అకాల వర్షాలతో రైతులు లబోదిబో

15 Apr, 2021 03:20 IST|Sakshi
విశాఖలో బుధవారం రాత్రి జిగేల్‌మన్న మెరుపుతీగ

పలు చోట్ల ఈదురు గాలులు, వడగండ్ల వానలు 

చిత్తూరు జిల్లాలో పిడుగు పాటుకు రైతు దుర్మరణం 

(విశాఖ దక్షిణ)/పీలేరు /గంగవరం(చిత్తూరు జిల్లా)/పెదదోర్నాల/హిందూపురం: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల ఈదురు గాలులతో భారీ వర్షాలు కురిశాయి. చిత్తూరు జిల్లాలో పిడుగు పాటుకు ఒకరు మరణించగా, ఓ ఆవు మృతి చెందింది. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో పలుచోట్ల వడగండ్ల వాన కురిసింది. కల్లాల్లో మిర్చి తడిసిపోయింది. శ్రీకాకుళం జిల్లా రాజాం, పాలకొండ తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది.

అనంతపురం జిల్లా హిందూపురంలో గాలివాన హోరెత్తింది. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడి విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. లేపాక్షి మండలంలోని కల్లూరు ఎస్సీ కాలనీలో కొబ్బరి చెట్టుపై భారీ శబ్దంతో పిడుగు పడటంతో స్థానికులు ఆందోళన చెందారు.

చిత్తూరు జిల్లా పీలేరు మండలం రెడ్డివారిపల్లెకు చెందిన రైతు పి.వెంకటరమణ (50) పిడుగుపాటుకు గురై మరణించగా.. గొర్రెలు మేపుకునేందుకు వెళ్లిన నాగరాజ, హరిబాబు, చంద్రకళ తీవ్రంగా గాయపడ్డారు. వారిని పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గంగవరం మండలం మామడుగు గ్రామానికి చెందిన త్యాగరాజులు పొలం వద్ద నుంచి పాడి పశువును ఇంటికి తోలుకొస్తుండగా పిడుగు పడింది. ఈ క్రమంలో ఆవును వదిలేసి త్యాగరాజులు పరుగులు తీశాడు. అయితే ఆవు మాత్రం అక్కడికక్కడే మృతి చెందింది.  

రానున్న 48 గంటల్లో మోస్తరు వర్షాలు
కొమరిన్‌ ప్రాంతం, దాని పరిసర ప్రాంతాల మీద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, పశ్చిమ బెంగాల్‌లో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా రానున్న 48 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు, కొన్ని చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈదురు గాలులు 30–40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంది.

బుధవారం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కురిసిన వర్షపాతం వివరాలు.. చిత్తూరు జిల్లా ముడివేడులో 58 మి.మీ, శ్రీకాకుళం జిల్లా భామనిలో 52, అనంతపురం జిల్లా హిందూపురం ఆర్టీవో ఆఫీసు ప్రాంతంలో 50, ప్రకాశం జిల్లా బి.చెర్లపల్లిలో 45, మార్కాపురం ప్రాంతంలో 44, అనంతపురం జిల్లా హిందూపూర్‌ ప్రాంతంలో 44, విజయనగరంలో 41 మి.మీ వర్షపాతం నమోదైందని అధికారులు చెప్పారు. పాడేరులో రెండు సెంటీ మీటర్లు, చింతపల్లిలో సెంటీ మీటర్‌ వర్షపాతం నమోదైంది.   

మరిన్ని వార్తలు