మంచు‘మాయం’

26 Nov, 2023 05:48 IST|Sakshi

డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న గ్లోబల్‌ వార్మింగ్‌

వేగంగా కరిగిపోతున్న మంచు పర్వతాలు

2100 నాటికి హిందూకుష్‌లో 30 నుంచి 50 శాతం మంచు కనుమరుగయ్యే అవకాశం

ఇప్పటికే పెరూలోని హిమానీనదాల వైశాల్యం సగానికిపైగా తగ్గుదల

పొంచి ఉన్న భారీ వరదల ముప్పు.. తీవ్ర నీటి ఎద్దడి ప్రమాదం  

సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా భూతాపం పెరిగిపోతోంది. మంచుపర్వతాలు కరిగి­పోతు­న్నాయి. హిమానీనదాలు క్రమంగా మాయమై­పోతున్నాయి. ఆసియాలోని హిందూ కుష్‌తో పాటు పెరూ మంచు పర్వతాల్లోని హిమానీనదాల తగ్గుదల పర్యావరణవేత్తలను, శాస్త్రవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచంలోని హిమానీ­నదాల్లో దశాబ్ద కాలంలో 332 గిగాటన్నుల మంచు అదృశ్యమైందని అంచనా.

ఇక ఆసియాలోని హిందూ కుష్‌ హిమాలయాలు అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, చైనా, భారత్, మయన్మార్, నేపాల్, పాకిస్తాన్‌ మీదుగా 3,500 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ప్రస్తుతం ఇవి వేగంగా కరిగిపోతు­న్నాయి. ఈ శతాబ్దం చివరి నాటికి వాటి పరిమాణంలో 75 శాతం వరకు కోల్పోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇదే జరిగితే.. ఈ హిమా­నీనదాల దిగువ ప్రాంతాలను వరదలు ముంచెత్తుతాయని, తీవ్ర నీటి ఎద్దడి తప్పదని శాస్త్రవేత్త­లు హెచ్చరిస్తున్నారు. దాదాపు 200 కోట్ల మంది ప్రజలపై ఈ ప్రభావం పడుతుందని చెబుతు­న్నారు. హిమాలయ పర్వతాల దిగువున ఉన్న 12 హిమానీనదాల్లోని నీటి లభ్యత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరెస్ట్‌ శ్రేణుల్లో గత 30 ఏళ్లలోనే 2 వేల సంవత్సరాలకు సంబంధించిన మంచు కరిగిపోయిందని పరిశోధకులు తేల్చారు.  

భూతాపంతో భారీ నష్టం..
భూతాపాన్ని 1.5 డిగ్రీల వద్ద కట్టడి చేయడంలో ప్రపంచ దేశాలన్నీ విఫలమయ్యాయి. ఫలితంగా సెప్టెంబర్‌ 17న భూతాపం 2 డిగ్రీల మార్కును చేరుకుంది. ఇదే పరిస్థితి కొనసాగితే హిందూకుష్‌ హిమానీ నదాలు 2100వ సంవత్సరం నాటికి 30 నుంచి 50 శాతం మేర కనుమరుగవుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా భూతాపం 3 డిగ్రీల మార్కుకు చేరితే నేపాల్, భూటాన్‌లలో 75 శాతం మేర మంచు కరిగిపోయే ప్రమాదముంది. అదే 4 డిగ్రీలకు పెరిగితే నష్టం 80 శాతానికి చేరుకుంటుంది. 

పెరూలో దారుణ పరిస్థితి..
ప్రపంచంలోని ఉష్ణమండల హిమానీనదాల్లో 68 శాతం పెరూలో ఉన్నాయి. గత ఆరు దశాబ్దాల్లో తలెత్తిన వాతావరణ మార్పుల వల్ల పెరూలోని హిమానీనదాల వైశాల్యం సగానికి పైగా తగ్గిపోయింది. 2016– 2020 మధ్య తలెత్తిన వాతావరణ మార్పులతో 175 హిమానీనదాలు అంతరించిపోయినట్టు పెరూవియన్‌ శాస్త్రవేత్తలు తేల్చారు. ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించి తాజా పరిస్థితిని అంచనా వేస్తున్నారు.

పెరూలోని కొన్ని పర్వత శ్రేణుల్లో ప్రస్తుతం 1,050 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోనే మంచు ఉంది. 1962వ సంవత్సరంలో 2,399 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మంచు ఉండేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూతాపం ఇలాగే కొనసాగితే పెను వినాశనం తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. 

మరిన్ని వార్తలు