ఏపీలో రానున్న రెండు రోజుల్లో వర్షాలు

12 Aug, 2021 08:26 IST|Sakshi

ఉత్తర కోస్తా మీదుగా ఉపరితల ద్రోణి

సాక్షి, విశాఖపట్నం: జార్ఖండ్‌ నుంచి ఒడిశా వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉత్తర కోస్తా మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఇప్పటివరకు నైరుతి నుంచి వాయువ్యం మీదుగా వీచిన గాలులు.. నేటి నుంచి దిశ మార్చుకొని నైరుతి నుంచి ఈశాన్యం మీదుగా వీచే అవకాశాలున్నాయి. ఫలితంగా.. వాతావరణంలో మార్పులు రానున్నాయి. ఎండ తీవ్రత క్రమంగా తగ్గనుంది. బుధవారం మాత్రం ఎండలు ఠారెత్తించాయి. అనేక చోట్ల సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

గురువారం కూడా ఎండలు ఇదే రీతిలో ఉండే అవకాశముంది. ఇదిలా ఉండగా.. ఈ నెల 16న కోస్తా తీరంలో అల్పపీడనం ఏర్పడి ఉత్తరాంధ్ర మీదుగా తెలంగాణ వైపు పయనించే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో 16 నుంచి వర్షాలు జోరందుకునే సూచనలున్నట్లు తెలిపింది. మరోవైపు ద్రోణి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని పేర్కొంది. 

మరిన్ని వార్తలు