 5 క్వింటాళ్ల దిగుబడి రాగా రూ.7,500కు అమ్ముకున్నా. గతేడాదికంటే ఈసారి మంచి ధర వస్తోంది. 
– షేక్,ఖాసీం, పెద్దవరం, కృష్ణా జిల్లా

లాట్‌కు 10 మంది పోటీపడుతున్నారు
అనూహ్యంగా పెరిగిన ధరతో పత్తి కొనుగోలుకు వ్యాపారులు క్యూకడుతున్నారు. ఈసారి నాణ్యమైన పత్తి అధికంగా వస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా మన యార్డులో లాట్‌కు పది మంది తక్కువ కాకుండా పోటీపడుతున్నారు. మంచి ధర పలుకుతోంది.
– బి. శ్రీకాంతరెడ్డి, కార్యదర్శి, ఆదోని మార్కెట్‌యార్డు, కర్నూలు జిల్లా

ఈసారి మంచి రేటొస్తుంది
అంతర్జాతీయంగా పత్తికి డిమాండ్‌ పెరగడంతో రాష్ట్రంలోని రైతుల నుంచి పత్తి కొనుగోలుకు వ్యాపారులు పోటీపడుతున్నారు. సోమవారం అత్యధికంగా క్వింటాల్‌కు రూ.8,800 ధర పలికింది. రోజురోజుకు పెరుగుతున్న ధరను బట్టి చూస్తుంటే ఈసారి క్వింటాల్‌ రూ.9500కు పైగా పలుకుతుందని అంచనా వేస్తున్నాం. రూ.10 వేల మార్కును అందుకున్నా ఆశ్చర్య పోనక్కర్లేదు.
జి.సాయిఆదిత్య, ఏజీఎం, సీసీఐ

కర్నూలు జిల్లా కౌతలం మండలం తోవి గ్రామానికి చెందిన ఈ రైతు పేరు టి.నాగరాజు. 15 ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. గత ఏడాది కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) క్వింటాల్‌కు రూ.5,825. అయినా మార్కెట్‌లో క్వింటాల్‌ రూ. 4,800 మించి ధర లేదు. దీంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో కనీస మద్దతు ధర (క్వింటాల్‌ రూ.6,025)కు విక్రయించాడు. ప్రభుత్వ కేంద్రం లేకపోతే తక్కువ ధరకు వ్యాపారులకే అమ్ముకోవాల్సి వచ్చేది. అతను ఖరీఫ్‌లో కూడా పత్తి సాగు చేయగా ఎకరాకు 9–10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈసారి వ్యాపారులే మంచి రేటు ఇస్తుండటంతో సోమవారం ఆదోని మార్కెట్‌ యార్డులో క్వింటాల్‌ రూ.8,800కు అమ్ముకోగలిగాడు. అంటే ఎమ్మెస్పీ (రూ.6,025) కంటే రూ.2,775 అధికంగా వచ్చింది. పెట్టుబడిపోను ఎకరాకు రూ.49 వేలు లాభంతో ఆనందంగా ఇంటికెళ్లాడు.

మరిన్ని వార్తలు