-

Fact Check: రేవులపై ఈనాడు గావుకేకలు

26 Nov, 2023 05:45 IST|Sakshi

రేవుల్లో దొంగలు పడ్డారంటూ రామోజీ మరో తప్పుడు కథనం

గతంలో టెండర్లు దక్కించుకున్న సంస్థ గడువు పూర్తి

కొత్త ఏజెన్సీలకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆధ్వర్యంలో పారదర్శకంగా టెండర్లు ఖరారు

వీటితో ఒప్పందాలు జరుగుతున్న దశలో ఈనాడు వికృత రాతలు

ప్రస్తుతం ఇసుక కొరత రాకుండా పాత ఏజెన్సీతోనే ఇసుక తవ్వకాలు

దీనిపైనా ఈనాడు కుట్రపూరితంగా క్షుద్ర రాతలు

ప్రతిసారీ సంబంధంలేని సీఎంఓపై ఆరోపణలు

ప్రజల్లో అపోహలు పెంచడమే లక్ష్యంగా రామోజీ అసత్య కథనాలు : వీజీ వెంకటరెడ్డి

సాక్షి, అమరావతి : గతంలో టెండర్లు దక్కించుకున్న సంస్థ గడువు పూర్తయింది.. కొత్త టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా పూర్తయింది.. ఈలోపు ఇసుక కొరత రాకూడదన్న ఉద్దేశ్యంతో పాత సంస్థతో తవ్వకాలు జరిపిస్తున్నారు.. ఈ పద్ధతి ప్రతీ కాంట్రాక్టు విధానంలో ఉన్నదే.. అయినా, ఇదంతా ఈనాడు రామోజీరావుకు తెలియంది ఏమీకాదు.. కానీ, ఆయన ఎందుకు దీనిపై పదేపదే టన్నులకొద్దీ విషం కక్కుతున్నారు? ఇందుకు జవాబు ఒక్కటే.. సీఎం జగన్‌ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని గుడ్డిగా వ్యతిరేకించడమే ఆయన లక్ష్యం.

ఈ క్రమంలో ఆయన జరగని తప్పుని జరిగిందని నమ్మించేందుకు పదేపదే విషం చిమ్ముతూ తన వికృత రూపాన్ని మళ్లీమళ్లీ ఆవిష్కరించుకుంటున్నారు. ఇసుక తవ్వకాల్లో ఎలాంటి లోపాల్లేవని, అంతా పారదర్శకంగా ఉందని తెలిసినా బురదజల్లడం ద్వారా ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు ఆయన నానాగడ్డి కరుస్తున్నారు. ‘రేవుల్లో దొంగలు పడ్డారు’ అంటూ పచ్చి అబద్ధాల కథనాన్ని ఈనాడు మరోసారి వండి వార్చింది.

చంద్రబాబు హయాంలో ఉచిత ఇసుక విధానం పేరుతో జరిగిన అడ్డగోలు దోపిడీ.. దాడులకు అడ్డుకట్ట వేస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ అత్యంత పారదర్శక ఇసుక విధానాన్ని అమలుచేస్తుండడం రామోజీకి అస్సలు నిద్రపట్టనీయడంలేదు. అందుకే నిత్యం దానిపై చిలువలు పలువలుగా వక్రీకరించి తప్పుడు కథనాలు రాస్తున్నారు. 

ఇసుక కొరత రాకూడదనే..
కొత్త ఏజెన్సీలు ఇసుక ఆపరేషన్స్‌ ప్రారంభించే వరకు నిర్మాణ రంగానికి ఇసుక కొరత ఉండకూడదనే ఉద్దేశంతోనే గనుల శాఖ పాత ఏజెన్సీతో ఇసుక ఆపరేషన్స్‌ చేయిస్తోంది. ఏ కాంట్రాక్టులో అయినా ఇలాంటి నిబంధనలు సర్వసాధారణంగా ఉంటాయి. దీనికి సీఎంఓతో సంబంధం ఏమిటి? ఇసుక ఆపరేషన్స్‌ అనేది గనుల శాఖకు సంబంధించిన వ్యవహారం. రీచ్‌లకు లీజు అనుమతుల మంజూరు గనుల శాఖ ద్వారా జరుగుతుందే తప్ప సీఎంఓ నుంచి కాదు. ఈనాడుకు ఈ విషయం తెలిసినా కనీస అవగాహన లేనట్లు నటిస్తూ అబద్ధాల బురద జల్లుతోంది.

