లోకేష్‌, అచ్చెన్న ఎడమొహం.. పెడమొహం

15 Apr, 2021 03:13 IST|Sakshi
మీడియా సమావేశంలో అంటీముట్టనట్లు కూర్చున్న అచ్చెన్నాయుడు, లోకేష్‌

అచ్చెన్న వీడియోపై అంతా గప్‌చుప్‌ 

నోరు మెదపని చంద్రబాబు, లోకేష్‌ 

లోలోన తీవ్ర అంతర్మథనం, పైకి మాత్రం గంభీరం 

పార్టీ నేతలు, శ్రేణుల్లో అయోమయం  

ఒకే వేదికపై అచ్చెన్న, లోకేష్‌ 

కలిసికట్టుగా వెళ్లినా మాటల్లేవ్‌.. 

వీడియో వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే ప్రమాణం డ్రామా  

సాక్షి ప్రతినిధి, తిరుపతి/ సాక్షి, అమరావతి: పార్టీ పరిస్థితి, లోకేష్‌ తీరుపై కింజారపు అచ్చెన్నాయుడు మాట్లాడిన వీడియో బహిర్గతమై తీవ్ర కలకలం రేపిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు దానిపై మౌనముద్ర దాల్చారు. మిగిలిన అన్ని విషయాలపై మీడియాలో ఎడతెగకుండా మాట్లాడే నాయకులు.. ఈ వీడియో విషయమై నోరు మెదప లేదు. మాట్లాడితే ఏమి ఇబ్బంది వస్తుందోనని ముఖ్య నాయకులు నోటికి తాళం వేసుకున్నారు. కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించినా స్పందించడానికి ఇష్టపడ లేదు. చంద్రబాబు సైతం దీనిపై నోరు మెదపలేదు. కానీ అచ్చెన్నాయుడుతో ఈ వీడియో గురించి చర్చించినట్లు తెలిసింది. అందులో మాట్లాడిన విషయాలపై అచ్చెన్న ఆయనకు వివరణ ఇచ్చినట్లు చెబుతున్నారు.

మరోవైపు లోకేష్‌ కూడా లోలోన దీనిపై రగిలిపోతున్నా, పైకి మాత్రం అందులో మాట్లాడింది తన గురించి కాదన్న రీతిలో బిల్డప్‌ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. తిరుపతిలో బుధవారం ఒక కార్యక్రమంలో అచ్చెన్నాయుడిపై చేయి వేసి మరీ హడావుడి చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా కలిసికట్టుగా కార్యక్రమం చేపట్టారనడం మినహా, చివరి వరకూ ఇరువురూ ఎడమొహం, పెడమొహంగా వ్యవహరించారు. లోకేష్‌ మీడియాతో మాట్లాడే సమయంలో అచ్చెన్నాయుడు వెనుక ఉండిపోయారు. ఎమ్మెల్యే రామానాయుడు మాత్రమే పక్కన నిల్చొన్నారు. 

అంతేగా.. అంతేగా..
తెలుగుదేశం పార్టీలో అంతర్గత పరిస్థితి ఏమిటో ఆ వీడియోతో తేటతెల్లం అయ్యిందని ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. లోకేష్‌పై తెలుగుదేశం నేతల్లో ఏమాత్రం నమ్మకం లేదన్న విషయం నిజమేనని, ఇప్పటికే ఆయన అనేక రకాలుగా అభాసుపాలయ్యారని కూడా మాట్లాడుకుంటున్నారు. ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోవడం, మాట్లాడే పద్ధతి ఇప్పటికీ అలవాటు కాకపోవడం పెద్ద మైనస్‌ అని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నిక ముగిస్తే తెలుగుదేశం కార్యకలాపాలు మరింత డీలా పడతాయన్న అచ్చెన్నాయుడు మాటలు అక్షర సత్యం కానున్నాయని వివరిస్తున్నారు.

అచ్చెన్నాయుడిలో ఇంకా చాలా అసంతృప్తి ఉందని, వీడియోలో కొంత వరకే బయటకు వచ్చిందని ఆ పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. లోకేష్‌ వల్ల పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందనే అభిప్రాయం ప్రతి ఒక్కరిలో ఉందని విజయవాడకు చెందిన ఒక నాయకుడు వ్యాఖ్యానించారు. పార్టీ క్యాడర్‌ దీనిపై ఆందోళనకు గురవుతోంది. అసలే అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితుల్లో అధ్యక్షుడి హోదాలో ఉన్న అచ్చెన్నాయుడే పార్టీ పట్ల అంత అసంతృప్తితో ఉంటే ప్రజలను ఎలా మెప్పించగలమని వాపోతున్నారు. 

ఇక్కడ చదవండి:

17 తర్వాత పార్టీ లేదు.. టీడీపీ పని అయిపోయింది: అచ్చెన్నాయుడు

చంద్రబాబు నుంచి ప్రాణ హాని..  పార్టీ ముఖ్య నాయకుల నుంచి బెదిరింపు కాల్స్‌ 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు