20 గంటల్లోనే రైల్వేట్రాక్‌ రెడీ!

31 Oct, 2023 05:11 IST|Sakshi
బోగీని క్రేన్‌ ద్వారా తొలగిస్తున్న సిబ్బంది, అప్‌లైన్‌లో ప్రయాణం సాగిస్తున్న ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌

యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు   

సాక్షి, విశాఖపట్నం: విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో రైల్వే యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రమాదం జరిగిన గంట వ్యవధిలోనే సహాయక చర్యలతో పాటు పునరుద్ధరణ పనులు ప్రారంభించింది. కేవలం 20 గంటల వ్యవధిలోనే రెండు ట్రాక్‌లలో రైళ్ల రాకపోకల్ని అధికారులు ప్రారంభించారు.

వేలాది మంది రైల్వే సిబ్బంది, కార్మికుల సాయంతో అర్థరాత్రి మొదలుకుని.. సోమవారం రాత్రి వరకూ పనుల్ని నిర్వహించారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న వాల్తేరు రైల్వే డివిజనల్‌ మేనేజర్‌(డీఆర్‌ఎం) సౌరభ్‌ ప్రసాద్‌ ఘటనా స్థలికి 45 నిమిషాల్లోనే చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు.

అప్పటికే విశాఖ, విజయనగరం జిల్లాలకు చెందిన ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ పోలీసులు, ఏపీ పోలీసులు.. స్థానికుల సహకారంతో క్షతగాత్రుల్ని వెలికితీసి ఆస్పత్రులకు తరలించే ప్రక్రియలో నిమగ్నమయ్యారు. మరోవైపు, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఓడీఆర్‌ఏఎఫ్‌ బృందాలు ప్రమాద స్థలికి చేరుకున్నాయి. అర్థరాత్రి 2.30 గంటలకల్లా.. మృతదేహాల్ని, క్షతగాత్రుల్ని ఆస్పత్రులకు తరలించే ప్రక్రియ పూర్తి చేశారు.

ఓ వైపు సహాయక చర్యలు జరుగుతుండగానే.. మరోవైపు నుంచి వాల్తేరు అధికారులు పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. డీఆర్‌ఎం, సీనియర్‌ అధికారులు, జిల్లా అధికార యంత్రాంగం విపత్తు నిర్వహణ బృందాలు, ఏజెన్సీల సమన్వయ కృషితో రెస్టొరేషన్‌ పనుల్ని వేగంగా పూర్తి చేశారు. దెబ్బతిన్న కోచ్‌లను తొలగించడంతో పాటు, పక్కనే ఉన్న ట్రాక్‌లలో ఉన్న గూడ్స్‌ ట్యాంకర్లను వేరు చేసే ప్రక్రియను తెల్లవారు జామునకల్లా పూర్తి చేశారు.

భారీ క్రేన్లు.. వెయ్యి మంది కార్మికులు
ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ మనోజ్‌ శర్మ, సీనియర్‌ అధికారుల బృంద పర్యవేక్షణలో ట్రాక్‌ల పునరుద్ధరణ పనులు జోరుగా సాగాయి. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఎప్పటికప్పుడు చర్యల్ని సమీక్షించారు. రైల్వే బోర్డు, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మెయిన్‌లైన్‌ పునరుద్ధరణ పనులపై దృష్టిసారించారు. 1000 మందికి పైగా కార్మికులు, సిబ్బంది, వివిధ విభాగాలకు చెందిన సూపర్‌వైజర్లు ఇందులో భాగస్వాములయ్యారు. రెండు 140 టన్నుల హెవీ డ్యూటీ క్రేన్‌లు, 15 ఎక్స్‌కవేటర్లు మిషన్‌ మోడ్‌ల ద్వారా ట్రాక్‌లను పునరుద్ధరించారు. కేవలం 19 గంటల వ్యవదిలోనే అప్‌ అండ్‌ డౌన్‌ ట్రాక్‌లని పునరు­ద్ధరించారు.

మొదటిగా డౌన్‌లైన్‌లో మధ్యాహ్నం 2.42 గంట­లకు గూడ్స్‌రైలు ప్రయాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. తర్వాత మధ్యాహ్నం 2.55 గంటలకు అప్‌లైన్‌లో భువనేశ్వర్‌–బెంగళూరు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ ప్రమాద స్థలిని క్రాస్‌ చేసింది.  మరికొన్ని మరమ్మతులు నిర్వహించి డౌన్‌లైన్‌లో రెండో ట్రైన్‌గా పూరీ–తిరుపతి–బిలాస్‌­పూర్‌ రైలును అనుమతించారు. కాగా,  ప్రమాదం జరిగి­న మధ్యలైన్‌ ట్రాక్‌లోనే విశాఖపట్నం రాయగడ రైలు లోకో.. కూరుకుపోయింది.  ట్రాక్‌లో లోతుగా కూరుకున్న ఇంజిన్‌ను తొలగించేందుకు తీవ్రంగా శ్రమించారు.  ఏఆర్‌టీ మెషీన్‌ తెచ్చి.. జాకీ మాది­రిగా వినియోగించారు. సోమ­వారం రాత్రి 11 గంటల వరకూ మూడో లైన్‌ పనులు కొనసాగాయి. తెగిపడిన హెచ్‌టీ లైన్ల విద్యుత్‌ పునరుద్ధరణ పనులూ పూర్తిచేశారు.  

హెల్ప్‌లైన్‌ నంబర్లు
రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): రైలు ప్రమాద ఘటన విషయం తెలియడంతో ఆదివారం రాత్రి నుంచే ప్రయాణికుల బంధువులు, కుటుంబ సభ్యుల ఆందోళనతో విజయవాడ రైల్వే స్టేషన్‌కు చేరుకుని తమ వారి గురించి ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ రైల్వే స్టేషన్‌తో పాటు డివిజన్‌లోని ప్రధాన రైల్వే స్టేషన్‌లలో ప్రయాణికుల జాబితాతో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి బంధువులు, కుటుంబ సభ్యులకు వారి గురించి సమాచారం అందిస్తున్నారు. 

విజయవాడ డివిజన్‌ వ్యాప్తంగా
ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ నంబర్లు..  
విజయవాడ:       0866–2576924
అనకాపల్లి:         08924–221698
తుని:                 08854–252172
సామర్లకోట:        0884–2327010
కాకినాడ టౌన్‌:    0884–2374227
రాజమండ్రి:       0883–2420541
నిడదవోలు:       0881–3223325
ఏలూరు:            0881–2232267
భీమవరం టౌన్‌:     0881–6230098
తెనాలి:           0864–4227600
ఒంగోలు:         0859–2280308
నెల్లూరు:         0861–2342028
గూడూరు:        9494178434  

మరిన్ని వార్తలు