మరోవైపు.. ఇసుక అక్రమాలపై నిఘా కోసం ఈ ప్రభుత్వం ఎస్‌ఈబీని ఏర్పాటుచేసింది. జిల్లా స్థాయిలో రెవెన్యూ, పోలీస్, గనుల శాఖ అధికారులు కూడా తమకు ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. గనుల శాఖలో ప్రతి జిల్లాకు ఒక విజిలెన్స్‌ స్క్వాడ్‌ కూడా పనిచేస్తోంది. అంతేకాక.. రాష్ట్ర సరిహద్దులతో పాటు కీలకమైన ప్రాంతాల్లో చెక్‌ పోస్ట్‌లతో అక్రమాలు నిరోధిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఒకే అబద్ధాన్ని పదేపదే చెప్పడం ద్వారా దానిని నిజంగా చిత్రీకరించడానికి ఈనాడు తెగ తాపత్రయపడుతోంది.

ఈ ప్రభుత్వ చర్యలతో ఎన్జీటీ సంతృప్తి..
కానీ, ఎలాంటి విమర్శలకు అవకాశంలేకుండా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ, మినీరత్నగా గుర్తింపు పొందిన ఎంఎస్‌టీసీ ద్వారా ఈ ప్రభుత్వం ఇసుక టెండర్లు నిర్వహించింది. పారదర్శక విధానం, సులభతరంగా ఇసుక లభ్యత, అందుబాటు ధరల్లో వినియోగదారులకు చేరువ చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. అదే క్రమంలో పర్యావరణానికి ఎటువంటి విఘాతం ఏర్పడకుండా, పూర్తి అనుమతులతో ఇసుక ఆపరేషన్స్‌ జరిగేలా చర్యలు తీసుకుంది.

దీంతో.. ఇసుక పాలసీ ద్వారా ప్రభుత్వం తీసుకున్న చర్యలను పరిశీలించిన ఎన్జీటి సంతృప్తి వ్యక్తంచేస్తూ, గత ప్రభుత్వ తప్పిదాలవల్ల విధించిన రూ.100 కోట్ల జరిమానాను కూడా రద్దుచేసింది. ఈ విషయం ’ఈనాడు’కు తెలియనిదేం కాదు. వాస్తవాలిలా ఉంటే.. జిల్లాల్లో అక్రమ ఇసుక దందా జరుగుతోందని ఈనాడు అబద్ధాలను పోగేసి అవాస్తవాలతో కూడిన కథనాన్ని ఇష్టానుసారం రాసిపారేసింది.

గతంలోని అక్రమాలు ఈనాడుకు కనిపించలేదా?
టీడీపీ హయాంలో ఉచిత ఇసుక విధానం పేరుతో పెద్దఎత్తున ఇసుక మాఫియా జేబులు నింపుకున్న రోజుల్లో ఈనాడుకు ఆ అక్రమాలు కనిపించలేదు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత పారదర్శకంగా ఇసుక విధానాన్ని తీసుకొచ్చి, ప్రజలకు అందుబాటు ధరలో, కొరతలేకుండా ఇసుకను అందిస్తుంటే ఈనాడు తట్టుకోలేకపోతోంది. నిజానికి.. టీడీపీ హయాంలో ఇసుక దోపిడీకి బరితెగించిన చంద్రబాబు ఉచిత విధానం ముసుగులో నిర్లజ్జగా అన్ని విధి విధానాలను ఉల్లంఘించారు. 

♦ కేంద్ర ప్రభుత్వ చట్టం, గ్రీన్‌ ట్రిబ్యునల్‌ మార్గదర్శకాలను తుంగలో తొక్కడంతోపాటు కేబినెట్‌ను చీకట్లో ఉంచి మరీ దోపిడీకి తెగబడ్డారు. 
♦ కానీ, ఇప్పుడు పారదర్శకంగా ఇసుక తవ్వ కాలను నిర్వ హిస్తుండటంతో రాష్ట్ర ప్రభు త్వానికి ఏటా రూ.760 కోట్లకు పైగా ఆదాయం సమ కూరుతోంది. 
♦ అంటే గత చంద్రబాబు సర్కారు ఐదేళ్ల పాలనలో ఖజానాకు రూ.3,825 కోట్ల మేర చంద్రబాబు గండి కొట్టినట్లు స్పష్టమవుతోంది. 
♦ ప్రభుత్వానికి రావాల్సిన ఈ ఆదాయం అంతా చంద్రబాబు బినామీలు, సన్నిహితులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు చేరిపోయింది. 

ఎంఎస్‌టీసీ  ద్వారా  టెండర్ల ప్రక్రియ  కనిపించడం లేదా?
రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్‌ కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తింపు పొందిన మినీరత్న ఎంఎస్‌టీసీ ద్వారా టెండర్లు నిర్వహిస్తున్న విషయం పచ్చవిషం నింపుకున్న రామోజీ కళ్లకు కనిపించడంలేదు. గతంలో నిర్వహించిన టెండర్లలో జయప్రకాష్‌ వెంచర్స్‌ ఎంపిక కాగా.. దానికి ఇచ్చిన గడువు పూర్తవ్వడంతో మరోసారి ఎంఎస్‌టీసీ ద్వారా గనుల శాఖ టెండర్ల ప్రక్రియ నిర్వహించింది. ఇందులో రెండు ఏజెన్సీలు ఎంపికయ్యాయి.

ఇదే విషయాన్ని ఈనాడు కూడా రాసింది. వాటితో ఒప్పందాలు జరుగుతున్నాయి. ఇవి కూడా తుది దశలో ఉన్నాయి. అగ్రిమెంట్లపై సంతకాలు కాగానే ఆ సంస్థలు ఇసుక ఆపరేషన్స్‌ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. అప్పటివరకు పాత ఏజెన్సీ ద్వారానే అనుమతి ఉన్న అన్ని రీచ్‌ల్లో ఇసుక ఆపరేషన్స్‌ జరగడం సహజం. ఇదే విషయాన్ని గనుల శాఖ గతంలోనూ స్పష్టంచేసింది. అయినా.. ‘పచ్చ’ కామెర్లు సోకిన ఈనాడుకు అదేమీ అర్థంకావడంలేదు.

అప్పట్లో విచ్చలవిడిగా దాడులు..
అంతేకాక.. ఉచితం ముసుగులో టీడీపీ నేతలు విచ్చలవిడిగా దాడులకు తెగబడుతూ దోపిడీ పర్వం సాగించారు. వినియోగదారులు బ్లాక్‌ మార్కెట్‌ నుంచి అధిక ధరలకు ఇసుకను కొనుగో లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెద్దఎత్తున ఇసుక లారీలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయేవి. వీటిని అడ్డుకున్నందుకు ఎమ్మార్వో వనజాక్షిపై నాటి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ విచక్షణారహితంగా దాడులకు బరితెగించారు.

అసలు ఉచితంగా ఇసుక ఇస్తే ఈ దాడులకు పాల్పడాల్సిన అవసరం ఏమొచ్చింది? అలాగే, స్వయంగా నాటి సీఎం చంద్రబాబు కరకట్ట నివాసం పక్కనే ఇష్టారాజ్యంగా ఎడాపెడా ఇసుక లూటీ జరుగుతున్నా కళ్లు మూసుకుని కూర్చోవ డాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) తీవ్రంగా తప్పుబడుతూ రూ.100 కోట్ల జరిమానా సైతం విధించింది. రాష్ట్ర సంపదను దోచేస్తున్నారని ఆక్షేపించినా చంద్రబాబు పట్టించుకోలేదు.

ప్రభుత్వంపై గుడ్డి వ్యతిరేకతతోనే..
ఇసుక ఆపరేషన్స్‌ విష­యంలో పకడ్బందీగా వ్యవహరిస్తున్నాం. పలు దశల్లో పర్యవేక్షణ జరుగుతున్నా ఈనాడు పత్రిక అదే పనిగా వ్యతిరేక కథనాలు ప్రచురించడం విడ్డూరంగా ఉంది. కళ్ల ముందు కనిపిస్తున్న దానిని చూడకుండా, ప్రభుత్వంపై గుడ్డి వ్యతిరేకతతో, నిత్యం ఏదో ఒక రకంగా దుష్ప్రచారం చేయాలనే లక్ష్యంతోనే ఇసుకపై తప్పుడు కథనాలను ప్రచురిస్తోంది. ఇలా ఇష్ట మొచ్చినట్లు వార్తలు ప్రచురిస్తున్న ఈనాడుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. – వీజీ వెంకటరెడ్డి, డైరెక్టర్, గనుల శాఖ

మరిన్ని వార్తలు